కపిల్ సిబల్ ఇచ్చిన కోటి ఫండ్ వెనుక భారీ స్కామ్? ఈసీ ఎంట్రీతో అభిజీత్ డిప్కేకి మైండ్ బ్లాక్!
కాక్రోచ్ జనతా పార్టీ” (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ డిప్కే చుట్టూ ఇప్పుడు తీవ్రమైన ఉచ్చు బిగుస్తోంది! సూరత్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ, డిప్కే కుటుంబ ఆర్థిక వ్యవహారాలపై సంచలన బాంబు పేల్చారు. నెలకు కేవలం 60 నుంచి 65 వేల రూపాయల జీతం తీసుకునే మహారాష్ట్ర ప్రభుత్వ జూనియర్ ఇంజనీర్ (భగవాన్‌రావు డిప్కే) కొడుకు, అమెరికాలోని ప్రతిష్టాత్మక బోస్టన్ యూనివర్సిటీలో లక్షలు ఖర్చుపెట్టి ఎలా చదువుకున్నాడు?. తండ్రి జీతానికి, కొడుకు విదేశీ చదువులకు ఏమాత్రం పొంతన లేకపోవడంతో, ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంపై మహారాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దర్యాప్తు చేయాలని ఆయన ఫిర్యాదు చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది.
కథలో అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది! నీట్ ఆందోళనకారుల కోసం సీనియర్ న్యాయవాది, ఎంపీ కపిల్ సిబల్ ప్రకటించిన కోటి రూపాయల లీగల్ డిఫెన్స్ ఫండ్‌పై కూడా ఇప్పుడు విచారణ ఎదుర్కోవాల్సి రావచ్చు. అసలు ఎన్నికల సంఘం (ECI) దగ్గర కనీస గుర్తింపు లేని ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఓ రాజకీయ పార్టీ ముసుగులో కోటి రూపాయల విరాళాలు ఎలా తీసుకుంటుంది? ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 29A కింద రిజిస్టర్ కాకుండానే నిధులు వసూలు చేయడంపై ఈసీకి ఘాటైన ఫిర్యాదు వెళ్ళింది. అంతేకాదు, కపిల్ సిబల్ ఇచ్చిన ఆ కోటి రూపాయలపై కచ్చితంగా 18% జీఎస్టీ వసూలు చేయాలంటూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC)కి కూడా మరో ఫిర్యాదు వెళ్లడం ఈ వివాదానికి మరింత మసాలా దట్టించింది.
విద్యార్థుల హక్కుల కోసం మొదలైన ఉద్యమం కాస్తా ఇప్పుడు అసభ్య రాజకీయాలకు అడ్డాగా మారిందనేది ఆర్టీఐ కార్యకర్త ప్రధాన ఆరోపణ. నీట్ పేపర్ లీక్‌పై పోరాడితే తప్పులేదు కానీ, ఆ ముసుగులో ఏకంగా ప్రధాని మోదీని, ఆయన కీర్తిశేషురాలైన తల్లిని అత్యంత దారుణంగా దూషించడం వల్లే తాము ఈ ఫిర్యాదులు చేయాల్సి వచ్చిందని ఆయన కుండబద్దలు కొట్టారు. ఒకేసారి ఈసీ, సీబీఐసీ, మహారాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదులు వెళ్లడంతో… నిన్నటి దాకా సోషల్ మీడియాను ఊపేసిన అభిజీత్ డిప్కే, ఇప్పుడు తన కుటుంబ ఆస్తుల లెక్కలు, పార్టీకి వచ్చిన అక్రమ నిధుల లెక్కలు అధికారులకు చెప్పుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మొత్తానికి అమిత్ తివారీ సంధించిన ఈ ఒక్క ఆర్టీఐ దెబ్బతో కాక్రోచ్ జనతా పార్టీ పునాదులు గట్టిగానే కదులుతున్నాయి!.


