బంగ్లాదేశ్‌లో ఆగని హిందువుల ఊచకోత.. పసివాడిని కూడా వదలని ఉన్మాదులు!
బంగ్లాదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. రంగ్‌పూర్ నగరంలోని కమల్కషానా మచువాపారా ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హిందువుల కుళ్లిపోయిన మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం (ఆగస్టు 22) రాత్రి ఈ దారుణం వెలుగుచూసింది. ఇంటికి బయట నుంచి తాళం వేసి ఉండటం, లోపలి నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తుండటంతో స్థానికులు, బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మెయిన్ గేటు తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించగా ఈ భయానక దృశ్యం వెలుగులోకి వచ్చింది.
మృతులను పదవీ విరమణ పొందిన పాఠశాల ఉపాధ్యాయుడు గణపతి చక్రవర్తి జ్యువెల్ (65), ఆయన భార్య ప్రీతిలత చక్రవర్తి బాల (50), కుమార్తె కంది చక్రవర్తి (25), కుమారుడు ప్రియం చక్రవర్తి (12)గా పోలీసులు గుర్తించారు. వీరి మృతదేహాలు ఇంట్లో వేర్వేరు చోట్ల లభించడం పలు అనుమానాలకు తావిస్తోంది. గణపతి చక్రవర్తి మృతదేహం ఇంటి పైకప్పుపై కనిపించగా, భార్య ప్రీతిలత, కూతురు కంది మృతదేహాలు మూడో అంతస్తుకు వెళ్లే మెట్లపై లభ్యమయ్యాయి. ఇక 12 ఏళ్ల కుమారుడు ప్రియం మృతదేహం ఒక మంచం కింద గుర్తించినట్లు రంగ్‌పూర్ కొత్వాలీ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇన్-చార్జ్ నజ్ముల్ ఖాదర్ తెలిపారు.
ఈ కుటుంబంతో చివరిసారిగా గురువారం (ఆగస్టు 20) రాత్రి ఫోన్లో మాట్లాడినట్లు ప్రీతిలత సోదరి పూజా చక్రవర్తి తెలిపారు. శనివారం ఉదయం నుంచి వారిని సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో, శనివారం రాత్రి 9 గంటల సమయంలో తన భర్తతో కలిసి ఆమె సోదరి ఇంటికి వెళ్లారు. ఇంటికి బయటి నుంచి తాళం వేసి ఉండటంతో అనుమానం వచ్చి వెంటనే బంగ్లాదేశ్ ఎమర్జెన్సీ నంబర్ 999కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. డిసెంబర్లోనే రిటైర్ అయిన గణపతి చక్రవర్తి, స్థానిక రంగ్‌పూర్ కోఆపరేటివ్ మార్కెట్లో హోమియోపతి వైద్య సేవలు అందిస్తుండేవారు. ఆయన కుమార్తె ఇంగ్లీష్‌లో మాస్టర్స్ పూర్తి చేయగా, కుమారుడు ఐదో తరగతి చదువుతున్నాడు.
ఈ ఘటనపై పోలీసులు, సీఐడీ (క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్), ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలు సేకరించి దర్యాప్తు ముమ్మరం చేశాయి. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం రంగ్‌పూర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. పక్కా ప్రణాళికతో చేసిన హత్య, దోపిడీ లేదా కుటుంబ కలహాలు తదితర కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఆగస్టులో బంగ్లాదేశ్‌లో జరిగిన రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ మార్పు తర్వాత హిందూ సమాజంపై దాడులు పెరుగుతున్నాయనే ఆందోళనల నడుమ ఈ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. దర్యాప్తు పూర్తయితే కానీ ఈ హత్యల వెనుక ఉన్న అసలు కారణాలు తెలియవని పోలీసులు పేర్కొన్నారు.


