కవాడిగూడలో కారు బేజారు..? కాంగ్రెస్కు ‘హైడ్రా’ ఫియర్..?మళ్లీ ఎగిరేది కాషాయ జెండానేనా?
రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల వేడి అప్పుడే నగరంలో మొదలైంది. అన్ని ప్రధాన పార్టీలు గ్రేటర్ పీఠం కోసం వ్యూహాలకు పదును పెడుతున్న వేళ, ముషీరాబాద్ నియోజకవర్గంలోని కీలకమైన కవాడిగూడ డివిజన్ ఫలితంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో ఇక్కడ కాషాయ జెండా ఎగురవేసిన భారతీయ జనతా పార్టీ.. రానున్న ఎన్నికల్లో మరోసారి తన సత్తా చాటేందుకు గ్రౌండ్ లెవల్ లో పక్కా ప్లాన్ తో ముందుకు వెళుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఆ ప్రభావం గ్రేటర్ ఎన్నికలపై ఏ మేర పడుతుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొన్నప్పటికీ, కవాడిగూడలో మారుతున్న రాజకీయ ముఖచిత్రం చూస్తే కమలం పార్టీకే కొంత సానుకూల పవనాలు వీస్తున్నాయన్న విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి.
బస్తీల్లో దశాబ్దాలుగా వేధిస్తున్న డ్రైనేజీ వ్యవస్థ, ఇరుకైన రోడ్లు, వర్షాకాలంలో ముంపు సమస్యలు ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదన్నది వాస్తవమే. అయితే, ఈ ఐదేళ్ల కాలంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, నిధుల సాధనలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం లేకపోయినా.. స్థానిక బీజేపీ నాయకత్వం నిరంతరం ప్రజల్లో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం అధికారుల వెంటపడుతున్న తీరు ఓటర్లలో ఒక భరోసాను నింపింది. కేవలం ఎన్నికలప్పుడే కాకుండా, కష్టకాలంలో బస్తీవాసులకు అందుబాటులో ఉండటం కవాడిగూడలో కమలం పార్టీకి అతిపెద్ద ప్లస్ పాయింట్ గా మారింది. స్థానికులతో మమేకమై ముందుకు సాగుతున్న తీరు రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో ఆ పార్టీకి మరోసారి గెలుపు బాటలు వేసేలా కనిపిస్తోంది.

మరోవైపు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి గ్రేటర్ పై సునాయాసంగా జెండా ఎగరేయవచ్చని భావించిన కాంగ్రెస్ పార్టీకి.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘హైడ్రా’ (HYDRAA) వ్యవహారమే ఇప్పుడు పెద్ద గుదిబండగా మారే ప్రమాదం కనిపిస్తోంది. నాలాల ఆక్రమణల తొలగింపు పేరుతో సాగుతున్న ఈ ఆపరేషన్.. కవాడిగూడ, అశోక్ నగర్, లోయర్ ట్యాంక్ బండ్ లాంటి నాలా పరివాహక ప్రాంతాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. దశాబ్దాలుగా ఇక్కడే నివాసం ఉంటున్న సామాన్య, మధ్యతరగతి ప్రజల్లో ఏ క్షణాన తమ ఇళ్లు కూల్చేస్తారోనన్న ఆందోళన తీవ్రంగా ఉంది. సరైన ప్రత్యామ్నాయం చూపకుండా, పేదలకు స్పష్టమైన భరోసా ఇవ్వకుండా సాగుతున్న ఈ చర్యలు స్థానికంగా కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకతను పెంచుతున్నాయి. ఈ భయం రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీకి భారీ నష్టాన్ని చేకూర్చి, పరోక్షంగా బీజేపీకి లాభించే అవకాశాలను స్పష్టంగా చూపిస్తోంది.
ఇక రాష్ట్రంలో అధికారం కోల్పోయి గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్న గులాబీ పార్టీ బీఆర్ఎస్ పరిస్థితి ఇక్కడ మరింత సంక్లిష్టంగా ఉంది. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తిరిగి పుంజుకుని తమ ఉనికిని చాటుకోవాలని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నా, గ్రౌండ్ లెవల్లో వారికి అంత సానుకూలత కనిపించడం లేదు. గత పదేళ్లు అధికారంలో ఉండి చేయలేని అభివృద్ధి, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి చేస్తారన్న నమ్మకం ఓటర్లలో సన్నగిల్లింది. బీఆర్ఎస్ నాయకులు స్థానికంగా కాంగ్రెస్ ‘హైడ్రా’ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రజలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా.. అది కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడానికే పరిమితం అయ్యేలా ఉంది. అంతిమంగా ఈ ఓట్ల చీలిక కూడా బలంగా ఉన్న బీజేపీకే మేలు చేసేలా స్థానిక సమీకరణాలు మారుతున్నాయి.
మొత్తంగా రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల దృక్కోణంలో కవాడిగూడ పోరును విశ్లేషిస్తే.. పైకి ముక్కోణపు పోటీలా కనిపిస్తున్నా, అంతర్గతంగా మాత్రం కమలం పార్టీకే అనుకూల వాతావరణం కనిపిస్తోంది. కాంగ్రెస్ ‘హైడ్రా’ టెన్షన్ తో ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత ఒకవైపు, బీఆర్ఎస్ పై ప్రజల్లో ఉన్న అపనమ్మకం మరోవైపు.. ఓటర్లను ఒక బలమైన, సురక్షితమైన ప్రత్యామ్నాయం వైపు చూసేలా చేస్తున్నాయి. తమ హిందుత్వ ఓటు బ్యాంకును పదిలంగా ఉంచుకుంటూనే, నిరంతరం బస్తీల్లో ఉండే స్థానిక నాయకత్వంతో కవాడిగూడలో కాషాయ జెండాను మరోసారి రెపరెపలాడించేందుకు బీజేపీకి అవకాశాలు మెండుగా ఉన్నాయన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.


