అయ్యప్ప నామస్మరణతో అశ్లీలపు జోకులా? టాలీవుడ్ హిందూ వ్యతిరేకతపై భగ్గుమంటున్న భక్తులు
సోకాల్డ్ సినిమా ఇండస్ట్రీకి హిందూ దేవీదేవతలు అంటే రోజురోజుకూ మరీ చులకనైపోతున్నారు. క్రియేటివిటీ పేరుతో, కామెడీ ముసుగులో హిందూ ధర్మాన్ని, మన ఆచార వ్యవహారాలను అవమానించడం వీరికి ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ఆడుకోవడం ఈ సినీ పెద్దలకు ఒక చౌకబారు వినోదంగా తయారైంది. ఏమాత్రం భయం, భక్తి లేకుండా మన దేవుళ్లపై సెటైర్లు వేస్తూ, హిందూ విశ్వాసాలను మంటగలుపుతూ వీరు పైశాచిక ఆనందం పొందుతున్నారు.
తాజాగా అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో వస్తున్న ‘రంభ ఊర్వసి మేనక’ సినిమాలో జరిగిన దురాగతమే వీరి అహంకారానికి సజీవ సాక్ష్యం. ఎంతో పవిత్రంగా భావించే “అయ్యప్ప శరణం” అనే మంత్రాన్ని కించపరుస్తూ, దానికి బదులుగా “మేనక శరణం” అని కామెడీ డైలాగులు రాయడం ఈ ఇండస్ట్రీ దిగజారుడుతనానికి పరాకాష్ట. కేవలం కొన్ని నవ్వుల కోసం, థియేటర్లలో చప్పట్ల కోసం ఇంతటి నీచమైన డైలాగులు రాసిన డైరెక్టర్, దానికి వత్తాసు పలికిన నటీనటుల బుద్ధి గడ్డితిన్నదా అని హిందూ సమాజం తీవ్రంగా ప్రశ్నిస్తోంది.
అసలు అయ్యప్ప శరణం అనే పదానికి, ఈ సినిమాలో వాడిన చెత్త డైలాగ్‌కి ఉన్న వ్యత్యాసం ఈ సోకాల్డ్ మేధావులకు తెలుసా? 41 రోజుల పాటు కఠినమైన బ్రహ్మచర్యం పాటించి, నేలపై నిద్రించి, చలిని సైతం లెక్కచేయకుండా ఇరుముడి మోసుకుని నల్లని దుస్తులతో శబరిగిరి కొండలకు కాలినడకన వెళ్లే అయ్యప్ప స్వాముల నిష్ఠ వీరికి ఏం తెలుసు? ఇంతటి పవిత్రమైన దీక్షను, స్వామి నామస్మరణను ఒక అశ్లీలమైన లేదా హాస్యపూరితమైన సందర్భంలో వాడటం ప్రతి అయ్యప్ప భక్తుడి గుండెపై తన్నినట్లే.
ఇక్కడ అసలైన ప్రశ్న ఏమిటంటే… ఇదే తరహాలో ఇతర మతాల ప్రార్థనలను, వారి దేవుళ్లను కించపరుస్తూ డైలాగులు రాసే దమ్ము, ధైర్యం ఈ సినిమా వాళ్లకు ఉందా? కేవలం హిందువులు మాత్రమే సహనంతో ఉంటారనే చేతకానితనంతోనే కదా ఇలాంటి చౌకబారు కామెడీకి తెగబడుతున్నారు! పరమత సహనం అంటే మన మతాన్ని, మన దేవుళ్లను రోడ్డున పడేసి అవమానిస్తుంటే చేతులు కట్టుకుని చూస్తూ కూర్చోవడం కాదు. ఈ హిందూ వ్యతిరేక మానసిక స్థితిని ఇకపై ఎంతమాత్రం ఉపేక్షించేది లేదు.
వెంటనే ఆ సినిమాలో ఉన్న ఈ వివాదాస్పద డైలాగ్‌ను తొలగించాలి. హిందూ దేవుళ్లను కించపరిచినందుకు గానూ ఆ చిత్ర బృందం యావత్ హిందూ సమాజానికి, ముఖ్యంగా అయ్యప్ప భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. సెన్సార్ బోర్డు కూడా ఇలాంటి హిందూ వ్యతిరేక సన్నివేశాలను ఎలా అనుమతిస్తుందో సమాధానం చెప్పాలి. ఇకనైనా హిందూ దేవీదేవతలతో చెలగాటం ఆపకపోతే, రాబోయే రోజుల్లో ప్రతిఘటన తీవ్రస్థాయిలో ఉంటుంది, హిందువుల ఆగ్రహ జ్వాలలకు ఈ సినిమా ఇండస్ట్రీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.


