నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రభుత్వ పీజీ కళాశాలలో అత్యంత దిగ్భ్రాంతికరమైన, సంచలన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. విద్యార్థులకు మార్గదర్శిగా నిలవాల్సిన కాలేజీ ప్రిన్సిపాల్, ఓ విద్యార్థిపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. అయితే, ఆ విద్యార్థి ధైర్యంగా తిరగబడటంతో సదరు ప్రిన్సిపాల్ చివరకు నగ్నంగా పారిపోవాల్సి వచ్చింది.
పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ఈ కొల్లాపూర్ పీజీ కాలేజీలో చదువు పూర్తి చేసుకున్న ఒక విద్యార్థి, తన టీసీ (బదిలీ సర్టిఫికేట్) తీసుకోవడం కోసం కళాశాలకు వచ్చాడు. అయితే ఆ విద్యార్థిపై ప్రిన్సిపాల్ గత కొంతకాలంగా కన్నేసి, శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో టీసీ విషయమై మాట్లాడాలని చెప్పి విద్యార్థిని తన గదికి పిలిపించుకున్నాడు.

గదిలోకి వచ్చిన విద్యార్థిపై ప్రిన్సిపాల్ ఒక్కసారిగా లైంగిక దాడికి యత్నించాడు. ప్రిన్సిపాల్ చేస్తున్న ఈ దారుణాన్ని భరించలేకపోయిన సదరు విద్యార్థి, ఆత్మరక్షణ కోసం తీవ్రంగా ప్రతిఘటించాడు. కోపంతో ప్రిన్సిపాల్ రహస్యాంగాలపై గట్టిగా కొరికేశాడు. దీంతో ఊహించని దెబ్బకు ప్రిన్సిపాల్ విలవిలలాడిపోగా, విద్యార్థి అక్కడ నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు.

బయటకు వచ్చిన బాధితుడు జరిగిందంతా తోటి విద్యార్థులకు వివరించాడు. ఆగ్రహానికి గురైన విద్యార్థులంతా కలిసి అర్ధరాత్రి వేళ ప్రిన్సిపాల్ నివాసానికి చేరుకున్నారు. భారీ సంఖ్యలో విద్యార్థులు రావడాన్ని చూసి భయపడిపోయిన ప్రిన్సిపాల్, కనీసం బట్టలు కూడా వేసుకోకుండా నగ్నంగానే అక్కడి నుంచి పారిపోయాడు.
ఈ ఘటనపై బాధితుడు తోటి విద్యార్థుల సాయంతో పోలీసులను ఆశ్రయించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. నిందితుడైన ప్రిన్సిపాల్‌ను తక్షణమే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని, అతనిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రాత్రంతా అక్కడే వేచి చూశారు. ఈ దారుణ ఘటన ప్రస్తుతం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.


