బ్రిటన్ జైళ్లలో ఇస్లామిక్ ముఠాల ఆధిపత్యం: ఆందోళన వ్యక్తం చేస్తున్న అధికారులు
ఇటీవల కాలంలో యునైటెడ్ కింగ్డమ్ (UK) జైళ్లలో ముస్లింయేతర ఖైదీలను బలవంతంగా ఇస్లాంలోకి మారుస్తున్నారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ముస్లిం జైలు ముఠాలు శ్వేతజాతి బ్రిటీష్ పురుషులను లక్ష్యంగా చేసుకుని, వారిని ఇస్లాంలోకి మారేలా ఒత్తిడి చేస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి.
కన్జర్వేటివ్ పార్టీకి చెందిన షాడో జస్టిస్ సెక్రటరీ నిక్ తిమోతీ ఈ విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కిక్కిరిసిపోయిన UK జైళ్లలో జరుగుతున్న ఈ బలవంతపు మత మార్పిడుల ముప్పును అరికట్టేందుకు లేబర్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇస్లామిస్ట్ ముఠాలు అనేక జైళ్లను నియంత్రిస్తున్నాయని, వారి నుంచి సురక్షితంగా ఉండాలంటే ఇస్లాంలోకి మారడమే ఏకైక మార్గంగా మారిందని ఆయన పేర్కొన్నారు.

UK మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ అధికారిక డేటా ప్రకారం, ఇంగ్లాండ్ మరియు వేల్స్ జైళ్లలో ఉన్న ముస్లింలలో ప్రతి ఐదుగురిలో ఒకరు శ్వేతజాతీయులు. సాధారణ జనాభాలో వీరి శాతం 5.8% ఉండగా, జైళ్లలో ఇది సుమారు నాలుగు రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. సాధారణ జనాభాలో ముస్లింలు 6.5% ఉన్నప్పటికీ, జైళ్లలో వీరి జనాభా 18%కి పైగా పెరిగిందని నిక్ తిమోతీ సమర్పించిన డేటా ద్వారా తెలుస్తోంది.

2022లో UK ప్రభుత్వ స్వతంత్ర సమీక్షకుడు జోనాథన్ హాల్ KC ఇచ్చిన ‘టెర్రరిజం ఇన్ ప్రిజన్స్’ నివేదికలో కూడా జైళ్లలో ఇస్లామిస్ట్ గ్రూపుల కార్యకలాపాలు పెరుగుతున్నట్లు పేర్కొన్నారు. జైలు పాలైన ఇస్లామిక్ ఉగ్రవాదులు తమను తాము “ఎమిర్స్” గా ప్రకటించుకుని, నాయకత్వం మరియు నియామకాల ద్వారా ఇతర ఖైదీలను నియంత్రిస్తున్నారని ఆయన దర్యాప్తులో తేలింది. వీరు ముఖ్యంగా ఒంటరిగా ఉన్న ఖైదీలను లక్ష్యంగా చేసుకుని, ఆహారం లేదా బహుమతులు పంచుతూ, హింసకు గురిచేస్తామని బెదిరించి మత మార్పిడులకు పాల్పడుతున్నారని నివేదికలో ఉంది.

జోనాథన్ హాల్ నివేదికలో లండన్ బ్రిడ్జి దాడిలో ఇద్దరు విద్యార్థులను చంపిన ఉస్మాన్ ఖాన్, స్ట్రీతమ్ కత్తి దాడికి పాల్పడిన సుదేశ్ అమ్మన్ వంటి ఉగ్రవాదుల పేర్లను ప్రస్తావించారు. వీరు ఇతర ఖైదీలను ఇస్లాంలోకి మారాలని బెదిరించారని పేర్కొన్నారు. 2011లో ఉస్మాన్ ఖాన్ “అల్లాహు అక్బర్” అని అరుస్తూ ఒక ఖైదీపై దాడి చేయడమే కాకుండా, 2015 నాటికి ఒక “బెదిరింపు ముఠా”కు నాయకత్వం వహించి జైలులో మతపరమైన ప్రచారంలో పాల్గొన్నట్లు నివేదిక వెల్లడించింది


