సేవా ముసుగులో విదేశీ నిధులు.. 13 సంస్థలపై కేంద్రం కొరడా!
భారతదేశంలో స్వచ్ఛంద సంస్థలు (NGOs) అంటే ఒకప్పుడు నిస్వార్థ సేవకు మారుపేరు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి, పేదరిక నిర్మూలన, విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ వంటి ఉన్నత ఆశయాలతో ప్రారంభమైన ఈ సంస్థలకు విదేశాల నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తుంటాయి. అయితే, కాలక్రమంలో ఈ ‘విదేశీ విరాళాల’ స్వరూపం, ఉద్దేశం మారుతూ వస్తోంది. సామాజిక సేవా ముసుగులో వస్తున్న ఈ విదేశీ డాలర్లు.. దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి, మత మార్పిడులను ప్రోత్సహించడానికి, ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయడానికి, చివరకు దేశ ఆర్థికాభివృద్ధికి కీలకమైన ప్రాజెక్టులను అడ్డుకోవడానికి వాడుతున్నారనే తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఫారిన్ కాంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) యాక్ట్ – FCRA కింద విదేశీ నిధుల రాక, పోకలపై ఉక్కుపాదం మోపుతోంది. విదేశాల నుంచి వచ్చే డబ్బును నిషేధించడం ప్రభుత్వ ఉద్దేశం కాదు; ఆ నిధులు ఏ సంస్థకు వస్తున్నాయి? ఎంత వస్తున్నాయి? దేనికోసం ఖర్చు చేస్తున్నారు? అన్న పారదర్శకతను తీసుకురావడమే ఎఫ్సీఆర్ఏ ప్రధాన లక్ష్యం. కానీ, నిబంధనలను బేఖాతరు చేస్తూ, దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించాయన్న పక్కా ఆధారాలతో కేంద్ర హోంశాఖ, సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ వంటి దర్యాప్తు సంస్థల రాడార్‌లో చిక్కుకుని తమ లైసెన్సులను కోల్పోయిన 13 కీలక సంస్థల తెరవెనుక కథను ఇప్పుడు లోతుగా విశ్లేషిద్దాం.
- సతత్ సంపద ప్రైవేట్ లిమిటెడ్ (Satat Sampada Pvt Ltd) పర్యావరణం, క్లైమేట్ చేంజ్, సస్టైనబిలిటీ వంటి ఆకర్షణీయమైన పదాలతో పనిచేస్తున్న సంస్థగా ఇది రిజిస్టర్ అయింది. అయితే, తెరవెనుక జరిగిన ఆర్థిక లావాదేవీలు విచారణ సంస్థల దృష్టిని ఆకర్షించాయి. విదేశీ సంస్థల నుంచి వచ్చిన నిధులను ఈ సంస్థ కన్సల్టెన్సీ చార్జీల రూపంలో స్వీకరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. కేవలం పర్యావరణ కార్యక్రమాలకే పరిమితం కాకుండా, ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేసేందుకు (Lobbying) ఈ నిధులు వాడారన్న బలమైన అనుమానాలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) రంగంలోకి దిగింది. ఢిల్లీ, ఘాజియాబాద్లలోని సంస్థ కార్యాలయాల్లో దాడులు నిర్వహించింది. నిబంధనల ఉల్లంఘన స్పష్టమవ్వడంతో 2026 జనవరిలో ఈ సంస్థ ఎఫ్సీఆర్ఏ లైసెన్సును కేంద్రం రద్దు చేసింది.
