హిందూ ధర్మంపై రమణానంద మహర్షి విష ప్రయోగం.. శృతి మించుతున్న అహంకారం!
ఆధ్యాత్మిక ముసుగులో, సిద్ధ గురువు అనే అహంకారంతో సనాతన ధర్మంపై కొందరు చేస్తున్న దాడి హిందూ సమాజం రక్తాన్ని మరిగిస్తోంది. పీఠాధిపతులు, ప్రవచనకర్తలపై నోరు పారేసుకోవడమే పనిగా పెట్టుకున్న గూడూరు వెంకటరమణయ్య అలియాస్ రమణానంద మహర్షి అసలు రంగు మరోసారి బయటపడింది. షిరిడీ సాక్షిగా ఆయన చేసిన అత్యంత దారుణమైన చర్య ఇప్పుడు ఆధ్యాత్మిక లోకంలో పెను సంచలనంగా మారింది. ‘వైదిక హవనం’ అనే పవిత్రమైన పేరుతో ఆయన నిర్వహించిన క్రతువులో పఠించిన మంత్రాలు వింటే ఏ హిందువుకైనా ఆగ్రహం కట్టలు తెంచుకోవడం ఖాయం. ఒక వైదిక హోమంలో “ముస్లిం పదార్థ వాచకః, అల్లా మాలిక్ సుభాషితః, ఖురాన్ జ్ఞాన ప్రబోధకః, సూచిస్తహార ఇమాం బృష స్వాహా” అంటూ అన్యమత గ్రంథాలను, పదాలను జోడించి ఆయన స్వాహాకారాలు సమర్పించడం ఆయన పైశాచికత్వానికి పరాకాష్ట. సాయిబాబాను సర్వమత సమ్మేళనంగా ఆరాధించడం భక్తుల వ్యక్తిగత విశ్వాసం కావచ్చు, కానీ సాక్షాత్తు వేద మంత్రాలతో దేవతలకు హవిస్సులు అర్పించే అతి పవిత్రమైన యజ్ఞగుండంలో ఖురాన్, అల్లా పేర్లతో మంత్రాలు చదవడం ద్వారా ఆయన హిందూ ధర్మానికి ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారు? ఒకప్పుడు సనాతన ధర్మానికి, సాయిబాబాకు సంబంధం లేదని వాదించిన ఈ మహానుభావుడే.. ఈరోజు అదే వైదిక హోమం పేరుతో ఈ రకమైన మలినమైన శ్లోకాలను చదవడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం.
వేదాల్లోనే అరవై వేల తప్పులు పట్టానని ప్రగల్భాలు పలికే ఈ ‘స్వయం ప్రకటిత’ మహర్షి అజ్ఞానం ఎలాంటిదో ఆయన రాసిన ఈ నాలుగు లైన్ల శ్లోకమే స్పష్టం చేస్తోంది. యతి, ప్రాస, ఛందస్సు, అర్థం, పరమార్థం ఏవీ లేకుండా ఇష్టం వచ్చినట్లు రాసిన పదాలను మంత్రాలుగా చదువుతున్న ఆయనకు కనీస సంస్కృత పరిజ్ఞానం లేదన్నది సుస్పష్టం. అసలు ఆయన అజ్ఞానం కేవలం హోమాలకే పరిమితం కాలేదు. పితృ తర్పణాల పేరుతో ఆయన చేసిన వ్యవహారం చూస్తే శాస్త్రం తెలిసిన ఏ పండితుడైనా నివ్వెరపోవాల్సిందే. తర్పణాలు వదిలేటప్పుడు జంధ్యాన్ని అపసవ్యంగా వేసుకోవాలి, ఉత్తరీయాన్ని నడుముకు కట్టాలి, ఆభరణాలు తీసివేయాలి అనే కనీస ధర్మ సూక్ష్మాలు కూడా ఈ సిద్ధ గురువుకు తెలియవు. అంతకంటే దారుణం.. తాను బతికి ఉండగానే తన పూర్వీకులకు తన కూతురి చేత సంకల్పం చెప్పించడం, వంశ వృక్షంలో నానమ్మ, ముత్తమ్మ వరుసలను సైతం తప్పుగా కలపడం. తాత భార్య స్థానంలో అవ్వ వాళ్ళ అమ్మను తెచ్చిపెట్టిన ఇతని అజ్ఞానాన్ని చూసి హిందూ సమాజం తీవ్రంగా అసహ్యించుకుంటోంది.
తన అజ్ఞానాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే శిష్యుల చేత బూతులు తిట్టిస్తూ, ఇతర పీఠాధిపతులపై దాడికి దిగే ఈ మహర్షి అహంకారానికి ఎట్టకేలకు న్యాయస్థానం బ్రేకులు వేసింది. దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మలపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇతరులను కించపరిచేలా ఉన్న ఆ వీడియోలన్నింటినీ వెంటనే తొలగించాలని ఆదేశిస్తూ సైబర్ క్రైమ్ పోలీసులకు, యూట్యూబ్ కు, స్వయంగా రమణానంద మహర్షికి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇతర మతాలను కించపరచాల్సిన పనిలేదు, అలాగని హిందూ సనాతన ధర్మం యొక్క మూలాలను దెబ్బతీసే ఇలాంటి పైశాచిక, అజ్ఞానపూరిత చర్యలను సహించే ప్రసక్తే లేదు. పవిత్రమైన వైదిక క్రతువుల పేరుతో హిందువుల మనోభావాలను దారుణంగా గాయపరిచిన రమణానంద మహర్షి తక్షణమే యావత్ హిందూ జాతికి బేషరతుగా క్షమాపణలు చెప్పితీరాల్సిందే. లేనిపక్షంలో ఆయన చేస్తున్న ఈ ధర్మ విరుద్ధ చర్యలపై హిందూ సమాజం కన్నెర్ర చేయడం ఖాయం.


