జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఘాతుకం.. అమాయకపు వలస కూలీ బలి

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అమాయకపు వలస కూలీలే లక్ష్యంగా కుల్గామ్ జిల్లాలో ఉగ్రదాడికి పాల్పడ్డారు. శుక్రవారం సాయంత్రం జిల్లాలోని కెల్లామ్ ఏరియాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. తమ పనులు చేసుకుంటున్న ఇద్దరు వలస కూలీల మీద ఉగ్రవాదులు ఆకస్మికంగా విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ హఠాత్పరిణామంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
ఉగ్రవాదులు జరిపిన ఈ కాల్పుల్లో ఇద్దరు వలస కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. రక్తపు మడుగులో ఉన్న వారిని గమనించిన అధికారులు హుటాహుటిన దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రిలో తీవ్ర గాయాలకు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఒక కూలీ ప్రాణాలు కోల్పోయాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరొక వ్యక్తికి మెరుగైన వైద్యం అందించడం కోసం అనంత్‌నాగ్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌కు తరలించారు. ప్రస్తుతం అతనికి అక్కడ చికిత్స కొనసాగుతోంది.
ఈ ఉగ్రదాడిపై సమాచారం అందుకున్న వెంటనే భారత భద్రతా దళాలు, స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కెల్లామ్ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దాడికి పాల్పడి పరారీలో ఉన్న ఉగ్రవాదుల కోసం ఆ ఏరియాను చుట్టుముట్టి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి.