- అడ్వాంటేజ్ ఇండియా (Advantage India) సామాజిక సేవ ముసుగులో జరిగిన అతిపెద్ద కార్పొరేట్ లాబీయింగ్ వ్యవహారంగా ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కార్పొరేట్ లాబీయిస్ట్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న దీపక్ తల్వార్‌కు ఈ సంస్థతో ప్రత్యక్ష సంబంధాలున్నాయి. సీబీఐ (CBI) దర్యాప్తు ప్రకారం, 2012 నుంచి 2016 మధ్య కాలంలో ఎయిర్‌బస్, ఎంబీడీఏ వంటి బహుళజాతి సంస్థల నుంచి అడ్వాంటేజ్ ఇండియాకు ఏకంగా రూ. 90.72 కోట్ల నిధులు వచ్చాయి. సామాజిక ప్రయోజనాల కోసం అని చెప్పి తీసుకున్న ఈ నిధులను దీపక్ తల్వార్ తన విదేశీ ప్రయాణాలకు (రూ. 30.37 లక్షలు), వ్యక్తిగత వ్యాపార అవసరాలకు దారి మళ్లించారు. అంతేకాకుండా, మెడికల్ క్యాంపుల కోసం రూ. 26.97 కోట్ల విలువైన మందులు కొన్నట్లు నకిలీ బిల్లులు సృష్టించారు. తీరా విచారణలో ఆయా ఫార్మా సంస్థలు ఆ లావాదేవీలు అసలు జరగలేదని కుండబద్దలు కొట్టాయి.
- ఆపరేషన్ మొబిలైజేషన్ ఇండియా (Operation Mobilisation India) తెలంగాణ కేంద్రంగా సాగిన ఈ భారీ నిధుల మళ్లింపు వ్యవహారంలో రాష్ట్ర ఆర్థిక నేరాల విభాగం కొరడా ఝుళిపించింది. ఈ సంస్థకు అనుబంధంగా ఉన్న ఏడు చారిటీ సంస్థలకు చెందిన ఏకంగా 26 బ్యాంకు ఖాతాలను అధికారులు స్తంభింపజేశారు. విచిత్రమేమిటంటే, ఈ బాగోతాన్ని బయటపెట్టింది ఆ సంస్థ మాజీ సీఎఫ్ఓ ఆల్బర్ట్ లేయల్. పేదల అభ్యున్నతి, చారిటీ కార్యక్రమాల కోసం విదేశాల నుంచి వచ్చిన విరాళాలను సామాజిక సేవకు వాడకుండా, వాటిని ఫిక్స్డ్ డిపాజిట్లలో (FDs) ఉంచి, ఆ తర్వాత నిబంధనలకు విరుద్ధంగా ఇతర వ్యక్తిగత, వ్యాపార ప్రయోజనాలకు మళ్లించారనేది ఈ సంస్థపై ఉన్న ప్రధాన ఆరోపణ.
- న్యూ హోప్ ఫౌండేషన్ (New Hope Foundation) తమిళనాడుకు చెందిన ఈ సంస్థకు 2017-18 నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో విదేశాల నుంచి సుమారు రూ. 42 కోట్లకు పైగా నిధులు వరదలా వచ్చిపడ్డాయి. అయితే, ఇంత భారీ మొత్తం ఏ కార్యక్రమాలకు ఉపయోగించారు? సంస్థ ప్రకటించిన లక్ష్యాలకే ఈ నిధులు ఖర్చయ్యాయా? అనే ప్రశ్నలకు ప్రభుత్వానికి ఎలాంటి సంతృప్తికరమైన ఆధారాలు లభించలేదు. విదేశీ నిధుల వినియోగంలో కనీస పారదర్శకత, జవాబుదారీతనం లోపించడంతో ఈ సంస్థ ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.
