“హిందీపై మీ మైండ్ సెట్ మార్చుకోండి”.. తమిళనాడు సర్కార్కు సుప్రీంకోర్టు చురకలు!
తమిళనాడు రాష్ట్రంలో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన విచారణలో సుప్రీంకోర్టు స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి చురకలు అంటించింది. “తమిళనాడు గడ్డపై హిందీ నేర్పించకూడదు అనుకోవడం సరికాదని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తమ ఆలోచనా విధానాన్ని (మైండ్ సెట్) మార్చుకోవాలి” అని జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఎ.జి. మసీహ్లతో కూడిన ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ఈ వివాదానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే నవోదయ విద్యాలయాల ఏర్పాటు. ఈ పాఠశాలల్లో ఇంగ్లీష్, హిందీ, స్థానిక భాషలతో కూడిన త్రిభాషా విధానం అమలులో ఉంటుంది. అయితే, తమిళనాడులో కేవలం తమిళం, ఇంగ్లీష్ మాత్రమే ఉండే ద్విభాషా విధానం అమలులో ఉండటంతో, నవోదయ పాఠశాలల ఏర్పాటు ద్వారా హిందీని రుద్దే ప్రయత్నం జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తూ వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. “చెన్నై ప్రజలు ఢిల్లీని, ఢిల్లీ ప్రజలు చెన్నైని దూరం చేసుకోకూడదు” అని హితవు పలికింది. తమిళనాడులో అదనంగా ఈ కేంద్ర పాఠశాలలు ఏర్పాటు చేయడం వల్ల అక్కడి విద్యా ప్రమాణాలు ఏమీ తగ్గిపోవని, విద్యార్థులకు మరిన్ని మెరుగైన అవకాశాలు లభిస్తాయని కోర్టు పేర్కొంది. భాష విషయంలో పట్టింపులు విడిచిపెట్టి, మనసులో ఉన్న ఆ కఠినమైన వైఖరిని (rigidity) సడలించుకోవాలని ధర్మాసనం సూచించింది.
తమిళనాడు ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా వాదనలు వినిపిస్తూ.. కేంద్ర ప్రభుత్వ విధానాలను రాష్ట్రాలపై బలవంతంగా రుద్దడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. నవోదయ పాఠశాలల్లో హిందీకి ప్రాధాన్యం ఇస్తూ, తమిళాన్ని వెనక్కి నెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. సమాఖ్య వ్యవస్థ (కోపరేటివ్ ఫెడరలిజం) అనేది ఒకే వైపు నుంచి ఉండకూడదని, ఇలాంటి విధానాలను కోర్టు ద్వారా బలవంతంగా అమలు చేయలేరని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు, గతంలో ప్రతి జిల్లాలో నవోదయ పాఠశాలల ఏర్పాటుకు అవసరమైన భూమిని గుర్తించాలని ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకునేది లేదని తేల్చిచెప్పింది. అవసరమైన భూమిని గుర్తించేందుకు తమిళనాడు ప్రభుత్వానికి మరో మూడు నెలల అదనపు గడువును మంజూరు చేసింది. ఈ విధానపరమైన సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచిస్తూ, తదుపరి విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసింది.


