తప్పుడు రేప్ కేసు పెట్టిన యువతికి అదే శిక్ష.. కోర్టు దిమ్మతిరిగే ట్విస్ట్!
ఒక్కోసారి కోర్టుల్లో మనం ఒకటి అనుకుంటే, అక్కడ జరిగేది మరొకటి! ‘మనిషి ఒకటి తలిస్తే.. దైవం మరొకటి తలచింది’ అన్నట్లుగా ఉంటుంది వ్యవహారం. అచ్చం ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో చోటు చేసుకుంది. అసలు ఎవరూ ఊహించని విధంగా జడ్జి ఇచ్చిన ఓ తీర్పు ఇప్పుడు సంచలనంగా మారింది.
అసలేం జరిగిందంటే.. సరిగ్గా నాలుగున్నర ఏళ్ల క్రితం.. రాయ్‌బరేలీకి చెందిన ఓ యువతి, అజయ్ కుమార్ అనే యువకుడిపై అత్యాచారం కేసు పెట్టింది. బోనులో ఆమె చెప్పిన సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. అజయ్‌కి కఠిన కారాగార శిక్ష విధించింది. పాపం.. అతడు చేయని తప్పుకు ఏకంగా నాలుగున్నర సంవత్సరాలు చీకటి గదిలో జైలు జీవితం అనుభవించాడు.
అక్కడే వచ్చింది అసలు ట్విస్ట్! నాలుగున్నర ఏళ్ల తర్వాత సడన్‌గా ఆ యువతి కోర్టులో మరో పిటిషన్ వేసింది. అందులో ఏమని ఉందంటే.. “నాపై ఎలాంటి అత్యాచారం జరగలేదు. నేనే అజయ్‌పై కావాలని తప్పుడు కేసు పెట్టాను” అని పేర్కొంది. ఇది విన్న కోర్టు ఒక్కసారిగా అవాక్కైంది. ఆ పిటిషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయమూర్తి.. వెంటనే అజయ్ కుమార్‌ను నిర్దోషిగా విడుదల చేశారు.
దిమ్మతిరిగే తీర్పు.. అయితే అసలు కథ ఇక్కడే మొదలైంది. అజయ్‌ని విడుదల చేసిన తర్వాత.. ఆ యువతికి జడ్జి జీవితకాలం గుర్తుండిపోయేలా గట్టి స్ట్రోక్ ఇచ్చారు. తప్పుడు సాక్ష్యం చెప్పి ఒక అమాయకుడిని నాలుగున్నర ఏళ్ల పాటు జైలుపాలు చేసినందుకు.. ఆ యువతికి కూడా సరిగ్గా అదే నాలుగున్నర సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పారు. అప్పటివరకు అజయ్ ఎంత నరకం అనుభవించాడో, ఇప్పుడు ఈమె కూడా అదే అనుభవించాలని జైలుకు పంపారు.
అంతేకాదు, అక్షరాలా రూ. 5,88,822 భారీ జరిమానా విధించారు. ఈ ఫైన్ కట్టకపోతే మరో ఆరు నెలల పాటు అదనంగా శిక్ష అనుభవించాల్సిందేనని తేల్చి చెప్పారు.
ఇంతకీ ఈ సమంజసమైన, సంచలన తీర్పు వెలువరించిన ఆ గ్రేట్ జడ్జి పేరేంటో తెలుసా? జ్ఞానేంద్ర త్రిపాఠి. తప్పుడు కేసులు పెట్టి అమాయకుల జీవితాలతో ఆడుకునే వారికి ఆయన ఇచ్చిన ఈ తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది!


