కువైట్‌లో తమిళనాడు మహిళకు నరకయాతన.. కాపాడిన భారత ఎంబసీ!
ఉపాధి కోసం కువైట్ వెళ్లిన ఓ తమిళనాడు మహిళ నరకయాతన అనుభవించింది. కల్లకురిచి జిల్లాకు చెందిన వనిత అనే మహిళ, ఇద్దరు పిల్లల తల్లి, మూడు నెలల క్రితం ఓ ఏజెంట్ ద్వారా కువైట్‌కు గృహ కార్మికురాలిగా పని కోసం వెళ్ళింది. అయితే, అక్కడి యజమానులు ఆమెను తీవ్రంగా హింసించడం మొదలుపెట్టారు. గత రెండు నెలలుగా జీతం ఇవ్వకపోగా, 50 రోజులుగా కనీసం సరైన ఆహారం కూడా పెట్టకుండా చిత్రహింసలకు గురిచేశారు. ప్రాణభయంతో వణికిపోయిన వనిత, ఓ ఇరుకైన గదిలో ఉండి, తనను ఎలాగైనా కాపాడాలంటూ కన్నీటి పర్యంతమవుతూ తీసిన ఒక ఎస్ఓఎస్ (SOS) వీడియో సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపింది. యజమానులు తనను చంపేస్తారేమో అన్న భయంతో, కల్లకురిచి కలెక్టర్ మరియు ఎస్పీ జోక్యం చేసుకుని తనను ప్రాణాలతో స్వదేశానికి రప్పించాలని ఆ వీడియోలో ఆమె వేడుకుంది.
ఈ వీడియో కువైట్‌లోని భారతీయ ఎంబసీ దృష్టికి వెళ్లడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) స్పందనతో, ఎంబసీ అధికారులు క్షణాల్లో రంగంలోకి దిగి వనితను ఆ కష్టాల నుంచి సురక్షితంగా రక్షించారు. ప్రస్తుతం ఆమె ఇండియన్ ఎంబసీలో క్షేమంగా ఉంది. “ఇప్పుడు నేను సురక్షితంగా ఎంబసీలో ఉన్నాను, నాకు మంచి దుస్తులు, ఆహారం లభించాయి” అని పేర్కొంటూ భారత ప్రభుత్వానికి, ఎంబసీ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె విడుదల చేసిన మరో వీడియో అందరికీ ఊపిరి పీల్చుకునేలా చేసింది.
మరోవైపు వనిత కష్టాలకు కారణమైన ఏజెంట్‌పై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. వీడియో వైరల్ అయిన వెంటనే తమిళనాడులోని అధికారులు కల్లకురిచిలోని ఆమె కుటుంబాన్ని ట్రేస్ చేశారు. పని స్వభావం, భద్రత గురించి తన కూతురికి మాయమాటలు చెప్పి కువైట్‌కు పంపిన ఏజెంట్‌పై వనిత తల్లి స్థానిక అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, ఆ అమాయక మహిళను మోసం చేసిన సదరు ఏజెంట్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసి చట్టపరమైన విచారణ ప్రారంభించారు.