- ఇండియా రూరల్ ఎవాంజెలికల్ ఫెలోషిప్ (India Rural Evangelical Fellowship – IREF) ఆంధ్రప్రదేశ్‌లో విద్య, పిల్లల హాస్టళ్ల నిర్వహణ వంటి సామాజిక కార్యక్రమాలు చేస్తున్నామని చెబుతున్న ఈ సంస్థ కార్యకలాపాలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. 2019 నుంచి 2024 మధ్య అమెరికా, బ్రిటన్లకు చెందిన దాతల నుంచి వీరికి రూ. 28.6 కోట్ల విదేశీ నిధులు అందాయి. అయితే, విదేశాల్లో నిధులు సేకరించడానికి అనాథ పిల్లల చిత్రాలను, వారి దీనస్థితిని వాడుకోవడం అధికారుల దృష్టికి వచ్చింది. అంతేకాకుండా, వచ్చిన నిధులను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించడం, ప్రధానంగా సామాజిక సేవకు బదులు మతపరమైన కార్యక్రమాలకు వాడటం వంటి తీవ్ర ఉల్లంఘనలతో 2025 ఆగస్టులో ఈ సంస్థ లైసెన్స్‌ను కేంద్ర హోంశాఖ సస్పెండ్ చేసింది.
- హార్వెస్ట్ ఇండియా (Harvest India) విదేశాల నుంచి వచ్చే డాలర్లను సామాజిక సేవకు కాకుండా మతపరమైన ఎజెండాలకు మళ్లిస్తున్నారనే ఆరోపణలకు హార్వెస్ట్ ఇండియా మరో ఉదాహరణ. 2017-18 నుంచి 2019-20 మధ్య ఈ సంస్థకు సుమారు రూ. 19.6 కోట్ల విదేశీ నిధులు వచ్చాయి. పేదరిక నిర్మూలన, వైద్యం వంటి అవసరాల కోసం వచ్చిన ఈ సొమ్మును మిషనరీ కార్యకలాపాలు, పాస్టర్లకు జీతాల చెల్లింపులు, చర్చిల నిర్మాణ-నిర్వహణల కోసం వాడారనేది ప్రభుత్వ దర్యాప్తులో తేలిన అంశం. ఎఫ్సీఆర్ఏ మూల సూత్రాలనే ఉల్లంఘించడంతో ఈ సంస్థ రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేయబడింది.
- సెంటర్ ఫర్ ఈక్విటీ స్టడీస్ (Centre for Equity Studies – CES) ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త హర్ష్ మందర్తో ముడిపడి ఉన్న ఈ సంస్థ చుట్టూ అనేక వివాదాలు అలుముకున్నాయి. ఈ సంస్థ ఆధ్వర్యంలో నడిచే పిల్లల సంరక్షణ కేంద్రాలపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. అక్కడ పిల్లల భద్రత గాలికి వదిలేశారని, పోక్సో (POCSO) కేసుల నివేదికలను దాచిపెట్టారని తీవ్రమైన ఆక్షేపణలు వ్యక్తమయ్యాయి. ఇది మాత్రమే కాకుండా, ఈ ఆశ్రమాల్లో ఉన్న పిల్లలను పౌరసత్వ సవరణ చట్టం (CAA) వ్యతిరేక నిరసనల్లో చట్టవిరుద్ధంగా పాల్గొనేలా చేశారని, కొన్ని కేంద్రాల్లో విదేశీ పౌరుల జోక్యం మితిమీరిందని తేలడంతో ఢిల్లీ పోలీసులు ఏకంగా సంస్థ అధికారులపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు.
- సోషియో లీగల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (Socio Legal Information Centre – SLIC) న్యాయ సహాయం, మానవ హక్కుల పరిరక్షణ, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (PILs) దాఖలు చేయడం వంటి కార్యకలాపాలు నిర్వహించే ఈ సంస్థకు వివాదాస్పద ‘హ్యూమన్ రైట్స్ లా నెట్వర్క్’తో సన్నిహిత సంబంధాలున్నాయి. సామాజిక సేవ, న్యాయ సహాయం కోసం విదేశాల నుంచి వస్తున్న నిధులను రాజకీయంగా సున్నితమైన కార్యకలాపాలకు, ప్రభుత్వ వ్యతిరేక అజెండాలను ప్రోత్సహించే వ్యాజ్యాలకు ఉపయోగిస్తున్నారనే కోణంలో విచారణ జరిపిన కేంద్ర అధికారులు.. ఎఫ్సీఆర్ఏ నిబంధనల ఉల్లంఘనల కింద ఈ సంస్థ లైసెన్సును రద్దు చేశారు.
