విదేశాలకు పారిపోయిన నేరస్థులపై కేంద్రం ఉక్కుపాదం: 36 దేశాల నుంచి 274 మంది భారత్కు రాక
విదేశాలకు పారిపోయి తలదాచుకుంటున్న నేరస్థుల భరతం పట్టేందుకు భారత ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 2019 నుంచి 2026 మధ్య కాలంలో 36 దేశాల నుంచి మొత్తం 274 మంది పరారీలో ఉన్న నేరస్థులను కేంద్రం విజయవంతంగా స్వదేశానికి రప్పించింది. ఇలా భారత్కు తీసుకొచ్చిన వారిలో ఉగ్రవాదులు, గ్యాంగ్స్టర్లు, మత్తుపదార్థాల (నార్కోటిక్స్) స్మగ్లర్లతో పాటు హత్య, అత్యాచారం, పోక్సో (POCSO) చట్టం కింద కేసులు నమోదైన కరుడుగట్టిన నిందితులు ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ల పటిష్టమైన వ్యూహం, సాంకేతికతతో కూడిన నిఘా వ్యవస్థ వల్లే ఈ భారీ విజయం సాధ్యమైందని హోం శాఖ స్పష్టం చేసింది.
నేరస్థులను రప్పించడంతో పాటు వారి ఆర్థిక మూలాలపై కూడా కేంద్రం తీవ్ర స్థాయిలో దెబ్బకొడుతోంది. 2019-2026 మధ్యకాలంలో పారిపోయిన నేరస్థులకు చెందిన రూ. 17,874 కోట్ల ఆస్తులను జప్తు చేయడంతో పాటు, రూ.18,762 కోట్లను తిరిగి రాబట్టింది. ముఖ్యంగా, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వేల కోట్లు అప్పులు చేసి, ఆ నిధులను ఎగవేసి విదేశాలకు ఉడాయించిన కింగ్ఫిషర్ అధినేత విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటి బడా ఆర్థిక నేరస్థులను ఏమాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈ చర్యల ద్వారా ప్రభుత్వం కుండబద్దలు కొట్టింది. ప్రజా ధనాన్ని లూటీ చేసిన ఎంతటి పెద్దవాళ్లైనా సరే చట్టం చేతుల నుంచి తప్పించుకోలేరని, వారిని కూడా త్వరలోనే దేశానికి రప్పించి తీరుతామని కేంద్రం స్పష్టమైన హెచ్చరికలు పంపింది.
విదేశాల్లో ఎక్కడ దాక్కున్నా వారిని వెతికి పట్టుకునేందుకు ఇంటర్పోల్ సహకారాన్ని భారత్ అత్యంత సమర్థవంతంగా వాడుకుంటోంది. విదేశాల్లో తలదాచుకున్న నేరస్తుల కోసం గడిచిన మూడేళ్లలోనే భారత్ ఏకంగా 501 రెడ్ కార్నర్ నోటీసులను జారీ చేసింది. దేశ ప్రజల సొమ్మును దోచుకుని విదేశాల్లో విలాసవంతమైన జీవితం గడుపుతామంటే ఇక కుదరదని, ఏ దేశంలో ఉన్నా సరే వారిని పట్టుకొచ్చి భారతీయ న్యాయస్థానాల ముందు నిలబెట్టి శిక్ష పడేలా చేయడం ఖాయమని ప్రభుత్వ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.


