బిగ్ బ్రేకింగ్: సీఎం రేవంత్ రెడ్డికి రెండు ఓట్లు.. ఒకే ఎపిక్ నంబర్ తో కలకలం!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రెండు వేర్వేరు నియోజకవర్గాల్లో ఓటు హక్కు ఉందనే వార్త రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని అచ్చంపేటలోనూ, మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని కొడంగల్ నియోజకవర్గంలోనూ ఆయన పేరుతో ఓట్లు నమోదై ఉన్నాయి. ఆశ్చర్యకరంగా ఈ రెండు చోట్ల కూడా ఓటరు గుర్తింపు కార్డు (EPIC) నంబర్ TES0274035 ఒకటే కావడం గమనార్హం. దేశంలో ‘ఓట్ల చోరీ’ జరుగుతోందని పదే పదే ఆరోపించే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. సాక్షాత్తూ తన పార్టీకి చెందిన ముఖ్యమంత్రికే ఇలా రెండు చోట్ల ఓట్లు ఉండటంపై ఏమని సమాధానం చెబుతారని ప్రతిపక్షాలు, నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

అయితే, ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు హక్కు ఉంటే చట్టప్రకారం ఏడాది పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందని ఇటీవలే ఎన్నికల సంఘం (ఈసీ) కఠినంగా హెచ్చరించింది. సరిగ్గా ఇలాంటి వ్యవహారంలోనే బహుళ ప్రాంతాల్లో ఓటు హక్కు కలిగి ఉన్నారనే అభియోగాలపై ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్‌కు బెంగళూరు కోర్టు ఇటీవలే నాన్-బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. ఈ ఘటన ఇంకా వార్తల్లో ఉండగానే, ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పేరుతోనే ఒకే ఎపిక్ నంబర్‌తో రెండు చోట్ల ఓట్లు నమోదు కావడం సంచలనంగా మారింది. ఇది ఎన్నికల అధికారుల సాంకేతిక లోపమా కాదా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉండగా, ఈ వ్యవహారంపై ఈసీ మరియు సంబంధిత వర్గాలు ఎలా స్పందిస్తాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.


