రంగం ఒక్క రోజుకే దైవం ..బతుకు రణరంగం లో నిరుపేద ఆమె…స్వర్ణలత చిరునవ్వు వెనక దాగిన కఠినమైన జీవితం
హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో భవిష్యవాణి వినిపించే మాతంగి స్వర్ణలత జీవితం అత్యంత వైవిధ్యభరితం. ఆషాఢ మాసంలో ఒక రోజు ఆమె వైపు కోట్లాది మంది భక్తులు, ప్రభుత్వ అధికారులు ఆసక్తిగా చూస్తారు. ముఖం నిండా పసుపు, నుదుట కుంకుమ, చేతిలో కిన్నెర పట్టుకుని పచ్చికుండపై నిలబడి సాక్షాత్తూ అమ్మవారి ప్రతిరూపంగా ఆమె భవిష్యత్తు చెబుతారు. కానీ, ఆ ఒక్కరోజు వైభవం ముగిశాక, మిగిలిన రోజులన్నీ ఆమె ఒక సాధారణ టైలర్‌గా ఎన్నో కష్టాలతో జీవితాన్ని నెట్టుకొస్తుంటారు.

దాదాపు రెండు వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ భవిష్యవాణి సంప్రదాయాన్ని ‘ఏర్పుల’ వంశానికి చెందిన మహిళలు కొనసాగిస్తున్నారు. జోగమ్మ, బాలమ్మ, పోశమ్మ, బాగమ్మ, స్వరూపారాణిల తర్వాత 1997 నుంచి స్వర్ణలత ఈ బాధ్యతను స్వీకరించారు. వీరి కుటుంబంలో పుట్టే ఆడపిల్లలు పెళ్లి చేసుకోకుండా జీవితాన్ని మహంకాళి అమ్మవారికే అంకితం చేస్తారు. అందులో భాగంగానే స్వర్ణలతకు సైతం పది చదివే వయసులోనే ముత్యాలమ్మ గుడిలో కత్తితో వివాహం జరిపించి, అమ్మవారి సేవకు అంకితం చేశారు.
సంవత్సరానికోసారి అమ్మవారికి ప్రతిరూపంగా వెలుగొందే స్వర్ణలత నిజ జీవితం మాత్రం పేదరికంతో ముడిపడి ఉంది. తరతరాలుగా గుడి దగ్గర పంబజోడు, జేగంట వాయించే తల్లిదండ్రులు చనిపోవడంతో.. తమ్ముడు దినేష్, పిన్ని, వదినలతో కలిసి ఆమె తుకారాంగేట్‌లోని ఓ చిన్న అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. దినేష్ ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తుండగా, స్వర్ణలత లేడీస్ టైలర్‌గా బ్లౌజులు, దుస్తులు కుడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. రోజంతా కష్టపడితే తప్ప పూట గడవని దయనీయ స్థితిలో ఆమె కుటుంబం కాలం వెళ్లదీస్తోంది.
ఏడాది పొడవునా కుట్టుమిషన్‌తో కుస్తీ పడుతూనే, ఆషాఢమాసం వస్తే చాలు మహంకాళి అమ్మవారి సేవ కోసం ఆమె వేయికళ్లతో ఎదురుచూస్తారు. ఆమె చెప్పే భవిష్యవాణికి ప్రజలతో పాటు ప్రభుత్వం కూడా ఎంతో ప్రాధాన్యతనిచ్చి సలహాలు స్వీకరిస్తుంది. అయితే, కోట్లాది మందికి భవిష్యత్తును చూపే స్వర్ణలత ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దృష్ట్యా, ప్రభుత్వం నుంచి తగిన ఆర్థిక తోడ్పాటు అందిస్తే ఆ కుటుంబానికి ఎంతో ఊరట లభిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


