నాడు మోదీపై విషం, నేడు రేవంత్‌తో దోస్తీ! మాయా ట్యూడర్,ఫైసల్ దేవ్‌జీ అజెండాను భుజానికెత్తుకున్న తెలంగాణ సీఎం!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యునైటెడ్ కింగ్డమ్ (UK) పర్యటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. విద్యాభివృద్ధి, పెట్టుబడుల ముసుగులో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ‘బ్లావత్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్’ను సందర్శించిన రేవంత్ రెడ్డి, అక్కడ ప్రొఫెసర్లు మాయా ట్యూడర్, ఫైసల్ దేవ్జీలతో ప్రత్యేకంగా భేటీ కావడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రపంచవ్యాప్తంగా నిరంతరం భారతదేశ ప్రతిష్టను దిగజార్చడమే పనిగా పెట్టుకున్న, హిందూ వ్యతిరేక భావజాలానికి ప్రసిద్ధి చెందిన ఇలాంటి వివాదాస్పద వ్యక్తులను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నాయకుడు అధికారికంగా కలవడంపై జాతీయవాద వర్గాలు, బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. దేశ ప్రయోజనాలను, గౌరవాన్ని పక్కనపెట్టి అంతర్జాతీయంగా భారత్‌పై విషం చిమ్మే శక్తులకు కాంగ్రెస్ ముఖ్యమంత్రి వత్తాసు పలుకుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ భేటీలో ప్రధానంగా విమర్శలకు కేంద్రబిందువైన మాయా ట్యూడర్, ఆక్స్ఫర్డ్ వేదికగా భారత ప్రజాస్వామ్యంపై విషప్రచారం చేయడంలో ముందుంటుంది. జూలై 2023లో ఆమె ప్రచురించిన “ఇండియాస్ డెమోక్రసీ ఈజ్ డైయింగ్” (భారత ప్రజాస్వామ్యం అంతరిస్తోంది) అనే వ్యాసం దీనికి పరాకాష్ట. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం నిరంకుశత్వంలోకి వెళ్ళిపోతోందంటూ ఆమె పాశ్చాత్య వేదికలపై అవాస్తవాలను గుప్పించింది. 140 కోట్ల మంది ప్రజల ప్రజాస్వామ్య తీర్పును అవమానిస్తూ, లెఫ్ట్-లిబరల్ ఎజెండాను ముందుకు నడిపించేందుకు ఆమె భారత సార్వభౌమత్వాన్ని నిరంతరం కించపరుస్తూ వస్తోంది. అలాంటి వ్యక్తితో తెలంగాణ అభివృద్ధి పేరుతో సీఎం రేవంత్ రెడ్డి సత్సంబంధాలు నెరపడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

మాయా ట్యూడర్ తన నిరాధార వాదనల కోసం భారతదేశాన్ని అస్థిరపరచాలని చూసే జార్జ్ సోరోస్ నిధులు పొందే ‘వీ-డెమ్’ (V-Dem), ‘ఫ్రీడమ్ హౌస్’ వంటి పక్షపాత సంస్థల నివేదికలను ప్రామాణికంగా చూపించింది. ఫ్రీడమ్ హౌస్ సంస్థ గతంలో భారత్‌లో అడ్డంగా దొరికిపోయిన ‘ది వైర్’, ఆల్ట్ న్యూస్ వంటి లెఫ్టిస్ట్ ప్రచార సాధనాల అబద్ధాల ఆధారంగానే భారత ర్యాంకింగ్‌ను తగ్గించిందని తేటతెల్లమైంది. గతంలో భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ సైతం ఇలాంటి పాశ్చాత్య రేటింగ్ ఏజెన్సీలు “తాము ప్రపంచానికి స్వయం ప్రకటిత సంరక్షకులమనే భ్రమలో బతుకుతున్న కపట శక్తులు” అని నిర్ద్వంద్వంగా ఎండగట్టారు. అయినప్పటికీ, దేశంలో విశ్వసనీయత కోల్పోయిన ఇలాంటి నివేదికలను ప్రచారం చేసే వ్యక్తులకు కాంగ్రెస్ నేతలు రెడ్ కార్పెట్ పరచడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

మాయా ట్యూడర్‌తో పాటు రేవంత్ రెడ్డి కలిసిన మరో ప్రొఫెసర్ ఫైసల్ దేవ్‌జీ కూడా చరిత్ర వక్రీకరణలో, భారతీయ సంస్కృతిని, హిందూత్వ భావజాలాన్ని అంతర్జాతీయంగా అపహాస్యం చేయడంలో తీవ్ర పాత్ర పోషిస్తున్నారు. పాశ్చాత్య అకాడెమియాలోని లెఫ్టిస్ట్-ఇస్లామిస్ట్ కూటమిలో భాగంగా ఉంటూ భారత వ్యతిరేక ప్రచారాన్ని వ్యాప్తి చేసే ఇలాంటి వ్యక్తులను ఒక భారతీయ ముఖ్యమంత్రి కలవడం విద్యా విస్తరణ ఎలా అవుతుందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. భారతదేశాన్ని అంతర్జాతీయంగా నష్టపరిచే ప్రయత్నం చేసే శక్తులను విద్యావేత్తలుగా చిత్రీకరించి గౌరవించడం దేశ వ్యతిరేక శక్తులకు ఊతమివ్వడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ అగ్రరాజ్యంగా ఎదుగుతుంటే ఓర్వలేని విదేశీ శక్తులతో కాంగ్రెస్ నాయకులు జతకట్టడం వారి పాత స్వార్థ రాజకీయ వైఖరిని మరోసారి బయటపెట్టిందని రాజకీయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధి పేరుతో విదేశాలకు వెళ్లి, భారత దేశ సార్వభౌమాధికారాన్ని, హిందూ సమాజాన్ని నిరంతరం కించపరిచే వ్యక్తులతో ములాఖత్‌లు జరిపి తెలంగాణ పరువును, భారత దేశ ప్రతిష్టను దిగజార్చినందుకు రేవంత్ రెడ్డి దేశ ప్రజలకు బేషరతుగా సమాధానం చెప్పాలని జాతీయవాదులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.


