శివయ్య ముందు బూట్లా? చంద్రబాబు, నాగబాబుల తీరుపై భగ్గుమంటున్న హిందువులు!
సనాతన ధర్మం గురించి వేదికలెక్కి మైకుల్లో ఉపన్యాసాలు దంచడం కాదు, ఆచరణలో చూపించాలన్న కనీస సంస్కారం ఈ పాలకులకు లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా నియమితులైన కొణిదెల నాగబాబు దంపతులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంలో చోటుచేసుకున్న దృశ్యాలు హిందూ సమాజాన్ని తీవ్ర విస్మయానికి గురిచేస్తున్నాయి. హిందూ ధర్మ రక్షణ అని గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి స్వయంగా పరమ పవిత్రమైన శివయ్య విగ్రహం సాక్షిగా వ్యవహరించిన తీరు వారి హిందూత్వ చిత్తశుద్ధిని, ఆచరణను నిలదీస్తోంది.
సాక్షాత్తూ ఆ లయకారుడి విగ్రహం ఎదుట, బూట్లు, చెప్పులు వేసుకుని దర్జాగా నిలబడి ఫోటోలకు పోజులివ్వడం ఏ రకమైన హిందూ సంప్రదాయమో చంద్రబాబు గారే సెలవివ్వాలి. పది మందికి ఆదర్శంగా నిలవాల్సిన నాయకులు, మీడియా కెమెరాలు తమను బంధిస్తున్నాయన్న సోయి కూడా లేకుండా, దేవుడి పట్ల కనీస భక్తిశ్రద్ధలు మర్చిపోయి ఇలా ప్రవర్తించడం దారుణం. శివయ్య ఎదుట బూట్లతో నిలబడే ఈ అహంకారం చూస్తుంటే, తాము భగవంతుడికంటే అధికులమన్న అజ్ఞానంలో ఈ నాయకులు ఉన్నారా అన్న అనుమానం కలగక మానదు.
ఈ సందర్భంగా ఒక పాత సంఘటనను వీరికి గుర్తు చేయక తప్పదు. ఒకప్పుడు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు మీరే స్వయంగా ఒక దేవుడి విగ్రహాన్ని బహుకరించినప్పుడు, ఆయన మీ ఎదుటే వేదికపై తన బూట్లు విప్పి, ఎంతో భక్తిశ్రద్ధలతో ఆ విగ్రహాన్ని స్వీకరించిన దృశ్యం మీకు గుర్తులేదా? ప్రపంచం కీర్తించే ఒక క్రీడాకారుడికి మన సనాతన ధర్మం పట్ల, దేవుడి పట్ల ఉన్న కనీస గౌరవం, సంస్కారం… నిత్యం సనాతన ధర్మం అంటూ ఉపన్యాసాలు దంచే మీకు, మీ చుట్టూ ఉన్న నాయకులకు లేకుండా పోవడం సిగ్గుచేటు కాదా?
ఈ తంతు జరుగుతున్నప్పుడు అక్కడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత అన్నగారు నాగబాబు కూడా ఉండటం మరో వ్యంగ్యం. వ్యక్తుల ముందు, అధినేతల ముందు వంగి వంగి దండాలు పెడుతూ చూపించే శ్రద్ధలో పదో వంతు కూడా మన హిందూ దేవతామూర్తుల పట్ల చూపించకపోవడం విచారకరం. భౌతికమైన అధికార పీఠం మీదున్న వ్యక్తులపై ఉండే భయభక్తులు, సమస్త లోకాలను శాసించే ఆ మహాదేవుడిపై ఎందుకు ఉండవు?
నిన్న మొన్నటి వరకూ దేవస్థానాల పవిత్రత దెబ్బతిన్నదంటూ, అపచారం జరిగిందంటూ ఉపముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్షలు చేశారు కదా, మరి ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి, తన సొంత అన్నగారు కలిసి శివయ్య విగ్రహం ముందు చెప్పులతో నిలబడి చేసిన ఈ ఘోర అపచారానికి ఏ దీక్ష చేస్తారో సమాధానం చెప్పాలి. హిందూ ధర్మం అంటే కేవలం మైకుల్లో చెప్పే మాటలు కాదు, అది మన నడవడికలో కనిపించాలి. ఉపన్యాసాలకే పరిమితమైన మీ సనాతన ధర్మం, ఇలా చెప్పుల కాలితో దేవుడిని అవమానించడమేనా అని నేడు సగటు హిందువు తీవ్రంగా ప్రశ్నిస్తున్నాడు.


