జంతర్ మంతర్ లో ‘ఫుడ్ ఫెస్టివల్స్’.. రాంచీలో ఆకలి కేకలు: ఏదీ అసలైన పోరాటం?
దేశ రాజధానిలో పది మంది కూడితే లైవ్ టెలికాస్ట్ చేసే జాతీయ మీడియాకు.. రాంచీ వీధుల్లో లక్షలాది మంది నిరుద్యోగుల కడుపుకోత ఎందుకు కనిపించడం లేదు? ప్రశ్నాపత్రాల లీకేజీలు, మూల్యాంకనంలో లోపాలతో దళారుల చేతిలో జార్ఖండ్ యువత బతుకులు బుగ్గిపాలవుతుంటే ప్రభుత్వాలకు చీమ కుట్టినట్టైనా లేదా? JPSC, JSSC పరీక్షల కుంభకోణాలపై గత పది రోజులుగా రాంచీ వీధుల్లో రక్తం మరుగుతున్న యువత చేస్తున్న అస్తిత్వ పోరాటం వ్యవస్థల డొల్లతనాన్ని నగ్నంగా ఎత్తిచూపుతోంది. ఢిల్లీలో జరిగే ప్రాయోజిత (Sponsored) ఆందోళనలకు, రాంచీ వీధుల్లో జరుగుతున్న ఈ పోరాటానికి మధ్య ఉన్న వ్యత్యాసమే ఇందుకు నిదర్శనం!

ఢిల్లీలో సాగే ‘ఈవెంట్’ ఆందోళనలు (జంతర్ మంతర్):
- ఇక్కడ ఆందోళనలు ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ తరహాలో సాగుతాయి. నినాదాలు, ఫుడ్ ఫెస్టివల్స్‌తో పండుగ వాతావరణం ఉంటుంది.
- జాతీయ పార్టీలు, ఎన్జీవోలు (NGOs), మేధావుల అండతో పాటు భారీ బడ్జెట్ ఉంటుంది.
- సోషల్ మీడియా మేనేజర్లు రంగంలోకి దిగి కొందరిని ‘హీరో’లుగా ప్రొజెక్ట్ చేస్తారు. బొద్దింకలను సైతం సింహాల్లా కీర్తిస్తారు.
- స్పాన్సర్డ్ టెంట్లు, ఖర్చులు, ఉచిత భోజనాలు, హాజరైన వారికి బోర్ కొట్టకుండా ప్రత్యేక ఆకర్షణలు ఉంటాయి.
- కెమెరాలు నిరంతరం వెంటే ఉంటాయి. జాతీయ మీడియా ప్రతి నిమిషం బ్రేకింగ్ న్యూస్ ఇస్తుంది. ఈ హంగామా వెనుక ఎంతమంది నిజమైన బాధితులు ఉన్నారనేది ప్రశ్నార్థకమే.

రాంచీలో అసలైన నిరుద్యోగుల పోరాటం (JPSC/JSSC బాధితులు):
- ఇది ప్లానింగ్ వేసుకుని చేస్తున్న ఆందోళన కాదు. లీకేజీలతో సర్వస్వం కోల్పోయిన వేలాది మంది యువత అస్తిత్వ పోరాటం.
- ఇక్కడ పీఆర్ టీమ్‌లు, సెలబ్రిటీలు లేరు. కడుపు మండిన ప్రతి నిరుద్యోగీ ఒక నాయకుడే.
- హజారీబాగ్, ధన్‌బాద్, బోకారో నుంచి సొంత డబ్బులతో వేలాది మంది యువతీ యువకులు తరలివచ్చారు. జేబులో డబ్బుల్లేక ఒకరి బిస్కెట్లు మరొకరు పంచుకుంటూ, దోమల మధ్య రోడ్లపైనే పడుకుంటున్నారు.
- 300కు 299 మార్కులు వచ్చినా ఉద్యోగం రాలేదని కొందరు.. ఏడేళ్లుగా ఎదురుచూసి వయోపరిమితి దాటిపోయి పెళ్లిళ్లు ఆగిపోతున్నాయని విద్యార్థినులు కన్నీరుమున్నీరవుతున్నారు.
- సోషల్ మీడియా మేధావులు, జాతీయ మీడియా వీరిని కనీసం పట్టించుకోకుండా వదిలేశారు. రాజకీయ నాయకులు కేవలం విమర్శలకే పరిమితమయ్యారు.
విద్యార్థుల ప్రధాన డిమాండ్లు ఇవే:
- అవకతవకలు జరిగిన 14వ JPSC సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షను వెంటనే రద్దు చేసి, పారదర్శకంగా మళ్లీ నిర్వహించాలి.
- రాష్ట్ర ప్రభుత్వ CID విచారణపై నమ్మకం లేదు. పూర్తి నిజాలు వెలికితీయడానికి సీబీఐ (CBI) లేదా ఈడీ (ED)తో స్వతంత్ర విచారణ జరిపించాలి.
- ఏళ్ల తరబడి పరీక్షలు, ఫలితాలు నిలిచిపోవడంతో వయోపరిమితి దాటిపోయిన వేలాది మంది యువతకు వెంటనే న్యాయం చేయాలి.
మురికి అజెండాలతో సాగే ఢిల్లీ ఆందోళనలకు, రాంచీ విద్యార్థుల పోరాటానికి ఉన్న తేడా వారు వేదిక వద్ద పెట్టుకున్న ఈ నియమాలను చూస్తే అర్థమవుతుంది:
- వేదిక పైనుంచి ఎలాంటి రాజకీయ, మతపరమైన లేదా కులపరమైన వ్యాఖ్యలు చేయకూడదు.
- ఆందోళన ప్రధాన ఉద్దేశాలైన విద్యార్థుల సమస్యల గురించే మాట్లాడాలి.
- మన పోరాటం వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడానికే కాబట్టి, వేదిక నుండి వ్యక్తిగత విమర్శలు లేదా ఆరోపణలు చేయకూడదు.
- మాట్లాడేటప్పుడు అసభ్య పదజాలం లేదా చెడు మాటలు ఉపయోగించకూడదు.
ఈ నిజాయితీ పోరాటానికి, అజెండాలతో నడిచే ఆందోళనలకు ఉన్న తేడాను సమాజం గుర్తించాలి. రోడ్డున పడ్డ లక్షలాది మంది జీవితాలకు కెమెరాల వెలుగులు పడినప్పుడే న్యాయం జరుగుతుంది.


