కన్నతల్లికి దూరం చేసిన బంగ్లా రాక్షసత్వం! కడసారి చూపుకూ నోచుకోని చిన్మయ్ దాస్
బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలకు, ఆ దేశ ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు తాజా ఉదాహరణ ఈ హృదయ విదారక ఘటన. తమ హక్కుల కోసం గళమెత్తిన పాపానికి దాదాపు రెండేళ్లుగా జైలులో మగ్గుతున్న ప్రముఖ హిందూ సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ పట్ల మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ఇస్లామిక్ ప్రభుత్వం అత్యంత క్రూరంగా వ్యవహరించింది. క్యాన్సర్ తో పోరాడుతూ మరణశయ్యపై ఉన్న తన కన్నతల్లిని కడసారి చూసుకునేందుకు కూడా ఆ హిందూ సాధువుకు అనుమతి నిరాకరించింది.
చిన్మయ్ కృష్ణ దాస్ తల్లి సంధ్యా రాణి ధార్ (70) గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతూ చట్టోగ్రామ్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందారు. తన చివరి రోజులను కొడుకు చిన్మయ్ కృష్ణ దాస్ కు సంబంధించిన ఆశ్రమం (పుండరీక్ ధామ్) లో గడపాలని ఆకాంక్షించారు. పరిస్థితులు విషమించడంతో సెప్టెంబర్ 10, 2026 ఉదయం ఆమె కన్నుమూశారు. చనిపోవడానికి ముందు తన కుమారుడిని ఒక్కసారైనా చూడాలని ఆమె బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. తన సోదరుడిని పెరోల్ పై విడుదల చేయాలని చిన్మయ్ దాస్ కుటుంబ సభ్యులు అధికారులకు ఎన్నో విజ్ఞప్తులు చేశారు.
కానీ, హిందూ వ్యతిరేక బుద్ధితో రగిలిపోతున్న బంగ్లా యంత్రాంగం “బంధువులు అనారోగ్యంతో ఉంటే పెరోల్ ఇచ్చే చట్టం లేదు, చనిపోతేనే ఇస్తాం” అంటూ అత్యంత అమానవీయంగా, నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది. తల్లి బతికుండగా కనీసం ఒక్కసారి ఆమెను చూసేందుకు ఆ హిందూ సన్యాసికి అవకాశం ఇవ్వలేదు.
తల్లి కన్నుమూసిన తర్వాత, కేవలం అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం చిన్మయ్ కృష్ణ దాస్ కు గురువారం మధ్యాహ్నం 5 గంటల పాటు పెరోల్ మంజూరు చేసింది. జైలు నుంచి బయటకు వచ్చిన ఆ సన్యాసి, ప్రాణం లేని కన్నతల్లి దేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు ప్రతి ఒక్కరినీ కలచివేసింది. తన కన్నతల్లి కడసారి కోరిక తీర్చలేకపోయానన్న నిస్సహాయత ఆయనలో స్పష్టంగా కనిపించింది. కేటాయించిన సమయం ముగియగానే రాత్రి 8:30 గంటలకు అధికారులు ఆయనను తిరిగి జైలుకు తరలించారు.
కక్షపూరిత అరెస్ట్… కుట్రపూరిత కేసులు (టైమ్‌లైన్)
ఆగస్టు 2024లో బంగ్లాదేశ్ లో జరిగిన హింసాత్మక ఆందోళనల తర్వాత షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయి, మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఇస్లామిక్ మూకలు దేశవ్యాప్తంగా హిందువులపై దాడులు తీవ్రం చేశాయి.
- సనాతన జాగరణ్ మంచ్ ప్రతినిధి అయిన చిన్మయ్ కృష్ణ దాస్ ఈ దాడులను తీవ్రంగా ఖండించారు. హిందువుల రక్షణ కోసం, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు కోసం శాంతియుత ర్యాలీలు నిర్వహించారు.
- హిందువులను ఏకం చేస్తున్నారన్న ఒకే ఒక్క కారణంతో నవంబర్ 25, 2024న ఢాకా విమానాశ్రయంలో ఆయనను అక్రమంగా అరెస్టు చేశారు.
- దేశభక్తి ముసుగులో జాతీయ జెండాను అవమానించారంటూ తప్పుడు దేశద్రోహం కేసు బనాయించారు.
- ఆ తర్వాత హత్య, హత్యాయత్నం వంటి మరో ఆరు కల్పిత క్రిమినల్ కేసులను ఆయనపై రుద్దారు.
- కోర్టు నాలుగు కేసుల్లో ఆయనకు బెయిల్ మంజూరు చేసినా, ఉద్దేశపూర్వకంగా ఇతర కేసులను అడ్డుపెట్టుకుని ఆయనను దాదాపు రెండేళ్లుగా జైలులోనే నిర్బంధించారు.
కనీస మానవత్వం లేకుండా మరణిస్తున్న తల్లిని చూసేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడం బంగ్లాదేశ్ ప్రభుత్వ మతోన్మాదానికి, మెజారిటీ ముస్లిం యంత్రాంగానికి హిందువుల పట్ల ఉన్న ద్వేషానికి అద్దం పడుతోంది. హిందువుల హక్కుల కోసం పోరాడినందుకే ఒక సన్యాసిని చట్టాల పేరుతో ఇలా వేధించడం అంతర్జాతీయ సమాజం కళ్లు తెరవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది.


