దేశం లో పాల ఉత్పత్తి 14 కోట్ల లీటర్లు…తాగేది మాత్రం 64 కోట్లా..?ఈ యాభై కోట్ల లీటర్ల విషం ఎక్కడి నుండి వస్తుంది?
దేశంలో పాల ఉత్పత్తి కేవలం 14 కోట్ల లీటర్లు మాత్రమే అయితే,ప్రజల రోజువారీ వినియోగం మాత్రం ఏకంగా 64 కోట్ల లీటర్లకు చేరుకుంది. మార్కెట్లోకి అదనంగా వస్తున్న ఆ 50 కోట్ల లీటర్ల పాలు ఎక్కడినుంచి వస్తున్నాయి? ప్రతిరోజూ ఉదయాన్నే ఆరోగ్యానికి ఎంతో మంచిదని మనం తాగే పాలు.. ఇప్పుడు మన పాలిట మృత్యుపాశంగా మారుతున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న పాల కల్తీ వ్యవహారం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. స్వార్థపూరిత కల్తీ వ్యాపారుల పుణ్యమా అని భారతదేశం పాలు కాదు, నిప్పుల్లాంటి విషాన్ని తాగుతోందని ఈ గణాంకాలు బల్లగుద్ది చెబుతున్నాయి.
ఈ అంతరాన్ని పూడ్చడానికి కల్తీ వ్యాపారులు సృష్టిస్తున్న విషమే ఈ సింథటిక్ పాలు. దీనిపై వస్తున్న నివేదికలు చూస్తుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది.
“భారతదేశం పాలు కాదు, విషం తాగుతోంది; కల్తీని అరికట్టకపోతే, 2035 నాటికి 87 శాతం మంది భారతీయులకు క్యాన్సర్ వస్తుంది.”
లాభాలే ధ్యేయంగా అడ్డదారుల్లో డిటర్జెంట్లు, యూరియా, ప్రమాదకరమైన రసాయనాలతో తయారవుతున్న ఈ పాలు.. పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి రోగనిరోధక వ్యవస్థను నాశనం చేస్తూ, ఆరోగ్యాన్ని పునాదులతో సహా కూల్చేస్తున్నాయి.
ఒకప్పుడు మన పల్లెల్లో ఎటు చూసినా వేల సంఖ్యలో పాడి పశువులు ఉండేవి. ఎవరికి కావాల్సిన పాలు వాళ్ల ఇంట్లోనే ఉండేవి. అసలు పాలు, నెయ్యి లాంటివి బయట కొనుక్కోవాలనే ఆలోచనే అప్పట్లో ఎవరికీ ఉండేది కాదు. ఆ తర్వాత పరిస్థితులు మారి పాలు కొనడం మొదలుపెట్టాక.. పాల వ్యాపారులు ఇంటింటికీ వెళ్లి గిన్నెల్లో, సీసాల్లో పాలు పోసేవారు. కళ్ల ముందే స్వచ్ఛమైన పాలు పోయించుకుని తాగిన రోజులు అవి.
కానీ, ఎప్పుడైతే మనం ప్లాస్టిక్ ప్యాకెట్లలో పాలు కొనడం మొదలుపెట్టామో.. అప్పటినుంచి పాల మీద వచ్చే ‘మీగడ’ పూర్తిగా మాయమైపోయింది. కొత్తలో ప్యాకెట్ పాలు కాచినప్పుడు మీగడ రాకపోవడాన్ని చూసి జనాలు తీవ్రంగా అనుమానం వ్యక్తం చేశారు. కానీ, రానురాను అదే ప్యాకెట్ పాలకే పూర్తిగా అలవాటు పడిపోయారు. ఇప్పుడు తాము తాగుతున్నది ఒరిజినల్ పాలా లేక కల్తీ పాలా అని కనీసం ఆలోచించడం కూడా మానేశారు. ప్రజల ఈ నిర్లక్ష్యమే కల్తీ మాఫియాకు వరంగా మారింది. స్వచ్ఛమైన పాలు దొరక్కపోవడం, రసాయనాలతో కూడిన కల్తీ పాలు తాగడం వల్లే నేడు ప్రజల్లో వ్యాధులు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా మనుషుల ఎముకల్లో బలం పూర్తిగా లేకుండా పోయింది.
అసలు రాను రాను పశు సంపద ఎందుకు మాయమవుతోంది? దీనికి ప్రధాన కారణం పట్టణీకరణ పెరగడం, పశువులు మేసే బీడు భూములు కాంక్రీట్ జంగిల్స్‌గా మారిపోవడం. పశువుల పోషణ భారం కావడంతో రైతులు పాడి పరిశ్రమకు దూరమవుతున్నారు. ఇదే అదనుగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ప్రమాణాలకు ఏమాత్రం పొంతన లేని 68.7 శాతం కల్తీ పాలు దేశంలో యథేచ్ఛగా అమ్ముడవుతున్నాయని పశు సంక్షేమ బోర్డు సభ్యుడు మోహన్ సింగ్ అహ్లువాలియా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ కల్తీ మాఫియా నుంచి ప్రజల ప్రాణాలను కాపాడటానికి పశు సంపదను సమృద్ధిగా పెంచుకోవడం ఒక్కటే మార్గం. ప్రభుత్వం కేవలం ‘ఆవులను చంపవద్దు’ అని చట్టాలు చేయడమే కాకుండా, వాటి పెంపకానికి అనువైన వాతావరణం కల్పించాలి:
పశువులు మేయడానికి ప్రతి గ్రామంలో ప్రత్యేకంగా ప్రభుత్వ భూములను కేటాయించి పరిరక్షించాలి.
పాడి రైతులకు వడ్డీ లేని రుణాలు, సబ్సిడీపై పశుగ్రాసం కల్పించాలి.
పాలకు సరైన గిట్టుబాటు ధరను ప్రభుత్వమే నిర్ణయించి రైతులకు నేరుగా అందేలా చూడాలి.
దేశవ్యాప్తంగా ఉన్న గోశాలలకు ప్రభుత్వం తగినంత ఆర్థిక సాయం అందించాలి.
అయితే, ప్రభుత్వ చట్టాలు వచ్చి పరిస్థితులు మారే వరకు మన ప్రాణాలను పణంగా పెట్టాల్సిన అవసరం లేదు. ఈ కల్తీ పాల మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి మన వంటగదిలోనే ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం ఉంది.. అదే ‘నువ్వులు’. రసాయనాలతో నిండిన కల్తీ పాలు తాగి క్యాన్సర్ లాంటి ప్రాణాంతక రోగాల బారిన పడేకంటే, రోజువారీ ఆహారంలో పాలకు బదులుగా నువ్వులను వాడటం వంద రెట్లు ఉత్తమం. వాస్తవానికి మనం తాగే పాలలో కంటే నువ్వుల్లోనే కాల్షియం, ఐరన్, ప్రొటీన్లు అత్యంత పుష్కలంగా ఉంటాయి. ఎముకలకు బలాన్నిచ్చే ఈ నువ్వులను ప్రత్యామ్నాయంగా తీసుకోవడమే మన భవిష్యత్తుకు అసలైన శ్రీరామ రక్ష.


