సహజీవనం చేసేవారికీ బిగ్ షాక్.. ఆ తప్పు చేస్తే పెళ్లి కాకపోయినా నేరుగా జైలుకే!
సహజీవనం చేసే జంటల విషయంలో భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పును వెలువరించింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్.కోటిశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇస్తూ, సహజీవనంలో ఉన్న మహిళను వేధింపులకు గురిచేస్తే భాగస్వామిపై భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 498-ఏ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయవచ్చని స్పష్టం చేసింది. చట్టబద్ధంగా పెళ్లి కాలేదన్న ఒకే ఒక్క కారణంతో భర్త స్థానంలో ఉన్న వ్యక్తి వేధింపుల కేసుల నుంచి తప్పించుకోలేడని కోర్టు తేల్చిచెప్పింది. వివాహం జరగలేదన్న సాకును చూపుతూ బాధితురాలికి చట్టపరమైన రక్షణ కల్పించకపోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు (సమానత్వపు హక్కు) విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది.
ఈ తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు ‘భర్త’ అనే పదానికి విస్తృతమైన వివరణను ఇచ్చింది. సహజీవనం చేస్తున్న వ్యక్తిని కూడా భర్తతో సమానంగా పరిగణించవచ్చని, వారు కూడా వేధింపులకు పాల్పడితే చట్టం నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేసింది. అయితే, అన్ని రకాల సహజీవనాలకు ఈ తీర్పు వర్తించదని కోర్టు ఓ ముఖ్యమైన మినహాయింపు ఇచ్చింది. కేవలం పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేస్తూ, ఆ మహిళను హింసించిన వారికి మాత్రమే ఈ సెక్షన్ 498-ఏ వర్తిస్తుందని తెలిపింది. అలాగే, వేధింపుల ఫిర్యాదు రాగానే ప్రాథమిక విచారణ జరపకుండా తక్షణ అరెస్టులు చేయవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. మహిళలను భర్త లేదా అతని కుటుంబ సభ్యుల మానసిక, శారీరక వేధింపుల నుంచి రక్షించాలన్నదే సెక్షన్ 498-ఏ ప్రధాన ఉద్దేశమని, ఇలాంటి వేధింపులు కేవలం చట్టబద్ధమైన వివాహ బంధంలోనే జరుగుతాయని భావించడం వాస్తవ విరుద్ధమని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
వ్యక్తిగత స్వేచ్ఛలో భాగంగా జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కును చట్టం ఎప్పుడో గుర్తించిందని ధర్మాసనం ఈ సందర్భంగా గుర్తుచేసింది. అలా తన భాగస్వామిని ఎంచుకున్న మహిళకు చట్టపరమైన రక్షణను నిరాకరించడం న్యాయం కాదని అభిప్రాయపడింది. చట్టబద్ధమైన వివాహం చేసుకున్న మహిళకు ఒక రకమైన రక్షణ కల్పించి, అదే తరహా సంబంధంలో ఉన్న (సహజీవనం చేస్తున్న) మరో మహిళకు రక్షణను నిరాకరించడం ఏమాత్రం సహేతుకం కాదని కోర్టు స్పష్టం చేసింది. కాబట్టి, సహజీవనం చేస్తున్న మహిళకు తన భాగస్వామి లేదా అతని కుటుంబ సభ్యుల నుంచి వేధింపులు ఎదురైతే, ఆమెకు కూడా వివాహితతో సమానంగా పూర్తి చట్టపరమైన రక్షణ కల్పించాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.


