ఢిల్లీ జింఖానా క్లబ్ వివాదం: ప్రధాని మోదీకి 50 మంది మాజీ సైనికుల లేఖ
ఢిల్లీ జింఖానా క్లబ్ కు సంబంధించిన 27.3 ఎకరాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటున్న వ్యవహారం తాజాగా కొత్త మలుపు తిరిగింది. ఈ క్లబ్‌ను ఖాళీ చేయించే ప్రభుత్వ ప్రతిపాదనపై 50 మంది మాజీ సైనికాధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకొని, జింఖానా క్లబ్‌ను కాపాడాలని కోరుతూ వారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక లేఖ రాశారు. మరోవైపు దశాబ్దాలుగా ఈ క్లబ్‌పై ఆధారపడి జీవిస్తున్న సుమారు 700 మంది శాశ్వత, కాంట్రాక్ట్ ఉద్యోగుల భవిష్యత్తు సైతం ప్రశ్నార్థకంగా మారడంతో జింఖానా వర్కర్స్ అసోసియేషన్ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.
జూలై 8వ తేదీన ప్రధాని మోదీకి రాసిన లేఖలో, ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించేలా గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖను (MoHUA) ఆదేశించాలని మాజీ సైనికులు కోరారు. జాతీయ భద్రత మరియు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వ భూమిని తిరిగి తీసుకునే హక్కును తాము పూర్తిగా గౌరవిస్తామని, అయితే ఈ క్లబ్ మూసివేత వేలాది మంది మాజీ సైనికులు, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులపై మానవతా కోణంలో తీవ్ర ప్రభావం చూపుతుందని వారు పేర్కొన్నారు. సైనికులు, దౌత్యవేత్తలు, న్యాయమూర్తులు, క్రీడాకారులు వంటి ఎంతోమంది ప్రముఖులను ఒకచోట చేర్చిన ఈ క్లబ్‌కు సుదీర్ఘ సేవా చరిత్ర ఉందని, ఇది భారతదేశ సంస్థాగత వారసత్వంలో భాగమని వారు గుర్తుచేశారు. ఈ సున్నితమైన సమస్యను స్వయంగా వివరించడానికి ప్రధానితో 15-20 నిమిషాల సమావేశానికి వారు సమయం కోరారు.
మరోవైపు క్లబ్ ఖాళీ చేయిస్తే తమ ఉద్యోగాల పరిస్థితి ఏంటని ఢిల్లీ జింఖానా వర్కర్స్ అసోసియేషన్ ప్రశ్నిస్తోంది. క్లబ్ జనరల్ సెక్రటరీకి రాసిన లేఖలో తమ ఉద్యోగ భద్రతకు సంబంధించి యాజమాన్యం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ లభించలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకపక్క క్లబ్ ఖాళీ చేయించే ప్రక్రియ ముంగిట ఉంటే, ఆగస్టు 8న జరిగిన సాధారణ కమిటీ సమావేశంలో ప్రభుత్వం నియమించిన ఇద్దరు అధికారుల పదవీకాలాన్ని మరో ఏడాది ఎందుకు పొడిగించారని వారు ప్రశ్నించారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన తమ ఉపాధిని కాపాడాలని కార్మికులు గతంలోనే ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.
రక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి మరియు ఇతర ముఖ్యమైన ప్రజా ప్రాజెక్టుల కోసం ఈ స్థలం అవసరమని పేర్కొంటూ మే 22న కేంద్ర ప్రభుత్వం జింఖానా క్లబ్ స్థలాన్ని తిరిగి తీసుకునే ప్రక్రియను ప్రారంభించింది. వ్యూహాత్మకంగా అత్యంత సున్నితమైన ఈ ప్రాంతాన్ని రక్షణ, భద్రతా అవసరాల కోసం వినియోగించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో భాగంగా 1928 నాటి లీజు డీడ్‌లోని క్లాజ్ 4 కింద 27.3 ఎకరాల ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు భూమి, అభివృద్ధి కార్యాలయం (L&DO) జూన్ 29న పబ్లిక్ ప్రెమిసెస్ యాక్ట్ కింద షోకాజ్ నోటీసు జారీ చేసింది. అలాగే సుమారు రూ. 47.58 కోట్ల మేర గ్రౌండ్ రెంట్ బకాయిలు కూడా ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం ఈ లీజు రద్దు వ్యవహారంపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతుండగా, తదుపరి విచారణ సెప్టెంబర్ 3కి వాయిదా పడింది. చట్టప్రకారమే ఈ ఖాళీ చేయించే ప్రక్రియ జరుగుతోందని కేంద్ర ప్రభుత్వం న్యాయస్థానానికి స్పష్టం చేసింది.


