అఖండ భారతాన్ని ముక్కలు చేసిన కసాయి: సాక్ష్యాలను తగులబెట్టి రాడ్‌క్లిఫ్ దాచిన ఆ చీకటి రహస్యాలేంటి?
భారతదేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రక్తపాతానికి కారణమైన దేశవిభజన కేవలం ఒక భౌగోళిక రేఖ కాదు, అది లక్షలాది మంది భారతీయుల పాలిట మరణశాసనం. ఈ అఖండ భరతఖండాన్ని ముక్కలు చేయడానికి వలసవాద బ్రిటీష్ పాలకులు ఎంచుకున్న వ్యక్తి సిరిల్ రాడ్‌క్లిఫ్. 1947కు ముందు కనీసం ఒక్కసారి కూడా భారతగడ్డపై అడుగుపెట్టని, ఇక్కడి సంస్కృతి, భౌగోళిక పరిస్థితులపై ఏమాత్రం అవగాహన లేని ఒక సాధారణ బ్రిటీష్ లాయర్‌కు ఈ బాధ్యత అప్పగించడం వలసవాదుల అహంకారానికి, మన దేశం పట్ల వారికున్న చులకన భావానికి నిదర్శనం. ఒక అనామకుడి చేతిలో పవిత్రమైన భారత భూభాగం ముక్కలైపోయింది.

జులై 8, 1947న రాడ్‌క్లిఫ్ మొదటిసారిగా ఇండియాలో అడుగుపెట్టాడు. అతనికి అప్పగించిన ప్రధాన బాధ్యత.. అఖండ భారతదేశాన్ని విభజించి, ముఖ్యంగా పంజాబ్, బెంగాల్ ప్రావిన్సులను (రాష్ట్రాలను) నిలువునా చీల్చి ‘పాకిస్తాన్’ అనే కొత్త దేశాన్ని సృష్టించడం! పశ్చిమాన పంజాబ్‌ను, తూర్పున బెంగాల్‌ను ముక్కలు చేసి రెండు దేశాల మధ్య అంతర్జాతీయ సరిహద్దులు గీయడానికి ఆ అనామకుడికి బ్రిటీష్ ప్రభుత్వం ఇచ్చిన గడువు కేవలం ఆరు వారాల కంటే తక్కువే. ఇక్కడి నేల, నీరు, ప్రజల జీవనవిధానం గురించి ఏమాత్రం తెలియని ఒక విదేశీయుడు కాగితంపై గీసిన ఆ అజ్ఞానపు ‘రాడ్‌క్లిఫ్ రేఖ’ వల్ల తరతరాలుగా కలిసి బతికిన ప్రజలు, పచ్చని గ్రామాలు, సాగునీటి కాలువలు, రైల్వే నెట్‌వర్క్‌లు దారుణంగా తెగిపోయాయి. ఫలితంగా ఆధునిక చరిత్రలోనే అత్యంత దారుణమైన రక్తపాతం, ఊహించని స్థాయిలో బలవంతపు వలసలు జరిగాయి

అయితే ఇక్కడ అత్యంత వివాదాస్పదమైన, కుట్రపూరితమైన విషయం మరొకటి ఉంది. అఖండ భారతాన్ని ఛిద్రం చేసిన ఆ రక్తపు గీతను గీసిన తర్వాత, రాడ్‌క్లిఫ్ తన వ్యక్తిగత పత్రాలను, నోట్స్, మరియు సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా తగులబెట్టాడు. ఏ ప్రాతిపదికన ఈ దారుణమైన సరిహద్దులను నిర్ణయించాడో, తెర వెనుక బ్రిటీష్ పాలకులతో జరిగిన చీకటి ఒప్పందాలు ఏమిటో ప్రపంచానికి తెలియకుండా ఆ రహస్యాలను తనతో పాటే సమాధి చేశాడు. ఇది కేవలం పత్రాలను నాశనం చేయడం కాదు, ఒక చారిత్రక నేరానికి సంబంధించిన సాక్ష్యాలను మాయం చేయడమే.

ఈ విభజన కమిషన్‌లో కాంగ్రెస్, ముస్లిం లీగ్ ప్రతినిధులు ఉన్నప్పటికీ, వారి మధ్య ఉన్న తీవ్రమైన విభేదాల కారణంగా అంతిమ నిర్ణయాధికారం రాడ్‌క్లిఫ్ చేతుల్లోనే ఉండిపోయింది. నాటి కాంగ్రెస్ నాయకత్వం ఒక విదేశీయుడి చేతికి దేశ భవితవ్యాన్ని అప్పగించి చేతగానితనంతో చోద్యం చూడటం వారి చారిత్రక వైఫల్యానికి అద్దం పడుతుంది. ఇక్కడి పరిస్థితులపై కనీస అవగాహన లేని వ్యక్తి, భౌగోళిక సర్వేలు చేయకుండా, కేవలం కాగితాలపై చూసి కోట్ల మంది భారతీయుల తలరాతలను రాస్తుంటే నాటి పెద్దలు మౌనంగా ఉండిపోయారు.

రాడ్‌క్లిఫ్ గీసిన ఆ కృత్రిమ రేఖ కేవలం భూమిని మాత్రమే కాదు, అప్పటిదాకా కలిసి బతికిన జీవన వ్యవస్ధలనే కోసేసింది. ఒక నది ఒక దేశంలో పుడితే దాని కాలువలు మరో దేశంలోకి వెళ్లాయి, పొలాలు ఒకవైపు ఉంటే రైతులు మరో వైపు మిగిలిపోయారు. విడ్డూరమైన విషయం ఏమిటంటే, బెంగాల్ కమిషన్ సమావేశాలకు అతడు కనీసం హాజరు కూడా కాలేదు. కేవలం ఎవరో తెచ్చిచ్చిన పత్రాలను చూసి ఢిల్లీలో కూర్చుని బెంగాల్ సరిహద్దులను నిర్ణయించాడు. లక్షలాది మంది ప్రజల ప్రాణాలతో, వారి మనోభావాలతో బ్రిటీష్ సామ్రాజ్యం ఆడిన అత్యంత క్రూరమైన క్రీడ ఇది.

చివరిగా, రాడ్‌క్లిఫ్ కాల్చేసిన ఆ పత్రాలు బ్రిటీష్ వలసవాద పాలకులు భారతదేశంపై చేసిన అంతులేని పాపాలకు ప్రతీక. తమ స్వార్థం కోసం, విభజించి పాలించే కుటిల నీతి కోసం అఖండ దేశాన్ని మతాల ప్రాతిపదికన ముక్కలు చేసి, ఆ నెపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆధారాలను నాశనం చేసిన తీరు వారి కుటిల బుద్ధికి నిదర్శనం. ఈనాటికీ ఆధునిక భారతదేశం ఆనాటి గాయాలను మోస్తూనే ఉంది. విదేశీ శక్తుల చేతిలో, వారి అజెండాల చేతిలో దేశ భవితవ్యాన్ని పెడితే ఎలాంటి ఘోరాలు జరుగుతాయో చెప్పడానికి రాడ్‌క్లిఫ్ చర్యలు, అతడు దాచిన రహస్యాలు చరిత్రలో ఒక చీకటి పాఠంగా మిగిలిపోతాయి.



