నాడు ఎగతాళి.. నేడు క్రెడిట్ చోరీ: భోగాపురంపై జగన్ యూటర్న్!
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కల అయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలోనే (ఆగస్టు 17 తర్వాత) పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధమవుతున్న తరుణంలో, దీని క్రెడిట్ తమదంటే తమదని అధికార కూటమి, ప్రతిపక్ష వైఎస్సార్సీపీల మధ్య తీవ్రస్థాయిలో రాజకీయ మాటల యుద్ధం నడుస్తోంది.
గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించారు. “ఎర్ర బస్సు కూడా రాని గ్రామానికి ఎయిర్ బస్సు అవసరమా?” అంటూ విమానాశ్రయ నిర్మాణాన్ని ఒక ‘పిచ్చి చర్య’గా అభివర్ణించారు. అప్పట్లో రైతుల చేత కోర్టుల్లో కేసులు వేయించి పనులను అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆయన.. ఇప్పుడు అదే ఎయిర్ పోర్ట్ నిర్మాణ క్రెడిట్ తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తుండటం విమర్శలకు తావిస్తోంది.

వాస్తవానికి విశాఖలో పౌర విమానాశ్రయం ఏర్పాటు చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు 1997లోనే వచ్చింది. ప్రస్తుత విశాఖ విమానాశ్రయం పూర్తిగా ఇండియన్ నేవీ కంట్రోల్లో ఉండటం వల్ల వాణిజ్య విమానాల రాకపోకలకు తీవ్ర ఆటంకాలు కలుగుతున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి చంద్రబాబు ప్రభుత్వమే భోగాపురంలో భూసేకరణ చేసి, రైతులకు భారీ పరిహారం అందించి, పర్యావరణ అనుమతులు సాధించి 2019లో శంకుస్థాపన చేసింది.
ఈ విమానాశ్రయాన్ని హుదూద్ లాంటి భయంకరమైన తుఫాన్లను (275 కి.మీ వేగంతో గాలులు వీచినా), 24 గంటల్లో 27 సెంటీమీటర్ల భారీ వర్షపాతాన్ని తట్టుకునేలా అత్యంత పటిష్టంగా నిర్మిస్తున్నారు. గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ఈ పనులు నెమ్మదించినప్పటికీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉండటంతో భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి.


