హైదరాబాద్‌ను ‘గ్లోబల్ సిటీ’ అనాలో లేక ‘క్యాండిల్ లైట్ డిన్నర్ సిటీ’ అనాలో అర్థం కాక భాగ్యనగర వాసులు జుట్టు పీక్కుంటున్నారు. ఆకాశంలో నల్లటి మబ్బు కనిపించిందో లేదో… కరెంట్ ఆఫీస్‌లో ఉన్న సబ్‌స్టేషన్ సిబ్బంది టక్కున మెయిన్ స్విచ్ ఆఫ్ చేసేస్తున్నారు. “అబ్బే.. వాన వస్తే వైర్లు తెగిపోతాయ్, ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోతాయ్” అంటూ ముందే జాగ్రత్త పడిపోయే మన ‘హస్తం’ సర్కార్ పాలనలో, హైదరాబాద్ ఇప్పుడు సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఒక్క వానకే కరెంట్ పోతుంటే… అసలు వర్షాకాలం మొత్తం ఎలా గడపాలో అర్థం కాక జనాలు నానా అవస్థలు పడుతున్నారు.
గూగుల్ వెదర్ రిపోర్ట్ కంటే మన విద్యుత్ శాఖ వాళ్ల రిపోర్ట్ చాలా స్పీడ్‌గా ఉంటోంది. ఆకాశంలో కాస్త ఉరుము వినిపిస్తే చాలు పవర్ కట్, చల్లటి గాలి వీస్తే లో-వోల్టేజ్, ఒక్క చినుకు నేలను తాకితే అనంత కాలం పాటు పవర్ కట్! జనాలకు ఫోన్‌లో వర్షం వస్తుందో లేదో తెలియకముందే, ఇంట్లో ఫ్యాన్ ఆగిపోవడాన్ని బట్టి “ఓహో.. బయట వాతావరణం మారిందన్నమాట” అని ఫిక్స్ అయిపోతున్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక కరెంట్ పోవడం అనేది ఒక ‘సహజ సిద్ధమైన వెదర్ అలర్ట్’ లా మారిపోయింది.
పాపం, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఐటీ బాబుల పరిస్థితి అయితే మరీ ఘోరం. ల్యాప్‌టాప్‌లో ముప్పై శాతం ఛార్జింగ్ ఉండగానే పవర్ పోతుంది.
“సార్, మా ఏరియాలో వాన పడుతోంది, పవర్ పోయింది” అని టీమ్ లీడర్‌కి మెసేజ్ పెడితే… “అక్కడ పడింది రెండు చినుకులే కదయ్యా.. దానికి కరెంట్ తీసేస్తారా?” అని లీడర్ అడుగుతాడు.
లీడర్‌కి ఏం తెలుసు… మన హైదరాబాద్‌లో పడేది చినుకులు కాదు, కరెంట్ తీసేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి దొరికే ‘బంగారు లాంటి అవకాశాలు’ అని! ఇన్వర్టర్లు కూడా “నన్ను క్షమించు బాస్.. నా వల్ల కావడం లేదు” అంటూ చేతులెత్తేస్తున్నాయి.
ఇక కరెంట్ పోయిందా… ఇంట్లో ఉన్న దోమలన్నీ ఒక్కసారిగా ‘కాంగ్రెస్ సర్కార్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేస్తూ బయటకు వస్తాయి. అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా… కరెంట్ పోగానే దోమల బ్యాట్లు పట్టుకుని జనాలు చేసే ‘జుంబా డాన్స్’లు గల్లీ గల్లీలో కనిపిస్తున్నాయి. అటు ఫ్యాన్ తిరగదు, ఇటు ఉక్కపోత… మధ్యలో దోమల సంగీతం! అంతా కొత్త సర్కార్ గారి ‘ఇంద్రజాలం’ లా ఉందంటున్నారు ప్రజలు. “మహిళలకు బస్సుల్లో ఫ్రీ ప్రయాణం ఇచ్చారు.. అలాగే ఇప్పుడు వారానికి రెండు రోజులు ‘ఉచితంగా’ చీకట్లో గడిపే భాగ్యాన్ని కూడా కల్పిస్తున్నారు” అంటూ జనాలు సెటైర్లు వేస్తున్నారు. కరెంట్ బిల్లులు మాత్రం కరెక్ట్ గా ‘షాక్’ కొట్టేలా వస్తున్నాయి కానీ, కరెంట్ మాత్రం ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియని ఒక పెద్ద మిస్టరీ!
ఏదేమైనా, హైదరాబాద్‌లో వాన పడితే కరెంట్ పోవడం అనేది ఒక సంప్రదాయం. దాన్ని మన ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ చాలా ‘నిష్టగా’ కొనసాగిస్తోంది. అందుకే భాగ్యనగర వాసులారా… వానాకాలం వచ్చేసింది, గొడుగులతో పాటు ఇంట్లో కొవ్వొత్తులు, చార్జింగ్ లైట్లు, చేతి విసనకర్రలు కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఎందుకంటే… మనది మామూలు సిటీ కాదు, నిజంగానే ‘పవర్ ఫుల్’ సిటీ కదా!
బ్రేకింగ్ న్యూస్: ఒకే ఒక్క వాన… హైదరాబాద్‌లో కరెంట్ ‘గైబ్’!