- కేర్ ఇండియా సొల్యూషన్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ (CARE India Solutions for Sustainable Development) నిధుల బదిలీలో పారదర్శకత లోపించిన అతిపెద్ద కేసుల్లో ఇదొకటి. కేవలం ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే ఏకంగా రూ. 157 కోట్లకు పైగా విదేశీ నిధులు ఈ సంస్థ ఖాతాల్లోకి వచ్చాయి. USAID, అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్ ఇండియా వంటివి దీనికి దాతలుగా వ్యవహరించాయి. ఇంత భారీ ఎత్తున నిధులు వచ్చినప్పటికీ, వాటి వినియోగం, ఇతర అనుబంధ సంస్థలతో జరిగిన అంతర్గత ఆర్థిక లావాదేవీల లెక్కలు పక్కాగా లేకపోవడంతో అధికారుల రాడార్‌లో ఈ సంస్థ చిక్కుకుంది.
- సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ (Centre for Policy Research – CPR) దేశంలోని అత్యంత ప్రముఖ పబ్లిక్ పాలసీ థింక్ ట్యాంక్ అయిన సీపీఆర్ వ్యవహారం మేధావి వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. కేవలం మూడు నెలల వ్యవధిలోనే (2022 అక్టోబర్-డిసెంబర్) ఈ సంస్థకు బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా వంటి సంస్థల నుంచి రూ. 10.1 కోట్ల విదేశీ నిధులు వచ్చాయి. ఆదాయపు పన్ను శాఖ సర్వేల్లో ఈ సంస్థ స్వీకరించిన విదేశీ నిధులను నిబంధనలకు విరుద్ధంగా ఇతర సంస్థలకు బదిలీ చేయడం, ఎఫ్సీఆర్ఏ నిర్దేశిత ఖాతాలను ఉపయోగించకపోవడం వంటి అవకతవకలను ప్రభుత్వం గుర్తించింది. దీంతో తొలుత సస్పెండ్ చేసి, అనంతరం లైసెన్సును శాశ్వతంగా రద్దు చేసింది.
- ఆక్స్‌ఫామ్ ఇండియా (Oxfam India) విదేశీ నిధుల నియంత్రణ వ్యవహారంలో ప్రభుత్వానికి, ఎన్జీవోలకు మధ్య జరిగిన కోల్డ్ వార్‌లో ఆక్స్‌ఫామ్ ఇండియా కేంద్ర బిందువుగా నిలిచింది. సవరించిన ఎఫ్సీఆర్ఏ నిబంధనల ప్రకారం విదేశీ నిధులను ఏ ఇతర సంస్థలకు బదిలీ చేయకూడదు. కానీ ఆక్స్‌ఫామ్ ఇండియా నిబంధనలను బేఖాతరు చేస్తూ సీపీఆర్ (CPR) లాంటి ఇతర సంస్థలకు నిధులను మళ్లించిందని దర్యాప్తులో తేలింది. దీనికి తోడు సుమారు రూ. 1.50 కోట్లను ఎఫ్సీఆర్ఏ పరిధిలో లేని బయటి ఖాతాల ద్వారా నిర్వహించారని నిర్ధారించిన కేంద్రం, 2022లో ఈ సంస్థ రిజిస్ట్రేషన్ రిన్యువల్ కాకుండా అడ్డుకట్ట వేసింది.
