ప్రతిభకు సంకెళ్లు.. రిజర్వేషన్లతో ఎన్నాళ్లు?: సమానత్వమా లేక ఓటు బ్యాంకు చట్టమా?
పాఠశాల స్థాయి నుంచి కళాశాల వరకు కుల, మత, ప్రాంతాలకు అతీతంగా విద్యార్థులందరూ ఒకే యూనిఫాం, ఒకే సిలబస్, సమాన హాజరు నిబంధనలతో చదువుకుంటున్నారు. కానీ, తీరా ఉద్యోగాలు, ఉన్నత విద్య సీట్ల భర్తీ సమయానికి వచ్చేసరికి ఈ సమానత్వం ఎందుకు లోపిస్తోందని నేటి యువత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. 2026 నాటికి భారత జిడిపి అమాంతం పెరుగుతున్న ఈ తరుణంలో కూడా రిజర్వేషన్ల ఆవశ్యకత ఉందా అనేది ప్రధాన చర్చనీయాంశంగా మారింది. అట్రాసిటీ చట్టాలు ఇప్పటికే బలంగా ఉన్నాయని, పైగా చదువుకునే దశలో ఫీజు రాయితీలు, స్కాలర్షిప్లు కల్పిస్తున్నప్పుడు.. ఆఖరి దశలో కేవలం మెరిట్ ఆధారంగా కాకుండా మళ్లీ రిజర్వేషన్ల కోటాలో సీట్లు, ఉద్యోగాలు కేటాయించడం ఎంతవరకు సమంజసం అని ‘రిజర్వేషన్ హటావో’ ఉద్యమం ముక్తకంఠంతో నిలదీస్తోంది. స్కాలర్షిప్పులు, వయోపరిమితిలో సడలింపులు వంటి అనేక ప్రయోజనాలు పొందిన వారికి, తుది ఎంపికలో కూడా మళ్లీ ఈ రాయితీ కొనసాగించడం ప్రతిభను అవమానించడమే అవుతుంది.
ఈ రిజర్వేషన్ల వ్యవస్థ కారణంగా అత్యంత నష్టపోతున్నది, తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నది జనరల్ కేటగిరీ విద్యార్థులే అనడానికి గణాంకాలే ప్రత్యక్ష సాక్ష్యం. 2014 నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 1,23,918 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడగా, అందులో అత్యధిక శాతం జనరల్ కేటగిరీకి చెందిన వారే ఉండటం వ్యవస్థ వైఫల్యానికి అద్దం పడుతోంది. రాత్రింబవళ్లు చెమటోడ్చి చదివి, తమ కటాఫ్ మార్కులకు చేరువలో 100కు 100 శాతం స్కోర్ సాధించినా.. రిజర్వేషన్ల కారణంగా కళ్లెదుటే అవకాశాలు చేజారిపోతుంటే ఆ యువత పడుతున్న ఆవేదన వర్ణనాతీతం. ఒకవైపు అన్ని రకాల రాయితీలు అనుభవించిన వారికి ఉద్యోగాల్లో పెద్దపీట వేస్తూ, కేవలం కష్టాన్ని నమ్ముకున్న జనరల్ కేటగిరీ విద్యార్థుల ఉసురు పోసుకుంటున్న ఈ విధానం వారి పాలిట మరణశాసనంగా మారుతోంది. అర్హత ఉండి కూడా అవకాశాలు దక్కని నైరాశ్యంలోనే మెజారిటీ జనరల్ కేటగిరీ విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
దేశంలో ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొస్తున్న మోదీ ప్రభుత్వం, యువత భవిష్యత్తును నిర్ణయించే ఈ రిజర్వేషన్ల విషయంలో కూడా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఒక కుటుంబంలో రిజర్వేషన్ ద్వారా ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఆ కుటుంబం ఆర్థికంగా స్థిరపడినట్లే. మరి అలాంటప్పుడు వారి తర్వాతి తరాలకు కూడా మళ్లీ అవే రిజర్వేషన్లు ఎందుకు వర్తింపజేయాలన్నది ప్రతి సామాన్యుడి మదిలో మెదులుతున్న సగటు ప్రశ్న. దేశానికి వెన్నెముక అయిన యువత కోరుకుంటున్నది కుల ప్రాతిపదికన దక్కే అవకాశాలు కాదు, కేవలం ‘మెరిట్’ ఆధారిత సమాజం. ప్రతిభకు పట్టాభిషేకం చేసేలా, చదివిన ప్రతి విద్యార్థికి న్యాయం జరిగేలా ప్రభుత్వాలు విధానపరమైన మార్పులు తీసుకురావాలని, అప్పుడే నవ భారతదేశ నిర్మాణం సాధ్యమవుతుందని యువత డిమాండ్ చేస్తోంది.


