మిషన్ తెలంగాణ! కాంగ్రెస్ వైఫల్యాలు, బీఆర్ఎస్ పతనం.. తెలంగాణలో కమలం వికసించేనా?
బండి సంజయ్ నాయకత్వం కోసం ఎదురుచూస్తున్న క్యాడర్ – వణుకుతున్న ప్రత్యర్థులు!
–గ్రౌండ్ రిపోర్ట్ ఫ్రం శిరీష జర్నలిస్ట్..
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం శరవేగంగా మారుతోంది. వచ్చే ఎన్నికల్లో అధికార పీఠమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం పకడ్బందీ వ్యూహరచన చేస్తోంది. ఇటీవల కాలంలో బీజేపీ జాతీయ నాయకులు, పార్టీ వ్యూహకర్త నితిన్ నబి రాష్ట్రంలో వరుస పర్యటనలు చేయడం వెనుక అతిపెద్ద రాజకీయ ఆంతర్యం దాగి ఉంది. కేవలం నాయకులను కలవడం మాత్రమే కాదు, క్షేత్రస్థాయిలో పార్టీని ఎన్నికల రణరంగానికి సమాయత్తం చేయడమే ఢిల్లీ పెద్దల అసలు లక్ష్యంగా కనిపిస్తోంది.
యోధులున్నారు.. కానీ సమన్వయమేదీ?

తెలంగాణలో బీజేపీకి ఉన్న బలమైన నాయకత్వం మరే పార్టీకి లేదు. ఎనిమిది మంది ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు, ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ లాంటి నాయకులతో పార్టీ క్యాడర్ ఎప్పుడూ ఉత్సాహంగానే ఉంటుంది. ముఖ్యంగా బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు లాంటి నాయకులు కేవలం ప్రసంగాలకే పరిమితం కాకుండా, ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించగల అగ్రెసివ్ యోధులు.
అయితే, ఇంతటి బలమైన నాయకత్వం ఉన్నప్పటికీ పార్టీలో ‘ఈగో వార్స్’ నడుస్తున్నాయనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. కానీ, గ్రౌండ్ రియాలిటీ అందుకు పూర్తి భిన్నంగా ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ అసలైన, ఏకైక రాజకీయ శత్రువుగా బీజేపీనే పరిగణిస్తున్నాయి. కమల దళం బలపడితే తమ ఉనికి గల్లంతవుతుందనే భయం ఆ రెండు పార్టీల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంటున్న కాంగ్రెస్

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎలా జతెలంగాణ ప్రజల నాడి పసిగట్టడం అంత సులువు కాదు. ఆరు దశాబ్దాల పాటు పోరాడి రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేతనే నిర్దాక్షిణ్యంగా ఫామ్ హౌస్‌కు పరిమితం చేసిన చరిత్ర తెలంగాణ ఓటర్లది. అలాంటి ప్రజల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అసాధ్యమైన హామీలు ఇప్పుడు ఆ పార్టీకే ఉరితాడుగా మారుతున్నాయి.
100 రోజుల్లో అద్భుతాలు చేస్తామని అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ, ఇప్పుడు ప్రజలకు మొండిచేయి చూపుతోంది:
- హైడ్రా పేరుతో విధ్వంసం: అక్రమాల కూల్చివేతల పేరుతో సామాన్యులను, పేదలను భయభ్రాంతులకు గురిచేస్తూ ప్రజల కన్నీటి ఉసురు పోసుకుంటోంది.
- రైతాంగానికి ద్రోహం: గిట్టుబాటు ధరల ఊసే లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన రైతుబంధును కూడా సక్రమంగా అమలు చేయలేకపోతున్నారు. ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘రెండు లక్షల రుణమాఫీ’ సగంలోనే ఆగిపోయి రైతులను రోడ్డున పడేసింది.
- మహిళలు, వృద్ధులకు దగా: పెన్షన్లు పెంచుతామని ఆశపెట్టి ఇప్పుడు నిధులు లేవని దాటవేస్తున్నారు.
- కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం: ఎన్నికల ముందు ఊదరగొట్టిన ఈ హామీ, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు కనీసం గుర్తుకూడా లేదు.
- విద్యార్థినులకు స్కూటీలు: ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్న నాయకులు, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు.
- బడుగు, బలహీన వర్గాలకు మోసం: బీసీ రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి విస్మరించారు. దళిత బంధుకు అదనంగా మరో ఐదు లక్షలు కలిపి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అమలు చేస్తామని ఆశపెట్టి దళితుల ఓట్లు దండుకున్నారు. ఇప్పుడు ఆ వర్గాలన్నీ రగిలిపోతున్నాయి.
తెలంగాణ సాధన కోసం సకల జనులు ఎలాగైతే ఏకమయ్యారో, రేపు కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి కూడా ఇదే తరహాలో అన్ని వర్గాలూ ఏకమవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
కుటుంబ రాజకీయాలతో చతికిలబడ్డ బీఆర్ఎస్
మరోవైపు పదేళ్లు రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్ పూర్తిగా పతనావస్థకు చేరుకుంది. కేటీఆర్, హరీష్ రావు, అప్పుడప్పుడు కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి సభలు పెడుతూ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, జనాలు ఆ కుటుంబ పాలనను, వారి మాటలను నమ్మే స్థితిలో లేరు. ఈ శూన్యాన్ని భర్తీ చేస్తూ, తెలంగాణకు అసలైన ప్రత్యామ్నాయ శక్తిగా భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజల ముందు నిలబడుతోంది.
గల్లీ నుంచి సిటీ వరకు.. చాప కింద నీరులా కాషాయ దళం
క్షేత్రస్థాయిలో బీజేపీ క్యాడర్ ఊహించని స్థాయిలో బలపడింది. బూత్ స్థాయి కమిటీలు చురుకుగా పనిచేస్తున్నాయి. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకోవడం, కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని అధిరోహించడం పార్టీ విస్తరణకు నిదర్శనం. నిజామాబాద్ లాంటి చోట్ల అధికార పార్టీల కుటిల రాజకీయాల వల్లే మేయర్ పీఠాన్ని తృటిలో చేజార్చుకున్నప్పటికీ, వారి పోరాట పటిమను తక్కువ అంచనా వేయలేం. తెలంగాణ వ్యాప్తంగా కాషాయ రంగు చాప కింద నీరులా కాదు, ఏకంగా ఒక సునామీలా విస్తరిస్తోంది.

