ఐఏఎఫ్ అధికారి భార్యకు మత్తుమందు.. ‘లవ్ జిహాద్’ పేరిట నరకం చూపించిన కామాంధులు!
మహారాష్ట్రలోని నాగపూర్‌లో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) అధికారి భార్యను మభ్యపెట్టి, డ్రగ్స్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడటమే కాకుండా.. బలవంతంగా మతమార్పిడికి ప్రయత్నించిన ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన బాధితురాలి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ కిరాతక చర్య బహిర్గతమైంది. చదువుకున్న, ఉన్నత స్థాయిలో ఉన్న మహిళలను సైతం టార్గెట్ చేస్తూ సాగుతున్న ఈ ముఠాల వ్యవహారం సమాజంలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
పోలీసులు మరియు బాధిత మహిళ ఫిర్యాదు మేరకు.. ప్రధాన నిందితుడు అయాజ్ తాజ్ మదారే (26) మరియు 24 ఏళ్ల బాధితురాలికి గతంలో కలిసి చదువుకున్న పరిచయం ఉంది. ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని, ఒక ప్లాట్ కొనుగోలు వ్యవహారం (ప్రాపర్టీ డీల్) మాట్లాడాలని చెప్పి వార్ధా రోడ్డులోని ఒక హోటల్‌కు ఆమెను పిలిపించాడు. అక్కడ ఆమె తాగే జ్యూస్‌లో మత్తుమందు (డ్రగ్స్) కలిపి ఇచ్చాడు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, ఆ కిరాతకాన్ని వీడియోలు తీసి తన దగ్గర ఉంచుకున్నాడు.
ఆ అశ్లీల వీడియోలను అడ్డం పెట్టుకుని నిందితుడు అయాజ్, అతని స్నేహితులు హకీం ఖాన్ మరియు మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక మౌలానా.. బాధితురాలిని నిరంతరం వేధించడం మొదలుపెట్టారు. వీడియోలు బయటపెడతామని బెదిరిస్తూ పదేపదే అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా బ్లాక్మెయిల్ చేసి ఆమె వద్ద నుంచి సుమారు 3 నుంచి 4 లక్షల రూపాయల వరకు నగదును కూడా వసూలు చేశారు. ఇక్కడితో ఆగకుండా ఇస్లాం మతంలోకి మారాలంటూ ఆమెపై తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో నిందితుల అకృత్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బాధితురాలు ఏడుస్తూ “నన్ను వదిలేయండి” అని వేడుకుంటున్నా వినిపించుకోకుండా, ఆమె కాళ్లు పట్టుకుని, చేతులు కట్టేసి బలవంతంగా మతపరమైన మంత్రాలు (చాంటింగ్) చదివారు. ఆమె ముఖంపై ఊదుతూ ఇస్లాంలోకి మారుస్తున్నట్లుగా ప్రవర్తించారు. అంతేకాకుండా మదారేతో ఆమెకు వివాహం జరిగినట్లు నమ్మించే ప్రయత్నం చేశారు. పలుమార్లు నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి బలవంతంగా మతపరమైన ఆచారాలు చేయించేందుకు యత్నించారు.
చివరికి ఈ నరకం భరించలేక బాధితురాలు కొన్ని రోజుల క్రితం తన భర్తకు జరిగిన ఘోరాన్ని వివరించింది. వెంటనే వారు సోనేగావ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలు సమర్పించిన వీడియోను కీలక ఆధారంగా పరిగణించి కేసు నమోదు చేశారు. నిందితులపై అత్యాచారం, ఎక్స్టార్షన్ (బెదిరించి వసూలు చేయడం), బలవంతపు మతమార్పిడి యత్నంతో పాటు ‘మహారాష్ట్ర ప్రివెన్షన్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ అండ్ అఘోరి ప్రాక్టీసెస్ యాక్ట్’ కింద తీవ్రమైన సెక్షన్లు నమోదు చేశారు. ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్టు చేసి ఐదు రోజుల పోలీస్ కస్టడీకి తరలించారు.


