ప్రియురాలి సోషల్ మీడియాతో చిక్కిన ఉగ్రవాది!
దేశంలో భారీ ఉగ్ర కుట్రను పశ్చిమ బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) పోలీసులు భగ్నం చేశారు. పాకిస్థాన్‌కు చెందిన ‘జైషే మహమ్మద్’ (JeM) ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న హమీమ్ మొండల్ అనే అనుమానితుడిని అధికారులు అరెస్ట్ చేశారు. ఇతని ప్రణాళికలు పోలీసులనే విస్మయానికి గురిచేశాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కదలికలపై నిఘా ఉంచి, భద్రతా లోపాలను పసిగట్టి ఆయనను లక్ష్యంగా చేసుకోవాలని కుట్ర పన్నాడు. దానికి తోడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనల్లోకి పోలీసు యూనిఫామ్‌లో చొరబడి భారీ ఎత్తున అల్లర్లు సృష్టించాలని పాకిస్థాన్ హ్యాండ్లర్ల నుంచి హమీమ్‌కు ఆదేశాలు అందాయి.
ఈ ఉగ్ర కుట్రలో హనీట్రాప్ కోణం బయటపడటం మరింత సంచలనంగా మారింది. దర్యాప్తులో భాగంగా హమీమ్ ప్రియురాలు అర్పితా సర్కార్‌ను జార్ఖండ్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ కలిసి రాష్ట్ర మంత్రి ఉమేష్ రే కుమారుడిని హనీట్రాప్ చేసి కిడ్నాప్ చేయాలని, తద్వారా భారీగా డబ్బు వసూలు చేయాలని పథకం పన్నారు. అర్పిత పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులను సైతం హనీట్రాప్ చేసి, ఆ కీలక సమాచారాన్ని హమీమ్‌కు చేరవేసేది. వీరంతా పాకిస్థాన్‌లోని ‘షాజాద్ భట్టి గ్యాంగ్’ ఆదేశాల మేరకు నార్కో-టెర్రరిజం కార్యకలాపాలు సాగిస్తున్నట్లు విచారణలో తేలింది.
ఆసక్తికరంగా, ఈ ఉగ్ర నెట్వర్క్ గుట్టు సోషల్ మీడియా ద్వారానే రట్టయింది. హమీమ్, అర్పిత ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమై గత నాలుగేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుపుతున్నారు. అర్పిత సోషల్ మీడియా ఖాతాలపై నిఘా పెట్టిన ఎస్టీఎఫ్ అధికారులకు హమీమ్ అసలు రూపం, పాకిస్థాన్ ఉగ్రవాదులతో వారి వాట్సాప్ చాట్లు దొరికిపోయాయి. దర్యాప్తులో వీరి వద్ద నుంచి బ్రిటన్, మెక్సికో దేశాలకు చెందిన అంతర్జాతీయ సిమ్ కార్డులు లభ్యమయ్యాయి. ఆ సిమ్ కార్డుల సాయంతోనే వారు పాకిస్థాన్‌లోని తమ హ్యాండ్లర్లతో ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ నెరిపినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.


