అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ లెక్కలు ఒకలా ఉంటాయి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి. మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విషయంలో ఇప్పుడు సరిగ్గా ఇదే జరుగుతోంది. ఇటీవల అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలతో జరిగిన ఆసక్తికర సంభాషణ అందరికీ గుర్తుండే ఉంటుంది. సీఎల్పీ నేతగా ఉన్న భట్టి విక్రమార్కకు అండగా నిలవాల్సిన సమయంలో, ఆయనను కాదని అధికారంలో ఉన్న బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) వైపు సబితమ్మ అడుగులు వేశారనే విమర్శలు స్వయంగా ముఖ్యమంత్రి స్థాయి నుంచే వచ్చాయి. అధికారం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోకి ఆమె జంప్ అవుతారనే ఒక బలమైన నరేటివ్ ను అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ క్రియేట్ చేసింది.

కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ లో చేరకుండా ప్రతిపక్షానికే పరిమితం అయ్యారు. దీనికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి సీట్లో తనకంటే జూనియర్ అయిన రేవంత్ రెడ్డి ఉండటం ఒకటైతే, భవిష్యత్ రాజకీయ పరిణామాలపై ఆమె వేసుకున్న పక్కా అంచనా మరొకటి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో ఎదురయ్యే ఆచరణాత్మక ఇబ్బందులు, ప్రభుత్వంపై ప్రజల్లో రాబోయే వ్యతిరేకతను ఆమె ముందే పసిగట్టారు. కాంగ్రెస్ స్కీమ్స్ ఫెయిల్యూర్ అయితే ఆ నెగెటివిటీ, ఆ సెగ తనకు తగలకూడదనే ఉద్దేశంతోనే ఆమె హస్తం పార్టీ వైపు చూడలేదనే వాదన రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ పై ప్రజా వ్యతిరేకత వస్తే, దాన్ని తనకు అనుకూలంగా మలచుకోవచ్చని ఆమె భావిస్తున్నారు.

అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ దాగి ఉంది. సబితా ఇంద్రారెడ్డికి అధికార పార్టీలో ఉంటూ గెలుపు రుచి చూసిన ట్రాక్ రికార్డ్ ఎక్కువ. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉంటూ పనులు చేయించుకోగల నేర్పు ఆమె సొంతం. కానీ ఈసారి ఆమె అధికార పార్టీలో లేదు. ఒక ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయడం, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం అధికారంలో లేనప్పుడు కత్తిమీద సామే. ఈ పరిణామాలు జనాల్లో ఆమె ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తాయా? ప్రతిపక్షంలో ఉండటం వల్ల నిధులు రాక పనులు ఆగిపోతే అది సబితమ్మ చరిష్మా తగ్గిపోవడానికి దారి తీస్తుందా? అని ప్రజలు ఆలోచించే పరిస్థితి ఉంది. పాలిటిక్స్ లో సీనియర్ అయిన ఆమెకు ఈ ప్రతికూలతలను ఎదుర్కోవడం ఒక పెద్ద సవాలే.

మరోవైపు ముందున్న ఎన్నికలు సబితమ్మకు అంత ఈజీ కాదు. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ గట్టి పోటీ ఇచ్చారు. దాదాపు ఇరవై ఆరు వేల పైచిలుకు మెజారిటీతో సబిత గెలిచినప్పటికీ, ఇప్పుడు మహేశ్వరంలో కమలం పార్టీ గ్రాఫ్ అమాంతం పెరుగుతోంది. అందెల శ్రీరాములు యాదవ్ తో పాటు, ఆకుల శ్రీవాణి లాంటి నేతలు కూడా నియోజకవర్గంలో యాక్టివ్ గా తిరుగుతూ ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతున్నారు. గ్రౌండ్ లెవెల్ లో ఈ దూకుడు ఇలాగే కొనసాగితే రాబోయే ఎన్నికల్లో మెజారిటీలు తారుమారయ్యే ప్రమాదం ఉంది. ఒకవేళ కాదని సబితమ్మ గెలిచినా, గెలుపు మార్జిన్ కేవలం మూడు, నాలుగు వేలకు పడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక్కడ బీజేపీ చేయాల్సిన ప్రధాన వ్యూహం ఒకటే.. అధికార కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూనే, నిధులు తీసుకురాలేక స్థానిక ఎమ్మెల్యేగా సబితమ్మ ఎలా విఫలమయ్యారో జనాల్లోకి బలంగా తీసుకువెళ్లడం.

ఇక కాంగ్రెస్ పార్టీ వ్యూహం మరోలా ఉండబోతోంది. మహేశ్వరంపై పట్టు సాధించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సరికొత్త ఎత్తుగడలు వేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఇప్పుడు ‘హైడ్రా’ (HYDRA) పేరు ప్రకంపనలు సృష్టిస్తోంది. చెరువుల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో ఒకవైపు భరోసా, మరోవైపు రాజకీయ నాయకుల్లో వణుకు పుట్టిస్తోంది. హైడ్రా యాక్షన్స్ ను సాకుగా చూపి ప్రతిపక్ష నేతలను, వారి అనుచరులను ఆత్మరక్షణలో పడేసే వ్యూహాన్ని అధికార పార్టీ పదును పెడుతోంది. జనాల నాడి పట్టాలంటే కాంగ్రెస్ కేవలం హైడ్రా కూల్చివేతలకు పరిమితం కాకుండా, ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నచోట నిధులు మంజూరు చేసి, తమ పార్టీ క్యాడర్ ద్వారా ఆ పనులు ప్రజల ముందుకు తీసుకెళ్లాలి.
మొత్తంగా చూస్తే ఇప్పుడు మహేశ్వరంలో ఆసక్తికరమైన రాజకీయ క్రీడ నడుస్తోంది. కాంగ్రెస్ లో చేరకుండా ప్రతిపక్షంలోనే ఉండి ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతూ సింపతీ పొందాలని సబితమ్మ భావిస్తుంటే, అధికార బలంతో పాటు ‘హైడ్రా’ లాంటి అస్త్రాలతో విపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేయాలని కాంగ్రెస్ చూస్తోంది. ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరును తమకు అనుకూలంగా మార్చుకుని, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలపై పోరాడుతూ పాగా వేయాలని బీజేపీ పావులు కదుపుతోంది. ఈ మారుతున్న సమీకరణాల్లో జనాల నాడి పట్టి విజయం సాధించేది ఎవరో కాలమే నిర్ణయించాలి.


