పంజాబ్ సీఎం ‘మాస్క్’ డ్రామా.. దేవుడి పటాలపై మద్యం పోసిన వీడియోపై పూటకో మాట!
“చెప్పేవి శ్రీరంగ నీతులు.. దూరేవి దొంప గుడిసెలు”.. పంజాబ్ ముఖ్యమంత్రి తాజా వ్యవహార శైలి చూస్తుంటే ఎవరికైనా ఈ సామెతే గుర్తుకు వస్తుంది. అత్యంత పవిత్రమైన మత గురువుల చిత్రపటాలపై మద్యం పోస్తున్నట్లుగా ఉన్న ఒక వివాదాస్పద వీడియో నెట్టింట సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాక్షాత్తూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి.. తనను తాను రక్షించుకునేందుకు పూటకో మాట మారుస్తుండటం ప్రజాగ్రహానికి కారణమవుతోంది.
నాలుకకు 400 డిగ్రీల మలుపు.. వీడియో బయటకు వచ్చిన వెంటనే తప్పును కప్పిపుచ్చుకునేందుకు ముఖ్యమంత్రి వర్గం వేసిన తొలి అడుగు ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (AI). “ఇది ఏఐ జమానా. ఏ వీడియో అయినా సృష్టించవచ్చు. కావాలంటే ఫోరెన్సిక్ ల్యాబ్‌లో విచారణ చేయించుకోవచ్చు” అంటూ వారం రోజుల క్రితం ఆయన బుకాయించారు. విచారణ పేరుతో కాలయాపన చేస్తే ప్రజలు దీన్ని మర్చిపోతారన్న వ్యూహం అందులో కనిపించింది.
కానీ, సరిగ్గా నాలుగు రోజుల క్రితం ఆయన వాదన అనూహ్యంగా మారింది. ఈసారి టెక్నాలజీ సాకుకు బాడీ షేమింగ్ కవర్ చేసి.. “ఆ వీడియోలోని 1190 ఫ్రేముల్లో నా ముఖం, సైడ్ యాంగిల్, నా ఎత్తు, నా శరీర ఆకృతితో ఏదీ మ్యాచ్ కాలేదు” అంటూ ప్రజల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేశారు.
ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ లెవల్ స్టోరీ.. ఇక తాజాగా ఆయన చెబుతున్న కారణం వింటే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. “ఆ వీడియోలో ఉన్నది నేను కాదు. ఎవరో ఆర్టిస్ట్ నా మాస్క్ వేసుకుని యాక్టింగ్ చేస్తున్నాడు. ఆ మాస్క్ లైన్ కూడా స్పష్టంగా కనిపిస్తోంది” అంటూ తన ముఖం అచ్చుగుద్దినట్లు ఉన్న 3D మాస్క్‌ను ఎవరో వాడారంటూ హాలీవుడ్ క్రైమ్ సినిమాను తలపించేలా సరికొత్త కట్టుకథను తెరపైకి తెచ్చారు.
దీనిపై ప్రతిపక్షాలు, ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యంగ్యాస్త్రాలు పేలుతున్నాయి. ఆయన మాటల గారడీ చూస్తుంటే.. రేపటి రోజున “మా అమ్మానాన్నలకు కవల పిల్లలు పుట్టారు, వీడియోలో ఉన్నది నేను కాదు నా కవల సోదరుడు” అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదని తీవ్రస్థాయిలో సెటైర్లు పేలుతున్నాయి.
ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు! మత గురువుల ఫోటోలపై మద్యం పోయడం లాంటి అత్యంత హేయమైన చర్యకు పాల్పడినట్లు స్పష్టమైన వీడియో సాక్ష్యాలు కనిపిస్తున్నా, దానికి నైతిక బాధ్యత వహించాల్సిన నాయకుడు ఇలా కళ్లార్పకుండా అబద్ధాలు చెబుతుండటం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని విశ్లేషకులు మండిపడుతున్నారు.
పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ.. తననెవరూ చూడట్లేదనుకుందట! అన్నట్లుగా.. ప్రపంచానికి స్పష్టంగా కనిపిస్తున్న వాస్తవాన్ని దాచాలని చూస్తున్న ఇలాంటి నాయకులు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఐదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారంటే.. మన ప్రజాస్వామ్యం ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ ‘మాస్క్’ వెనుక దాగి ఉన్న అసలు నిజాలను చట్టం ఏ రకంగా బయటకు లాగుతుందో వేచి చూడాలి!


