4.5 జనరేషన్ ఫైటర్ జెట్ ‘LCA Mk-1A’ రాకకు సర్వం సిద్ధం.. వివరాలు వెల్లడించిన HAL
భారత వాయుసేన (IAF) గగనతల ఆధిపత్యాన్ని మరింత పెంచేందుకు 4.5 జనరేషన్ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LCA) ‘తేజస్ ఎంకే-1ఏ’ యుద్ధ విమానాలు సిద్ధమవుతున్నాయి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) ఈ ఏడాది చివరికల్లా వీటి డెలివరీని ప్రారంభించనుంది. తుది దశలో ఉన్న రాడార్ సమస్యల పరిష్కారం, ఆయుధాల అనుసంధాన (వెపన్ ఇంటిగ్రేషన్) టెస్టింగ్ ప్రక్రియలు మరో నెల రోజుల్లో పూర్తి కానున్నాయని హెచ్ఏఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రవి కె. స్పష్టం చేశారు. దీంతో ఈ ఏడాది డిసెంబర్ నాటికి తొలి విడత యుద్ధ విమానాలు వాయుసేన చేతికి రానున్నాయి.
భారీ ఒప్పందాలు.. వాయుసేన ఆధునికీకరణ భారత వాయుసేన ఫైటర్ ఫ్లీట్‌ను బలోపేతం చేయడంలో భాగంగా మొత్తం 180 ఎంకే-1ఏ ఫైటర్ జెట్ల కోసం సుమారు రూ. 1.1 లక్షల కోట్లతో ఆర్డర్లు ఇచ్చింది. ఇందులో ఫిబ్రవరి 2021లో 83 విమానాలకు తొలి ఒప్పందం జరగ్గా, సెప్టెంబర్ 2025లో మరో 97 ఫైటర్ జెట్లకు రెండో ఒప్పందం కుదిరింది. వాస్తవానికి 2021 ఆర్డర్ ప్రకారం మార్చి 2024కే తొలి విమానం డెలివరీ కావాల్సి ఉంది. కానీ, అమెరికాకు చెందిన జీఈ ఏరోస్పేస్ (GE Aerospace) కంపెనీ నుండి F404-IN20 ఇంజిన్ల సరఫరాలో జాప్యం కారణంగా ఇది కాస్త ఆలస్యమైంది. ప్రస్తుతం 10 ఇంజిన్లు చేరుకున్నాయని, 27 ఎయిర్‌ఫ్రేమ్‌లు సిద్ధంగా ఉన్నాయని, కనీసం 10 విమానాలను తక్షణమే డెలివరీ చేయగలమని హెచ్ఏఎల్ తెలిపింది.
మేక్ ఇన్ ఇండియాకు పెద్దపీట.. ఏటా 24 విమానాల ఉత్పత్తి ప్రతి ఏటా 24 తేజస్ ఎంకే-1ఏ విమానాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం హెచ్ఏఎల్కు ఉంది. ఇంజిన్ల రాకతో సంబంధం లేకుండా ఎయిర్ఫ్రేమ్ల నిర్మాణం నిరంతరాయంగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా రెండో విడతలో ఆర్డర్ చేసిన 97 విమానాల్లో పూర్తి స్వదేశీ సాంకేతికతకు పెద్దపీట వేయనున్నారు. ఇందులో దేశీయంగా అభివృద్ధి చేసిన ‘ఉత్తమ్ ఏసా రాడార్’ (Uttam AESA radar), ‘స్వయం రక్షా కవచ్’ (ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్) వంటి అధునాతన వ్యవస్థలను పొందుపరుస్తున్నారు. మొదటి 83 విమానాల్లో ఉన్న 40 రకాల ఇంపోర్టెడ్ సిస్టమ్స్ స్థానంలో.. తదుపరి విమానాల్లో స్వదేశీ పరికరాలను వాడనున్నారు.
తేజస్ ఎంకే-2 పై దృష్టి.. 80% టెక్నాలజీ బదిలీ తేజస్ ఎంకే-1ఏ తర్వాత మరింత అడ్వాన్స్డ్ అయిన ‘తేజస్ ఎంకే-2’ కార్యక్రమం కూడా శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫ్రంట్, సెంటర్, రేర్ ఫ్యూజ్‌లేజ్ (Fuselage) సెక్షన్ల అనుసంధానం పూర్తయి, ఎయిర్‌ఫ్రేమ్ రెడీ అయింది. మార్చి 2027 నాటికి తొలి గ్రౌండ్ రన్, ఆ తర్వాత కొద్ది నెలల్లోనే తొలి ఫ్లైట్ టెస్ట్ చేయాలని హెచ్ఏఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఎంకే-2 ప్రోగ్రామ్ కోసం అమెరికాకు చెందిన జీఈ ఏరోస్పేస్తో కలిసి F414 ఇంజిన్లను దేశీయంగా ఉత్పత్తి చేయనున్నారు. ఇందులో 80% సాంకేతికత బదిలీ (Technology Transfer) జరగనుంది. అన్ని సాంకేతిక సమస్యలు పరిష్కారమయ్యాయని, కమర్షియల్ ప్రపోజల్ రాగానే ఒప్పందం ఖరారు కానుందని రవి కె. వెల్లడించారు.
తేజస్ ఎంకే-1ఏ ప్రత్యేకతలు ఇవే.. ఇది 4.5 జనరేషన్, మల్టీ-రోల్, ఆల్-వెదర్ ఫైటర్ జెట్. క్లోజ్ కంబాట్, గ్రౌండ్ అటాక్, అఫెన్సివ్ ఎయిర్ సపోర్ట్‌తో పాటు గ్రౌండ్ మారిటైమ్ ఆపరేషన్స్ చేయగల సత్తా దీని సొంతం. కాంపోజిట్ మెటీరియల్స్‌తో తయారుచేయడం వల్ల తన క్లాస్‌లోనే అత్యంత తేలికైన, చిన్నపాటి యుద్ధ విమానంగా ఇది గుర్తింపు పొందింది. డిజిటల్ మ్యాప్ జనరేటర్, స్మార్ట్ మల్టీ-ఫంక్షన్ డిస్ప్లేలు, గాలిలో ఉండగానే ఇంధనం నింపుకునే సదుపాయం (In-Flight Refuelling) ఇందులో ఉన్నాయి. ఇందులో ఉన్న 9 హార్డ్ పాయింట్స్ ద్వారా లాంగ్-రేంజ్ BVR (బియాండ్ విజువల్ రేంజ్), WVR క్షిపణులను, బాంబులను అత్యంత కచ్చితత్వంతో ప్రయోగించవచ్చు.
ప్రస్తుతం భారత వాయుసేనలో ఆథరైజ్డ్ 42.5 ఫైటర్ స్క్వాడ్రన్లకు గాను దాదాపు 30 మాత్రమే ఉన్నాయి. రాబోయే కాలంలో 350కి పైగా ఎల్సీఏ ఫైటర్లను (Mk-1, Mk-1A, Mk-2 వెర్షన్లు) వాయుసేన వినియోగించనుండటంతో, ఇవి ఐఏఎఫ్ పోరాట దళానికి వెన్నెముకగా మారనున్నాయి.


