సౌరవ్ దాస్ హైడ్రామా: అమిత్ షాపై బురదజల్లే యత్నం!
కేంద్ర ప్రభుత్వాన్ని, పోలీసు వ్యవస్థను బద్నాం చేయడానికి కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రతినిధి సౌరవ్ దాస్ ఆడుతున్న కొత్త నాటకం ఇది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు చేసే సాధారణ తనిఖీలను కూడా ఆయన తనకు అనుకూలంగా మార్చుకుని, ఏకంగా దేశ హోంమంత్రినే లక్ష్యంగా చేసుకుని చౌకబారు రాజకీయాలకు తెరలేపారు. తాను ఏదో పెద్ద జాతీయ స్థాయి నాయకుడిననే భ్రమలో ఉన్న దాస్, తన కుటుంబంపై పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారంటూ సోషల్ మీడియాలో అనవసర రాద్దాంతం సృష్టిస్తున్నారు.

పుదుచ్చేరిలోని తన తల్లిదండ్రుల ఇంటికి మఫ్టీలో పోలీసులు వచ్చి విచారించారని దాస్ పెద్ద కథ అల్లారు. స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లలో భాగంగా కేవలం 15-20 నిమిషాల పాటు సాధారణ వివరాలు (ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఎక్కడ నుంచి వచ్చారు) అడిగితేనే దాన్ని మహా అపరాధంగా, కక్షసాధింపుగా అభివర్ణించడం ఆయనకే చెల్లింది. వాస్తవానికి పోలీసులు వారి ఇంటి లోపలికి కూడా వెళ్లలేదు, కేవలం గుమ్మం బయట నుంచే వివరాలు సేకరించారు. కానీ, దీనిని ఒక పెద్ద కుట్రగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.

ఈ చిన్న విషయానికి కేంద్ర ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) ముడిపెడుతూ దాస్ ఎప్పటిలాగే వామపక్ష భావజాల నేతలు వాడే ‘విక్టిమ్ కార్డ్’ (బాధితుడి ముసుగు) ప్లే చేశారు. తన గొంతు నొక్కేందుకే బీజేపీ ప్రభుత్వం ఇలా గూండాల్లా వ్యవహరిస్తోందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అపరిపక్వతకు, వ్యవస్థల పట్ల ఆయనకున్న అక్కసుకు నిదర్శనం. అహర్నిశలు ప్రజల భద్రత కోసం శ్రమించే పోలీసుల విధి నిర్వహణను అడ్డుకునేలా, వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఇలాంటి ఆరోపణలు చేయడం శోచనీయం.
ఈ మొత్తం డ్రామాలో అత్యంత హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే… సాక్షాత్తూ దేశ హోం మంత్రి అమిత్ షా పర్యటనను ఈ స్థానిక తనిఖీలతో ముడిపెట్టడం! రెండు రోజుల క్రితం అమిత్ షా పుదుచ్చేరి వచ్చినప్పుడు, స్థానిక లెఫ్టినెంట్ గవర్నర్తో కలిసి తన కుటుంబాన్ని భయపెట్టడానికే వ్యూహం పన్నారని దాస్ ఆరోపించడం ఆయన అహంకారానికి పరాకాష్ట. దేశ అంతర్గత భద్రతను పర్యవేక్షించే హోంమంత్రికి ఒక సాధారణ కార్యకర్త ఇంటికి పోలీసులను పంపాల్సిన అవసరం ఏముంటుందన్న కనీస ఇంగితం లేకుండా, కేవలం జాతీయ స్థాయిలో ప్రచారం పొందాలన్నదే ఆయన అసలు ఉద్దేశమని స్పష్టమవుతోంది.

దాస్ ఆరోపణల్లో ఎలాంటి పసాలేదని పుదుచ్చేరి పోలీసులు సాక్ష్యాధారాలతో సహా కుండబద్దలు కొట్టారు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్ జరిగే ‘వైట్ టౌన్’ ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేయడంలో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టామని సీనియర్ పోలీసు అధికారులు స్పష్టం చేశారు. కేవలం దాస్ ఇల్లు మాత్రమే కాదు, ఆ వీఐపీలు ప్రయాణించే మార్గంలోని ప్రతి ఇల్లు, హోటల్, వాణిజ్య సముదాయాలను తనిఖీ చేశామని వారు తేల్చి చెప్పారు. ఇందులో దాస్ కుటుంబాన్ని ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నారనే వాదనలో ఏమాత్రం నిజం లేదని ఆధారాలతో సహా వివరించారు.

స్వాతంత్ర్య దినోత్సవం లాంటి జాతీయ పండుగ రోజున భద్రతా వైఫల్యాలు తలెత్తకుండా పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడం వారి ప్రథమ కర్తవ్యం. ఎవరైనా అపరిచితులు లేదా విదేశీయులు ఆయా పరిసరాల్లో బస చేశారా అని ఆరా తీయడం రాజీపడని భద్రతా ప్రోటోకాల్ లో భాగం. ఢిల్లీలో తాను చేసే రాజకీయాల వల్లే పోలీసులు తమ ఇంటికి వచ్చారని దాస్ కుటుంబం భ్రమపడొచ్చు కానీ, దేశ భద్రతను పణంగా పెట్టి ఏ ఒక్కరికీ మినహాయింపు ఇవ్వలేమని పోలీసులు తమ చర్యల ద్వారా స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఇలాంటి ఆరోపణలతో వ్యవస్థల మీద బురద జల్లడం మానుకుని, దేశ భద్రతకు సహకరిస్తే మంచిది.


