బెంగాల్ టు ఢిల్లీ: జంతర్ మంతర్‌లో దాడికి ISI మాస్టర్ ప్లాన్ బట్టబయలు!
పశ్చిమ బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) అరెస్ట్ చేసిన మొహమ్మద్ హమీమ్ మోండల్ విచారణలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతనికి జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థతో పాటు, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ (ISI) తో కూడా సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ మేరకు ఐజీ (స్పెషల్ టాస్క్ ఫోర్స్) గౌరవ్ శర్మ కోల్‌కతాలో జరిగిన మీడియా సమావేశంలో ఈ కీలక వివరాలను వెల్లడించారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలపై దాడికి మోండల్ భారీ కుట్ర పన్నాడు. ఈ దాడుల కోసం అతను పోలీసు యూనిఫాంను సంపాదించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అంతేకాకుండా, పలువురు పోలీసులు, రాజకీయ నాయకులను టార్గెట్ చేసుకున్న అతను.. షాజాద్ భట్టి గ్యాంగ్‌కు చెందిన ‘రాణా’, ‘ఉజైర్’, ‘ఆబిద్ జట్ 333’, ‘హమద్’ అనే హ్యాండ్లర్లతో నిరంతరం సంప్రదింపులు జరిపాడు.
వీరంతా మొదట ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమై, ఆ తర్వాత వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ఎన్క్రిప్టెడ్ యాప్‌ల ద్వారా రహస్యంగా మెసేజ్‌లు పంపుకునేవారు. దాడులతో పాటు, పశ్చిమ బెంగాల్‌కు చెందిన రాజకీయ నాయకులను ‘హనీ-ట్రాప్’ ద్వారా బ్లాక్మెయిల్ చేసి వారి నుంచి భారీగా డబ్బు వసూలు చేయాలని కూడా మోండల్ పథకం వేశాడు. అలాగే, ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడిని కిడ్నాప్ చేయడానికి కూడా కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో బయటపడింది.


