‘రెంట్ బాయ్ ఫ్రెండ్’ ఆఫర్ల వెనుక భయంకర మోసం.. సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్.
సోషల్ మీడియా వేదికగా సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు తెరతీస్తున్నారు. అమాయకమైన యువతులను లక్ష్యంగా చేసుకుని వల వేస్తున్నారు. తాజాగా ‘రెంట్ బాయ్ ఫ్రెండ్’ (అద్దెకు ప్రియుడు) అనే ఆకర్షణీయమైన ఆఫర్ల పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న భయంకరమైన సైబర్ మోసాల గురించి హైదరాబాద్ సీపీ సజ్జనార్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సైబర్ క్రిమినల్స్ అమ్మాయిలను బురిడీ కొట్టించేందుకు ఎలా ప్లాన్ చేస్తున్నారో ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ మోసగాళ్లు సామాజిక మాధ్యమాలను (SM) వేదికగా చేసుకుని వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా ‘1st August Special – 50% OFF’ అనే పేరుతో ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తున్నారు. చూడముచ్చటైన కుర్రాళ్ల ఫోటోలను పెట్టి, గంటకు లేదా 10 గంటల ప్యాకేజీలు ఉన్నాయంటూ యువతులను ఊరిస్తున్నారు. ఇలాంటి ఆఫర్లకు ఆకర్షితులయ్యే వారు తమకు డైరెక్ట్ మెసేజ్ (DM) చేయాలని కోరుతూ మెల్లగా తమ ట్రాప్‌లోకి లాగుతున్నారని పోలీసులు వివరించారు.
“‘రెంట్ బాయ్ ఫ్రెండ్’ ఆఫర్ల వెనుక పెద్ద సైబర్ మోసం దాగి ఉందని, ఈ ఫేక్ ప్రకటనల విషయంలో అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.”
ఇలాంటి ఫేక్ ప్రొఫైల్స్ మరియు ఆకర్షణీయమైన ఆఫర్లను గుడ్డిగా నమ్మి మోసపోవద్దని అధికారులు స్పష్టం చేశారు. ఎవరైనా సోషల్ మీడియాలో ‘రెంట్ బాయ్ ఫ్రెండ్’ లాంటి అనుమానాస్పద పోస్టులు లేదా ప్రకటనలు చూస్తే ఏమాత్రం ఉపేక్షించకూడదని తెలిపారు. అలాంటివి మీ దృష్టికి వస్తే తక్షణమే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కి కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.


