రాముడు, శివాజీ, మోదీలపై విషం.. ‘జర్నలిస్ట్’ కరిష్మా అజీజ్‌కు ఢిల్లీ కోర్టు షాక్!
సోషల్ మీడియాలో హిందూ దేవుళ్లు, చారిత్రక వీరులు మరియు దేశ ప్రధానిపై వివాదాస్పద పోస్టులు చేసినందుకు గాను ‘జర్నలిస్ట్’ కరిష్మా అజీజ్ పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. శ్రీరాముడు, ఛత్రపతి శివాజీ మహారాజ్, వీర సావర్కర్లతో పాటు ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని ఆమె చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై వెంటనే ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు ఆదేశించింది.
అసలేం జరిగింది?
కరిష్మా అజీజ్ అనే మహిళ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా హిందూ సన్యాసులను, మతాన్ని కించపరుస్తూ పలు పోస్టులు చేశారు. ముఖ్యంగా ప్రధాని మోదీని ఒక కుక్కతో పోలుస్తూ, స్వాతంత్ర్య సమరయోధుడు వీర సావర్కర్‌ను దేశద్రోహిగా అభివర్ణిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అలాగే, మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్, శ్రీరాముడిపై కూడా అభ్యంతరకర పోస్టులు చేయడంతో పాటు, మొఘల్ పాలకుడు ఔరంగజేబును కీర్తిస్తూ దేశ వ్యతిరేక భావజాలాన్ని వ్యాప్తి చేశారని ఆరోపణలు వచ్చాయి.
దీనిపై అడ్వకేట్ అమితా సచ్దేవ్, పాటియాలా హౌస్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (CJM) మృదుల్ గుప్తా.. ఢిల్లీ సైబర్ పోలీసులను FIR నమోదు చేయాలని ఆదేశించారు. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS) సెక్షన్ 175(3) కింద ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.
పోలీసుల వాదనను తోసిపుచ్చిన కోర్టు
ఈ పోస్టుల వ్యవహారంపై ఢిల్లీ పోలీసులు స్పందిస్తూ.. “అవి కేవలం రాజకీయ, చారిత్రక విమర్శలు లేదా సెటైర్ల రూపంలో ఉన్నాయి తప్ప, ఉద్దేశపూర్వకంగా మతపరమైన ఘర్షణలను రెచ్చగొట్టేలా లేవు” అని కోర్టుకు నివేదించారు.
అయితే, న్యాయమూర్తి ఈ వాదనతో ఏకీభవించలేదు. “ప్రస్తుత దశలో ఆరోపణలు నిజమా కాదా అని మనం తీర్పునివ్వట్లేదు. కానీ, సమర్పించిన స్క్రీన్షాట్లు, ఆధారాలను బట్టి చూస్తే ఇందులో నేరపూరిత కోణం ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ పోస్టులు కేవలం రాజకీయ విమర్శల పరిధిలో ఉన్నాయా, లేక నేరంగా పరిగణించాలా అనేది లోతైన విచారణలో తేలాల్సిందే” అని స్పష్టం చేస్తూ పోలీసులకు చురకలు అంటించారు.
గతంలోనూ ఫేక్ న్యూస్ కేసులు:
కరిష్మా అజీజ్ ఇలా చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది (2025 నవంబర్) బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం, బీహార్‌లో యువత పెద్ద ఎత్తున అల్లర్లు సృష్టిస్తున్నారంటూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారు. నేపాల్ తరహాలో హింసాత్మక ఆందోళనలను ప్రేరేపించేందుకు ఆమె ఫేక్ వీడియోలు షేర్ చేశారంటూ అప్పట్లో బీహార్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.
మొత్తానికి, భావప్రకటనా స్వేచ్ఛ ముసుగులో ఇష్టానుసారంగా దేశ నాయకులను, చారిత్రక పురుషులను కించపరుస్తూ పోస్టులు చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో ఈ తాజా కోర్టు ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి.


