తమ తప్పులు మరచి నీతులు చెబుతున్న కేటీఆర్: నాటి పేపర్ లీకేజీలు, ఇంటర్ విద్యార్థుల బలిదానాలు గుర్తులేవా?
గత ప్రభుత్వ హయాంలో జరిగిన వరుస పేపర్ లీకేజీలు, పరీక్షల నిర్వహణ వైఫల్యాలను పూర్తిగా విస్మరించి, ప్రస్తుత పరిస్థితులపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ‘తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు’ అన్న చందంగా ఆయన తీరు ఉందని పలువురు మండిపడుతున్నారు. తెలంగాణ చరిత్రలోనే సంచలనాత్మకమైన 2023 మార్చి నాటి టీఎస్పీఎస్సీ (TSPSC) కుంభకోణంలో సుమారు 15 పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ కావడం వేలాది మంది నిరుద్యోగులను తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేసింది. దీనికి తోడు విద్యుత్ శాఖ (TSPDCL/TSNPDCL) అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష, అలాగే టెన్త్ పబ్లిక్ పరీక్షల సమయంలో హిందీ, తెలుగు ప్రశ్నపత్రాలు వాట్సాప్ ద్వారా బయటకు రావడం అప్పట్లో విద్యావ్యవస్థ డొల్లతను బట్టబయలు చేశాయి. ఈ చేదు నిజాలను కేటీఆర్ అంత సులభంగా ఎలా మర్చిపోయారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
వీటితో పాటు 2019 ఏప్రిల్ లో వెల్లడించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో దొర్లిన తీవ్ర మూల్యాంకన తప్పిదాలు రాష్ట్రవ్యాప్తంగా పెను విషాదాన్ని మిగిల్చిన విషయం విధితమే. అధికారుల నిర్లక్ష్యం, సాంకేతిక లోపాల కారణంగా సుమారు 3.5 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయినట్లు తప్పుగా ఫలితాలు రావడంతో దాదాపు 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఫెయిల్ అయ్యానని ఆత్మహత్య చేసుకున్న అనామిక లాంటి విద్యార్థిని, తీరా రీ-వెరిఫికేషన్లో పాస్ అయినట్లు తేలడం నాటి ప్రభుత్వ నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం. తమ పాలనలో నిరుద్యోగులు, విద్యార్థుల పాలిట ప్రాణసంకటంగా మారిన ఇన్ని వైఫల్యాలను పూర్తిగా పక్కనపెట్టి, ఇప్పుడు కేటీఆర్ కొత్తగా నీతులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విమర్శకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.


