వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 18 మంది భారతీయుల దుర్మరణం!
మృతుల్లో ఏపీ, తెలంగాణ వాసులు.. సెల్ ఫోన్ కంపెనీ టూర్లో తీవ్ర విషాదం
వియత్నాంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. విహారయాత్ర కోసం వెళ్లిన భారతీయుల పడవ ప్రమాదానికి గురై ఏకంగా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మరియు తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లు సమాచారం.
ఓ ప్రముఖ సెల్ ఫోన్ కంపెనీ తమ వ్యాపార భాగస్వాముల కోసం ఈ వియత్నాం విహారయాత్రను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే వారందరినీ టూర్‌కు తీసుకెళ్లారు. అయితే, వియత్నాంలోని ఫు క్వాక్ దీవి సమీపంలో వీరు ప్రయాణిస్తున్న పడవ ప్రతికూల పరిస్థితుల కారణంగా ఒక్కసారిగా బోల్తా పడటంతో ఈ ఘోర దుర్ఘటన జరిగింది. ప్రమాద సమయంలో పడవలో మొత్తం 32 మందికి పైగా భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన వియత్నాం కోస్ట్‌గార్డ్, స్థానిక విపత్తు నిర్వహణ బృందాలు గాలింపు మరియు సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనపై వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సోషల్ మీడియా వేదికగా ప్రమాదాన్ని ధృవీకరించిన ఎంబసీ, సహాయక చర్యల కోసం స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు స్పష్టం చేసింది.
బాధితుల సమాచారం కోసం భారత విదేశాంగ శాఖ, ఎంబసీ అధికారులు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. మృతుల పూర్తి వివరాలు, వారి స్వస్థలాలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు. ఉత్సాహంగా విహారయాత్రకు వెళ్లి విగతజీవులుగా మారడంతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.

వియత్నాంలో బోల్తా పడిన బోటులో ప్రయాణించిన 32 మంది ప్రయాణికుల జాబితాను విడుదల చేసిన భారత రాయబార కార్యాలయం.