జీహెచ్ఎంసీ, వరంగల్ కార్పొరేషన్లు.. బండి సంజయ్ మాస్ వార్నింగ్
అధికారంలోకి రావాలంటే పట్టణ ప్రాంతాలపై పట్టు సాధించడం కీలకం. ఇప్పుడు బీజేపీ టార్గెట్ గ్రేటర్ హైదరాబాద్ (GHMC), గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలే. నితిన్ నబి సమక్షంలో నిన్న జరిగిన సభలో బండి సంజయ్ చేసిన ప్రసంగం పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది.
“వరంగల్ కార్పొరేషన్ వర్సెస్ హైదరాబాద్ కార్పొరేషన్.. ఎవరికి ఎంత దమ్ముందో తేల్చుకుందాం రా..!” అంటూ ఆయన విసిరిన సవాల్ ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. “మనకు గ్రామాల్లో బలమైన క్యాడర్ ఉంది.. వాళ్లకు శిక్షణ ఇచ్చి నాయకులుగా తీర్చిదిద్దుతాం” అని బండి సంజయ్ చేసిన ప్రకటన బీజేపీ భవిష్యత్ వ్యూహానికి అద్దం పడుతోంది.
ప్రధాని సభలో బండికే బ్రహ్మరథం.. సీఎం అభ్యర్థి ఆయనేనా?
నాయకుడికి జనాదరణ ఉంటే క్యాడర్ ఎలా రియాక్ట్ అవుతుందో మొన్న హైదరాబాద్‌లో జరిగిన ప్రధాని నరేంద్ర మోడీ సభ స్పష్టం చేసింది. మోడీ సభకు బండి సంజయ్ రాగానే క్యాడర్ చూపించిన జోష్, ఇచ్చిన స్వాగతం చూస్తే.. తెలంగాణ భవిష్యత్ సీఎం ఆయనే అన్నంతగా వాతావరణం మార్మోగిపోయింది.
అధ్యక్ష పదవి బండి సంజయ్‌కి ఇస్తేనే..!
అధికార రాజకీయాల్లో ఎత్తుగడలు సాధారణమే. కానీ బీజేపీకి ఉన్న అతిపెద్ద బలం దాని కార్యకర్తలు. ధర్మం కోసం, దేశం కోసం, హిందుత్వ సిద్ధాంతం కోసం దశాబ్దాలుగా ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న నిస్వార్థ సైనికులు వారు. “మా తాత చెప్పారు బీజేపీ అధికారంలోకి వస్తుందని, మా నాన్న చెప్పారు వస్తుందని.. కానీ ఈసారి కచ్చితంగా రామరాజ్యం వస్తుంది” అనే ప్రగాఢ విశ్వాసంతో వారు అహర్నిశలు శ్రమిస్తున్నారు.
కానీ, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీలోని కొందరు నాయకుల ఈగో వార్స్, తప్పుడు రిపోర్టుల వల్లే అధిష్టానం బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే.. బండి సంజయ్‌ను ఆరోజు తప్పించడం వల్లే బీజేపీ అధికారంలోకి రాలేకపోయింది, ఆ ఒక్క తప్పు వల్లే ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగలిగారు. ఇది తెలంగాణలో ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా సామాన్యులు చెప్పే నిజం!
కార్యకర్తల మనోభావాలను, క్షేత్రస్థాయి వాస్తవాలను బీజేపీ హైకమాండ్ గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. వ్యక్తుల మధ్య ఈగోలను పక్కనబెట్టి, క్యాడర్‌కు గౌరవం దక్కాలంటే.. ఫైర్ బ్రాండ్ నాయకుడు బండి సంజయ్ కుమార్‌కు రాబోయే ఎన్నికల వరకు రాష్ట్ర అధ్యక్షుడిగా పూర్తి బాధ్యతలు అప్పగించాలి. అదే జరిగితే తెలంగాణలో బీజేపీ విజయాన్ని ఏ శక్తీ ఆపలేదని పొలిటికల్ అనలిస్టులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.
మరి ఢిల్లీ పెద్దలు గ్రౌండ్ రియాలిటీని గ్రహించి ఆ దిశగా అడుగులు వేస్తారా? బండి సంజయ్‌కు పగ్గాలు అప్పగిస్తారా? కాలమే సమాధానం చెప్పాలి!


