ఎమ్మెల్సీ తాతా మధుపై అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదు: మైనారిటీ నేత ఎండి. అన్వర్ ఖాన్
ఖమ్మం: ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌పై కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న అసత్య ప్రచారాలు, వ్యక్తిగత విమర్శలను సహించేది లేదని మైనారిటీ జిల్లా నాయకులు ఎండి. అన్వర్ ఖాన్ హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిత్వ హననానికి దిగడం ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధమని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ప్రజా నాయకుడు తాతా మధు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజలతో మమేకమై, నిరంతరం వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న నాయకుడు తాతా మధుసూదన్ అని అన్వర్ ఖాన్ కొనియాడారు. కుల, మతాలకు అతీతంగా ప్రతి వర్గాన్ని, ప్రతి కార్యకర్తను సమానంగా ఆదరించే గొప్ప వ్యక్తిత్వం ఆయనదని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో అహర్నిశలు శ్రమిస్తూ, కార్యకర్తలకు అండగా ఉంటున్న ఆయనపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
దమ్ముంటే సమస్యలపై చర్చించండి.. రాజకీయంగా తాతా మధును ఎదుర్కొనే ధైర్యం లేకనే కొందరు ఇలాంటి దిగజారుడు విమర్శలకు దిగుతున్నారని, ఇది వారి బలహీనతకు నిదర్శనమని అన్వర్ ఖాన్ విమర్శించారు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు సహజమేనని, దమ్ముంటే ఆధారాలతో ప్రజా సమస్యలపై చర్చకు రావాలని సవాల్ విసిరారు.
చట్టబద్ధంగా ఎదుర్కొంటాం.. ఎమ్మెల్సీపై వ్యక్తిగత దూషణలు, అసత్య ప్రచారాలు తక్షణం మానుకోవాలని, లేనిపక్షంలో ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టపరంగా గట్టి సమాధానం చెబుతామని అన్వర్ ఖాన్ హెచ్చరించారు. ఖమ్మం ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని, తప్పుడు ప్రచారాలు చేసే వారికి ప్రజలే తగిన తీర్పు ఇస్తారని ఆయన తేల్చిచెప్పారు.


