వీసా చిక్కులు.. ఆస్ట్రేలియాలో మోహన్‌లాల్ లైవ్ షో వాయిదా!
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ అభిమానులకు ఊహించని నిరాశ ఎదురైంది. ఆయనకు ఆస్ట్రేలియా వీసా మంజూరు కావడంలో జాప్యం జరగడంతో, సిడ్నీలో శనివారం జరగాల్సిన ఆయన లైవ్ షో వాయిదా పడింది. సిడ్నీలోని నార్వెస్ట్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ‘వైకిట్టు ఎంధా పరిపాడి’ (ఈ సాయంత్రం ఏంటి కార్యక్రమం?) అనే పేరుతో ఈ భారీ కార్యక్రమం జరగాల్సి ఉంది.
ప్రస్తుతం సింగపూర్‌లో ఉన్న మోహన్‌లాల్.. వీసా కోసం ఎదురుచూడగా అది సకాలంలో రాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. అప్పటికే ఆయన బృందంలోని పలువురు సభ్యులు సిడ్నీ చేరుకున్నారు. ఈ పరిణామంపై మోహన్‌లాల్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సింగపూర్ నుంచే ఒక వీడియోను విడుదల చేశారు. ఇది సాంకేతిక లోపమా లేదా క్లరికల్ తప్పిదమా అనేది తెలియదని, కానీ ఈ పరిస్థితికి పూర్తి బాధ్యత తనదేనని తెలుపుతూ టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులకు ఆయన క్షమాపణలు చెప్పారు.
అయితే, ఈ కార్యక్రమాన్ని రద్దు చేయలేదని, కేవలం వాయిదా మాత్రమే వేశామని నిర్వాహకులు స్పష్టం చేశారు. మోహన్‌లాల్ వీసా దరఖాస్తు తిరస్కరణకు గురవ్వలేదని, అనుమతి ప్రక్రియలో ఆలస్యం జరగడం వల్లే ఈ ఆటంకం ఏర్పడిందని వారు తెలిపారు. త్వరలోనే ఈ లైవ్ షోకి సంబంధించిన కొత్త తేదీలను ప్రకటిస్తామని అభిమానులకు భరోసా ఇచ్చారు.


