దిశా సాలియన్ మృతి కేసులో సంచలన ఎఫ్ఐఆర్.. ఆదిత్య ఠాక్రేను రక్షించేందుకే ఈ ఘాతుకం!
ప్రముఖ సెలబ్రిటీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసులో తాజాగా నమోదైన ఎఫ్ఐఆర్ (FIR) సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. దిశా మరణం కేవలం ఆత్మహత్య కాదని, ఇదొక సుదీర్ఘమైన నేరపూరిత కుట్ర అని ఆమె తండ్రి సతీష్ సాలియన్ తీవ్ర ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, శివసేన (యుబిటి) నాయకుడు ఆదిత్య ఠాక్రేతో పాటు ఇతర నిందితులను రక్షించేందుకే తన కుమార్తెను సామూహిక అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేశారని ఆయన బాంబే హైకోర్టు జోక్యంతో సీబీఐ దర్యాప్తు చేస్తున్న ఈ కేసు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.

ఈ ఎఫ్ఐఆర్ ప్రకారం, దిశా సాలియన్ మరియు దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ల వద్ద ఆదిత్య ఠాక్రే మరియు ఇతరులకు సంబంధించిన డ్రగ్స్ స్మగ్లింగ్, చైల్డ్ అబ్యూస్ మరియు పలు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన కీలక ఆధారాలు ఉన్నాయి. ఈ సమాచారాన్ని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా బహిర్గతం చేసి, వారి నేరాలను సమాజానికి తెలియజేయాలని దిశా మరియు సుశాంత్ భావించారు. ఈ విషయాలు బయటకు వస్తే తమకు ముప్పు వాటిల్లుతుందన్న భయంతోనే నిందితులు ఆమెను అంతం చేయడానికి కుట్ర పన్నారని సాలియన్ ఆరోపించారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఈ ప్రెస్ మీట్ ప్రణాళిక గురించి నటి రియా చక్రవర్తికి చెప్పగా, ఆమె ఆ సమాచారాన్ని ఆదిత్య ఠాక్రే మరియు డినో మోరియాలకు చేరవేసినట్లు ఎఫ్ఐఆర్లో వివరించారు. తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతోనే ఆదిత్య ఠాక్రే మరియు అతని అనుచరులు ఈ దారుణానికి ఒడిగట్టారని ఆరోపణలు ఉన్నాయి. దిశాను సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన తర్వాత, ఈ దారుణమైన నేరాన్ని కప్పిపుచ్చేందుకే కుట్రపూరితంగా ఇదంతా ఒక ‘ఆత్మహత్య’గా చిత్రీకరించారని ఆమె తండ్రి స్పష్టం చేశారు.

దిశా మరణం తరువాత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన ప్రాణాలకు కూడా ముప్పు ఉందని తీవ్రంగా భయపడినట్లు ఈ ఫిర్యాదులో వెల్లడించారు. తనను కాపాడుకునే క్రమంలో మొబైల్ ఫోన్లు, ఇతర డిజిటల్ పరికరాలలోని డేటాతో పాటు సమావేశాలు జరిగిన ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీని ఒక సైబర్ నిపుణుడి సాయంతో తొలగించాలని సుశాంత్ తన సిబ్బందిని ఆదేశించినట్లు ఎఫ్ఐఆర్ పేర్కొంది. అంతేకాకుండా, అప్పట్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఉద్ధవ్ ఠాక్రే, క్యాబినెట్ మంత్రిగా ఉన్న ఆదిత్య ఠాక్రేలు తమ అధికారాన్ని ఉపయోగించి పోలీసు అధికారులు, ప్రభుత్వ అధికారుల సాయంతో ఈ కేసును కప్పిపుచ్చడంలో కీలక పాత్ర పోషించారని సతీష్ సాలియన్ ఆరోపించారు.

దిశా మృతిపై పోలీసులు మొదటి నుంచి చెబుతున్న ‘సూసైడ్ థియరీ’ని తాను ఎన్నడూ నమ్మలేదని ఆమె తండ్రి సతీష్ సాలియన్ స్పష్టం చేశారు. సాక్షుల వాంగ్మూలాలు, సీసీటీవీ ఫుటేజీ, వైద్య రికార్డులు మరియు కీలకమైన ఎలక్ట్రానిక్ ఆధారాల నిర్వహణలో అనేక అవకతవకలు, వైరుధ్యాలు ఉన్నాయని ఆయన ఎత్తిచూపారు. మరీ దారుణమైన విషయం ఏమిటంటే, దిశా సాలియన్ పోస్ట్‌మార్టం రిపోర్టును ఐదేళ్ల పాటు ఆమె కుటుంబానికి ఇవ్వకుండా దాచిపెట్టారు. చివరగా ఒక న్యాయవాది జోక్యంతో గతేడాదే ఆ రిపోర్టును ఆయనకు అందజేశారు.