- లీగల్ ఇనిషియేటివ్ ఫర్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ (LIFE Trust) పర్యావరణ పరిరక్షణ ముసుగులో ఏకంగా దేశ అభివృద్ధి ప్రాజెక్టులనే అడ్డుకుంటున్నారనే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న సంస్థ ఇది. పర్యావరణ న్యాయవాది రిత్విక్ దత్తాతో సంబంధం ఉన్న ఈ ట్రస్ట్‌కు.. అమెరికాకు చెందిన ‘ఎర్త్జస్టిస్’ (Earthjustice) నుంచి 2016-2021 మధ్య కాలంలో రూ. 22 కోట్ల ప్రొఫెషనల్ రసీదులు అందాయి. విదేశాల నుంచి వస్తున్న ఈ డబ్బును దేశంలోని బొగ్గు గనులు, విద్యుత్ కేంద్రాలు, ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వేయడానికి, న్యాయపరమైన అడ్డంకులు సృష్టించడానికే వాడారని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. దేశ ఆర్థిక ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నారనే కారణంతో 2024లో దీని లైసెన్సును కేంద్రం రద్దు చేసింది.
- ఎన్విరానిక్స్ ట్రస్ట్ (Environics Trust) ఈ సంస్థ వ్యవహార శైలిపై నేరుగా సీబీఐ రంగంలోకి దిగి క్రిమినల్ కేసు నమోదు చేసింది. బొగ్గు గనులు, థర్మల్ పవర్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా స్థానికులను రెచ్చగొడుతూ కార్యకలాపాలు నిర్వహించడానికి వీరు విదేశీ నిధులను వాడారని ఆరోపణలున్నాయి. అంతేకాకుండా, ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించడానికి ఎఫ్సీఆర్ఏ వార్షిక రిటర్నుల్లో రూ. 6.50 లక్షలు, రూ. 4 లక్షల విలువైన నకిలీ ఇన్వాయిస్లను చూపించారని సీబీఐ దర్యాప్తులో తేలింది. ఆ బిల్లులను జారీ చేసినట్లు చెబుతున్న సంస్థలు అసలు తాము అలాంటి బిల్లులే ఇవ్వలేదని స్పష్టం చేయడంతో ఎన్విరానిక్స్ ట్రస్ట్ బండారం బయటపడింది. దీంతో 2024 మార్చిలో కేంద్ర ప్రభుత్వం దీని రిజిస్ట్రేషన్‌ను శాశ్వతంగా రద్దు చేసింది.
నిధులు ఎవరి కోసం? ఎవరి ప్రయోజనాల కోసం? పై 13 సంస్థల వ్యవహారాలను లోతుగా విశ్లేషిస్తే, భారతదేశంలో పనిచేస్తున్న కొన్ని ఎన్జీవోల అసలు స్వరూపం అర్థమవుతుంది. పర్యావరణ పరిరక్షణ, మానవ హక్కులు, ప్రజా విధానాలు, పేదరిక నిర్మూలన వంటివి అత్యంత పవిత్రమైన, దేశానికి అవసరమైన లక్ష్యాలు. కానీ, సరిగ్గా ఈ ఆకర్షణీయమైన పదాలనే కవచంగా వాడుకుని, విదేశీ శక్తుల ఆర్థిక సాయంతో కొందరు తమ సొంత అజెండాలను అమలు చేస్తున్నారు. దర్యాప్తు సంస్థలు బయటపెట్టిన వివరాల ప్రకారం ప్రధానంగా మూడు కోణాల్లో ఈ నిధుల దుర్వినియోగం జరుగుతోంది:
సామాజిక సేవ, అనాథల పోషణ పేరుతో విదేశాల నుంచి భారీగా నిధులు సేకరించి, వాటిని మత ప్రచారం కోసం, మిషనరీ కార్యకలాపాల కోసం వాడుకోవడం.
పర్యావరణ పరిరక్షణ ముసుగులో దేశానికి అత్యవసరమైన బొగ్గు, విద్యుత్, మౌలిక ప్రాజెక్టులపై కోర్టుల్లో పదే పదే కేసులు వేస్తూ, వాటిని అడ్డుకోవడం. (ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం).
మానవ హక్కులు, పబ్లిక్ పాలసీల పేరుతో విదేశీ నిధులు తీసుకుని, దేశీయ విధానాలను ప్రభావితం చేయడం, ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు (CAA లాంటివి) నిధులు సమకూర్చడం.


