వరంగల్ తూర్పులో మారుతున్న రాజకీయ ముఖచిత్రం… కొండా సురేఖకు ఓటమి తప్పదా?
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నిన్నటి దాకా అధికార పార్టీకి బ్రహ్మరథం పట్టిన ఓటర్లలో ఇప్పుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మీ జర్నలిస్ట్ శిరీష అందిస్తున్న ఈ ప్రత్యేక కథనంలో గ్రౌండ్ రిపోర్ట్ పరిశీలిస్తే… సిట్టింగ్ ఎమ్మెల్యే కొండా సురేఖకు రాబోయే ఎన్నికల్లో పెద్ద గండమే పొంచి ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ‘ఆరు గ్యారెంటీలు’ క్షేత్రస్థాయిలో నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు, విద్యార్థులకు ఎన్నో ఆశలు కల్పించిన ప్రభుత్వం, ఇప్పుడు ఆ పథకాలను అర్హులైన అందరికీ చేర్చడంలో విఫలమవుతోందన్న భావన ప్రజల్లో నాటుకుపోయింది. దీనికి తోడు కొండా సురేఖ నియోజకవర్గ ప్రజలకు, స్థానిక సమస్యలకు క్రమంగా దూరమవుతున్నారనే అసంతృప్తి ఓటర్లలో గట్టిగా వ్యక్తమవుతోంది.

మరోవైపు పార్టీలోని అంతర్గత విభేదాలు కొండా సురేఖ ఇమేజ్ను మరింత దారుణంగా దెబ్బతీస్తున్నాయి. జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో ఆమెకు ఉన్న రాజకీయ వైరం పార్టీని ఇరకాటంలోకి నెట్టేసింది. జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చరిష్మా, ఆయన వ్యూహాల ముందు సురేఖ రాజకీయం ఏమాత్రం ముందుకు సాగడం లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. ఈ గందరగోళానికి తోడు, ఆమె భర్త కొండా మురళి వ్యవహార శైలి కూడా పార్టీకి పెద్ద మైనస్‌గా మారుతోంది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేతో కొండా మురళికి మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరు ఏకంగా రచ్చకెక్కి, స్వపక్ష నేతలే వీధుల్లో గొడవలకు దిగుతుండటం పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ప్రజల సమస్యలను పక్కనపెట్టి నేతలు ఇలా వీధి పోరాటాలకు దిగడం పట్ల స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఇలా కాంగ్రెస్‌లోని అంతర్గత కుమ్ములాటలు, పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను భారతీయ జనతా పార్టీ తనకు అనుకూలంగా మలచుకుంటోంది. ఈ పరిణామాల మధ్య బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ కుమార్ రావు నియోజకవర్గంలో చాప కింద నీరులా తన బలాన్ని అమాంతం పెంచుకుంటున్నారు. గత ఎన్నికల్లో కేవలం 15 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన ప్రదీప్ రావు, ఆ ఓటమిని సవాలుగా తీసుకుని నిరంతరం ప్రజల్లోనే ఉంటూ కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులను, ప్రజల నాడిని బేరీజు వేసుకుంటే.. రాబోయే ఎన్నికల్లో కొండా సురేఖ మళ్లీ బరిలోకి దిగితే సొంత పార్టీ నేతల అసమ్మతి, ప్రజా వ్యతిరేకత వల్ల పరాజయం చవిచూడటం ఖాయంగా కనిపిస్తోంది. నియోజకవర్గంలో వీస్తున్న గాలిని బట్టి చూస్తే, గత ఎన్నికల లెక్కలు తలకిందులై, ఈసారి ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఏకంగా 25 వేల పైచిలుకు ఓట్ల భారీ మెజారిటీతో విజయభేరి మోగించడం తథ్యమని స్థానిక రాజకీయ విశ్లేషకులు ఘంటాపథంగా చెబుతున్నారు.


