అమృతా ఫడ్నవీస్ యోగా వీడియోలపై ఇన్‌స్టా పేజీల వికృతం!

అమృతా ఫడ్నవీస్ యోగా వీడియోలపై ఇన్‌స్టాగ్రామ్ ‘కక్కుర్తి’ బ్యాచ్ పైశాచికత్వం. వ్యూస్ కోసం ఇంతలా దిగజారిపోవాలా? సైబర్ క్రైమ్ పోలీసులు నిద్రపోతున్నారా?

– జర్నలిస్ట్ శిరీష (kadpathr.in ఎక్స్‌క్లూజివ్ ఎడిటోరియల్)

యోగా… భారతదేశం ప్రపంచానికి అందించిన అద్భుతమైన ఆరోగ్య సంజీవని. శారీరక దారుఢ్యానికి, మానసిక ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే ఈ యోగా సాధనను ప్రపంచమంతా ఎంతో పవిత్రంగా ఆచరిస్తోంది. కానీ, మన దగ్గర మాత్రం కొందరు సోషల్ మీడియా ‘రాబందులు’ తమ పైశాచిక ఆనందం కోసం, నాలుగు వ్యూస్, లైక్స్ కోసం ఇంతటి పవిత్రమైన కార్యక్రమాన్ని సైతం అత్యంత నీచంగా, జుగుప్సాకరంగా వాడుకుంటున్నారు. నిన్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ముంబైలో జరిగిన ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని, ఇన్‌స్టాగ్రామ్ కక్కుర్తి బ్యాచ్ తమ వికృత చేష్టలతో అపహాస్యం పాలు చేయడం ప్రస్తుత సమాజపు దిగజారుడుతనానికి అద్దం పడుతోంది.

అసలేం జరిగింది? నిన్న (జూన్ 21) ముంబైలోని వర్లీ ఎస్.వి.పి స్టేడియంలో (DOME) దివ్యాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా యోగా దినోత్సవం జరిగింది. 1000 మందికి పైగా రైతు బిడ్డలు, బీఎంసీ స్కూల్ విద్యార్థులకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృతా ఫడ్నవీస్ ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. పిల్లల్లో స్ఫూర్తి నింపడానికి షాహిద్ కపూర్, జాకీ ష్రాఫ్, శ్రీలీల లాంటి సినీ ప్రముఖులు సైతం ఇందులో పాలుపంచుకున్నారు. ఇంతటి ఉన్నతమైన ఆశయంతో జరిగిన కార్యక్రమంపై కొందరు ఇన్‌స్టాగ్రామ్ సైకోల కన్ను పడింది.

శరీర భాగాలపై స్లో మోషన్లు… ఈ పైశాచికత్వం ఏంటి? ఆరోగ్యం కోసం, ఒక సదుద్దేశ్యంతో చేసిన యోగాను కూడా కామంతో చూసే స్థాయికి సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు దిగజారిపోయారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యూస్ కోసం కక్కుర్తి పడే కొన్ని నీచమైన పేజీలు… యోగా చేస్తున్న అమృతా ఫడ్నవీస్ గారిని టార్గెట్ చేస్తూ అత్యంత అసహ్యకరమైన వీడియోలు ఎడిట్ చేసి వదులుతున్నాయి.

ఒక మహిళను టాప్ టు బాటమ్ స్కాన్ చేస్తున్నట్లుగా… ఛాతీ, తొడలు, తదితర శరీర భాగాలను హైలైట్ చేస్తూ, వాటిని అసభ్యకరంగా జూమ్ చేస్తూ, స్లో మోషన్స్ పెడుతూ వీరు క్రియేట్ చేస్తున్న వీడియోలు చూస్తుంటే అసహ్యం వేస్తోంది. బ్యాక్ గ్రౌండ్‌లో దరిద్రమైన మ్యూజిక్ యాడ్ చేసి, ఆ పవిత్రమైన సాధనను ఏదో ‘సాఫ్ట్ పోర్న్’ వీడియోలా ప్రెజెంట్ చేస్తూ వీరు పొందుతున్న పైశాచిక ఆనందం ఏంటి? ఒక మహిళ పబ్లిక్ ఈవెంట్‌లో పాల్గొంటే ఆమె శరీరాన్ని అణువణువూ స్కాన్ చేస్తూ ఇలాంటి వీడియోలు కట్ చేయడం ఏ రకమైన జర్నలిజం? ఏ రకమైన కంటెంట్ క్రియేషన్? అసలు ఈ పేజీల అడ్మిన్లకు కనీస విజ్ఞత, ఇంట్లో ఆడవాళ్లు అంటే గౌరవం ఉన్నాయా?

మహిళల భద్రత గాల్లో దీపమేనా? ఇది కేవలం అమృతా ఫడ్నవీస్ అనే ఒక పబ్లిక్ ఫిగర్‌కు జరిగిన అవమానం కాదు. యావత్ మహిళా లోకానికే జరిగిన ఘోర అవమానం. ఒక ముఖ్యమంత్రి సతీమణి, సమాజం కోసం ఒక మంచి కార్యక్రమం చేయడానికి ముందుకు వస్తే… ఆమె శరీరాన్నే హైలైట్ చేస్తూ ఇంత అసభ్యకరంగా ప్రవర్తించే ధైర్యం ఈ సోషల్ మీడియా బ్యాచ్‌కి ఎలా వచ్చింది? ఇలాంటి పరిణామాలు చూసిన తర్వాత రేపు ఏ సాధారణ మహిళ అయినా పబ్లిక్ ఈవెంట్స్‌లో పాల్గొనడానికి, కనీసం పార్కులో వాకింగ్, యోగా చేయడానికి ధైర్యంగా ముందుకు రాగలదా?

సైబర్ క్రైమ్ పోలీసుల మౌనం దేనికి సంకేతం? మహిళల భద్రత గురించి, సైబర్ చట్టాల గురించి వేదికల మీద గొప్పగా మాట్లాడే నాయకులు, పోలీసులు ఇప్పుడు ఎక్కడ నిద్రపోతున్నారు? సోషల్ మీడియాలో స్వేచ్ఛ ముసుగులో లైక్స్ కోసం అర్రులు చాచే ఇలాంటి వికృత మనస్తత్వాలను ఇకపై ఎంతమాత్రం ఉపేక్షించకూడదు. ఈ వీడియోలను సర్క్యులేట్ చేస్తున్న, ఎడిట్ చేస్తున్న ఇన్‌స్టాగ్రామ్ పేజీలపై ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు తక్షణమే సుమోటోగా కేసు నమోదు చేయాలి. కఠినమైన ఐటీ చట్టాల కింద వారిని అరెస్ట్ చేసి, వారి పేజీలను బ్లాక్ చేయాలి. అప్పుడే ఇలాంటి మహిళా వ్యతిరేక రాబందులకు భయం పుడుతుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ మీద చెత్తను ఊడ్చేయాల్సిన సమయం ఆసన్నమైంది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *