తెలంగాణ కమల దళంలో నయా జోష్: ఏకతాటిపై బండి, ఈటల.. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్లకు వణుకే!
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న భారతీయ జనతా పార్టీ (BJP) వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న ప్రస్తుత తరుణంలో, తెలంగాణ బీజేపీ అనూహ్యంగా పుంజుకుంటోంది. పార్టీ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం నింపుతూ.. పార్టీలోని ఇద్దరు కీలక ప్రజాదరణ కలిగిన నాయకులు, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ మధ్య ఉన్న చిన్నపాటి భేదాభిప్రాయాలకు పార్టీ అధిష్టానం శాశ్వత ముగింపు పలికింది. వీరిద్దరూ ఏకతాటిపైకి రావడంతో అధికార కాంగ్రెస్, ఉనికి కోసం ఆరాటపడుతున్న బీఆర్ఎస్ (BRS) శిబిరాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.
కలిసికట్టుగా కమలనాథులు.. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి అభయ్ పాటిల్ ఆధ్వర్యంలో, సీనియర్ నేత ఎంపీ డాక్టర్ కే. లక్ష్మణ్ నివాసంలో జరిగిన కీలక సమావేశంలో బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య సయోధ్య కుదిరింది. ఓ వైపు హిందూత్వ అజెండాతో యువతలో, ప్రజల్లో ఫైర్ బ్రాండ్ లీడర్‌గా చెరగని ముద్ర వేసిన బండి సంజయ్, మరోవైపు సుదీర్ఘ రాజకీయ అనుభవం, బీసీ వర్గాల్లో బలమైన పట్టున్న ఈటల రాజేందర్.. ఇద్దరూ చేతులు కలపడం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. “మా మధ్య ఎలాంటి విబేధాలు లేవు. మా అంతిమ లక్ష్యం తెలంగాణలో రామరాజ్యం స్థాపించడమే, పేదల సంక్షేమమే” అని వీరిద్దరూ స్పష్టం చేయడం కింది స్థాయి కార్యకర్తల్లో నయా జోష్ నింపింది.
కాంగ్రెస్ అరాచక పాలనపై అసహనం.. సమావేశం అనంతరం బీజేపీ నేతలు అధికార కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కాని మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిందని, తీరా అధికారంలోకి వచ్చాక ప్రజలను నట్టేట ముంచిందని ఎంపీ లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ప్రభుత్వ నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి తెలంగాణలో దాపురించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం నెలల వ్యవధిలోనే కాంగ్రెస్ అసలు రంగు బయటపడిందని, ప్రజలు ఈ అవినీతి, అసమర్థ పాలనతో విసిగిపోయారని జర్నలిస్టులు, విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
కనుమరుగవుతున్న బీఆర్ఎస్.. ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీనే! ఇక పదేళ్ల పాటు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, కుటుంబ పాలనతో తెలంగాణను దోచుకున్న బీఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లింది. గడిచిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతోనే కేసీఆర్ పార్టీని తెలంగాణ సమాజం శాశ్వతంగా పాతాళానికి తొక్కింది. అవినీతి, అహంకార రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన గులాబీ పార్టీకి ఇక తెలంగాణలో భవిష్యత్తు శూన్యం. బీఆర్ఎస్ను నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరు.
ఈ రాజకీయ శూన్యతను పూరిస్తూ, కాంగ్రెస్ వైఫల్యాలపై నిరంతరం పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి, దేశభక్తి ఎజెండాకు తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బండి సంజయ్ దూకుడు, ఈటల రాజేందర్ వ్యూహచతురత, కిషన్ రెడ్డి అనుభవం, లక్ష్మణ్ మార్గదర్శకత్వంలో తెలంగాణ కమలదళం అజేయ శక్తిగా ఆవిర్భవించింది.
“సింహాలు రెండు కలిస్తే వేట ఎలా ఉంటుందో భవిష్యత్తులో చూస్తారు” అన్నట్లుగా తెలంగాణ బీజేపీ భవిష్యత్ కార్యాచరణ ఉండబోతోంది. ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించి, కుటుంబ పార్టీ బీఆర్ఎస్ను పూర్తిగా బొందపెట్టి.. కాషాయ జెండాను గోల్కొండ కోటపై ఎగురవేయడమే లక్ష్యంగా బీజేపీ సమరశంఖం పూరించింది. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికలు, ఆపై వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం తథ్యం అని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.


