ప్రధాని మోదీపై మార్ఫింగ్ వీడియోలు.. మెటా ఇండియా హెడ్‌పై హైదరాబాద్ పోలీసుల కేసు
సోషల్ మీడియాలో స్వేచ్ఛ పేరుతో హద్దులు దాటుతున్న వారికి, ఫేక్ కంటెంట్‌ను అడ్డుకోలేకపోతున్న ప్లాట్‌ఫామ్స్‌కు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని, ఆయన ప్రతిష్ఠను దిగజార్చేలా నెట్టింట వైరల్ అవుతున్న అసభ్యకర, మార్ఫింగ్ వీడియోలపై పోలీసులు కన్నెర్రజేశారు. ఈ వ్యవహారంలో ఏకంగా మెటా (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ) ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్‌తో పాటు పలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లపై కేసులు నమోదు చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

అసలు ఈ కేసుకు దారితీసిన పరిస్థితులు చూస్తే.. ఇద్దరు నెటిజన్లు ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రౌజ్ చేస్తుండగా ప్రధాని మోదీకి సంబంధించిన కొన్ని డిజిటల్ మార్ఫింగ్ వీడియోలు వారి కంటపడ్డాయి. అందులో వాడిన అసభ్యకరమైన భాష, కావాలనే ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్న ఆ కంటెంట్‌ను చూసి వారు వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన దర్యాప్తు అధికారులు.. ఆ వివాదాస్పద కంటెంట్ ఎక్కడినుంచి పుట్టుకొచ్చింది? దాన్ని సృష్టించి ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్న తెరవెనుక వ్యక్తులు ఎవరు? అనే వివరాలను సేకరించే పనిని ముమ్మరం చేశారు.
అయితే, ప్రధానిపై సోషల్ మీడియాలో ఇలాంటి విషప్రచారం జరగడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన ఆందోళనల సమయంలోనూ మోదీపై ఇలాంటి అసభ్యకర పోస్టులు వెల్లువెత్తాయి. దీనికితోడు, గతంలో స్వయంగా ప్రధాని ఖాతా నుంచి పోస్ట్ అయిన ఒక వీడియోను ఫేస్బుక్ కొద్దికాలం పాటు నిలిపివేయడం అప్పట్లో కేంద్ర ప్రభుత్వానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఆ వ్యవహారంపై మెటా సంస్థ వివరణ ఇచ్చి, ప్రముఖుల ఖాతాలకు అదనపు పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చింది. అయినా సరే మళ్లీ ఇలాంటి మార్ఫింగ్ కంటెంట్ ఇట్టే వైరల్ కావడం ఆ సంస్థ భద్రతా వైఫల్యాన్ని ఎత్తిచూపుతుండటంతో.. పోలీసుల కఠిన చర్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


