అంగన్వాడీలో గుడ్లు వద్దు… కోవా బన్నులే ముద్దు!
పిల్లల ఆరోగ్యం తర్వాత విషయం’తోపుడు బండి’ వ్యాపారమే ముఖ్యం – రుచికరమైన కోవా బన్ చిరు వ్యాపారులను ఆదుకోవడమే మన కర్తవ్యం ఇప్పుడు…
కోవా బన్ అనగానే ఎగబడి తినేది చిన్నారులె కదా…ఇప్పుడు వారి ఇష్టాలకే పెద్దపీట వేసేద్దాం…ఇప్పటిదాకా రాష్ట్రంలో చిన్నారులకు ఆరోగ్యం, బలవర్ధకమైన ఆహారం అంటూ ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి గుడ్లు పంపిణీ చేస్తూ వస్తుంది కదా… కానీ ఇప్పుడు సడెన్ గా ఇదే పిల్లల ఆరోగ్యం విషయం కన్నా రోడ్ పక్కన కోవా బన్ అమ్ముకునే తోపుడు బండి ఆహారానికే ఎక్కువ విలువ ఇస్తున్నప్పుడు.. ఈ గుడ్ల వల్ల ఎవరికి లాభం? కేవలం పిల్లలకు మాత్రమే కదా..
అదే, ఆ గుడ్లు పక్కన పెట్టి మన వీధుల్లో తిరిగే “కోవా బన్ బండ్ల” వారిని ఆదుకుంటే, అటు వ్యాపారం, ఇటు పిల్లలకు ఇష్టమైన చిరు తిండిగా కడుపు నిండా మైదా పిండి దొరుకుతుంది కదా! ఈ చిన్న విషయం ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదు?
పాపం.. మేడారం జాతరలో కోవా బన్ కి అవమానం:
ఈ మధ్యనే జరిగిన మేడారం జాతరకు ఎంతో ఆశతో వెళ్లిన ఒక చిరు వ్యాపారి దీనగాధ అందరికీ కళ్ళు తెరిపించాలి. “జనం వస్తారు, నా బన్నులు తింటారు, నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చు” అని ఎంతో ఆశతో తన కోవా బన్ బండి వేసుకుని అంత దూరం వెళ్తే..
నాణ్యత లేదు… ఇంత తక్కువ ధరకు ఎలా కోవా బన్ వస్తుంది అంటూ నిగ్గదీసి అడిగే ప్రయత్నం చేయడం లో నిజంగా ఆ కోవా బన్ కి అవమానమే జరిగిందని చెప్పుకోవచ్చు.
ఇది ముమ్మాటికి ఖండించాల్సిన విషయమే..
ఇప్పుడు వీళ్ళని ఆదుకోవాల్సిన సమయం వచ్చేసింది…
నాణ్యత ని పక్కన పెట్టేద్దాం కాసేపు..పోతే పోయింది పిల్లల ఆరోగ్యం. ముందు కోవా బన్ కి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుందా…
ప్రభుత్వం గనక మధ్యాహ్నం భోజనం లో స్కూల్ పిల్లలకు గుడ్లు ఆపేసి, ఇతని దగ్గర బన్నులు కొని గుడ్ల ప్లేస్ ని భర్తీ చేస్తే ఆ బండి వాడికి జీవనోపాధి ఇచ్చినట్టు ఉంటుంది… ఇంకా ఇలాంటి వ్యాపారాలు చేయడానికి ఎంతో మందికి ధైర్యం ఇచ్చినట్టు అవుతుంది..
నాణ్యత తక్కువైనా పర్లేదు.. ఇక్కడ వ్యాపారం ముఖ్యం కదా ! పొట్ట కొట్టకూడదు కదా..!
ఇక గుడ్డులో బలం ఉంటుంది, పోషకాలు ఉంటాయని వైద్యులు చెబుతారు కానీ,
పిల్లలకి ఇష్టమైన ఫుడ్ పెడుతూ చిరు వ్యాపారులను ఆదుకోవాలని చూడ్డం లో ఓటు బ్యాంకింగ్ ఉంటుంది కదా…(చిన్నపిల్లలకు ఎలాగూ ఓటు హక్కు ఉందదు కదా) నాణ్యత తక్కువ అంటూ కోవా బన్నులో మత్తు పదార్థాలు ఏమైనా కలిసాయా అంటూ మైదా పిండి,డాల్దా అంటూ జనాలు గోల చేయడం ఎంతవరకు సమంజసం..? ఇవన్నీ ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వానిధి కదా…
సామాన్యుడు గొంతు చించుకుంటే సరిపోతుందా…?
ఇలా ప్రభుత్వం ఆదా చేసిన డబ్బుతో ఇంకొన్ని కోవా బన్ బండ్లను ప్రోత్సహించవచ్చు. పిల్లల ఆరోగ్యం తర్వాత చూసుకోవచ్చు, ముందు బండి వాడి బతుకుదెరువు ముఖ్యం.
రేపటి భవిష్యత్తు…తోపుడు బండ్లే మన దేవాలయాలు:
గుడ్లు ఉడకబెట్టడం, పొట్టు తీయడం, ఆయాలకు పెద్ద శ్రమ. అదే కోవా బన్ బండ్లు బడి గేటు ముందుకు వస్తే.. కాగితంలో చుట్టి ఇచ్చేస్తారు. పని సులువు, సమయం ఆదా!
పిల్లలకు ఎముకల బలం ఎలా మరి అంటూ ఆలోచిస్తూ కూర్చుంటే పని జరగదు.., కనీసం బండి వాడికి చేతి నిండా పని దొరుకుతుంది..
అంతేకదా. అందుకే, నాణ్యత ప్రమాణాలు, ఆహార భద్రత నిబంధనలు పక్కన పెట్టి.. ఊరూరా తిరిగే కోవా బన్ బండ్లనే అధికారిక సరఫరాదారులుగా ప్రకటించాలి..
మళ్ళీ ల్యాబ్ కి పంపి టెస్ట్ లు అవి చేయించే ప్రయత్నం చేస్తే వ్యాపారుల నోట్లో మట్టి కొట్టినట్టు అవుతుంది..
ప్రభుత్వానికి విన్నపం:
అయ్యా పాలకులారా.. గుడ్ల ఒప్పందాలను పక్కన పెట్టండి. మేడారం వెళ్లి నష్టపోయిన బండి వాడిలాంటి వారిని ఆదుకోండి. అంగన్వాడీ ఆహార పట్టికలో నుంచి గుడ్డును తొలగించి, వెంటనే కోవా బన్ (అదీ నాణ్యత తక్కువదైనా సరే) ప్రవేశపెట్టండి.
జై కోవా బన్.. జై జై బండి!
(గమనిక: ఇది ప్రభుత్వ విధానాలపై, వ్యవస్థలోని లోపాలపై సంధించిన వ్యంగ్య కథనం మాత్రమే.)