కేజ్రీవాల్‌కు పత్రికా స్వేచ్ఛ అంటే ఇదేనా? పంజాబ్‌లో స్వతంత్ర జర్నలిస్టులపై ఆప్ డిజిటల్ దాడి!
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ద్వంద్వ వైఖరి మరోసారి బట్టబయలైంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సామాజిక మాధ్యమాల్లో యూజర్ల ఖాతాలను బ్లాక్ చేస్తోందని, పత్రికా స్వేచ్ఛను అణచివేస్తోందని కేజ్రీవాల్ విమర్శించారు. కానీ, ఆప్ అధికారంలో ఉన్న పంజాబ్‌లో మాత్రం అదే తరహా సెన్సార్‌షిప్‌కు పాల్పడుతూ, తమ ప్రభుత్వాన్ని విమర్శించే స్వతంత్ర జర్నలిస్టుల గొంతు నొక్కుతోంది. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాకుండా అడ్డుకోవడానికి చట్టాలను, ముఖ్యంగా ‘కాపీరైట్’ నిబంధనలను ఒక ఆయుధంగా వాడుకుంటూ కేజ్రీవాల్ పార్టీ తన హిపోక్రసీని (కపటత్వాన్ని) చాటుకుంది.
పంజాబ్‌లో స్వతంత్ర జర్నలిస్టులు, స్థానిక మీడియా సంస్థల ఫేస్బుక్ పేజీలను లక్ష్యంగా చేసుకుని ఆప్ ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు దిగింది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు, ప్రభుత్వాన్ని విమర్శించిన కనీసం 48 వీడియోలు, పోస్టులపై ఆమ్ ఆద్మీ పార్టీ ఉద్దేశపూర్వకంగా కాపీరైట్ క్లెయిమ్స్ వేసింది. ఈ కాపీరైట్ స్ట్రైక్స్ (Copyright Strikes) కారణంగా జనవరి నుంచి ఏప్రిల్ 2026 మధ్య కాలంలో ఐదు ప్రముఖ ఫేస్బుక్ వార్తా పేజీలను తొలగించారు. ఈ ఐదు పేజీలకు కలిపి దాదాపు 30 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉండటం గమనార్హం. తమ విధానాలను ప్రశ్నిస్తున్నారన్న కారణంతో పంజాబ్ ప్రభుత్వం తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ డిజిటల్ సెన్సార్‌షిప్‌కు తెరలేపింది.

ఆప్ చేసిన కాపీరైట్ క్లెయిమ్స్ ఎంత విడ్డూరంగా ఉన్నాయంటే, ప్రభుత్వ సమాచారాన్ని కూడా తమ సొంత ఆస్తిగా పార్టీ పేర్కొంది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సోషల్ మీడియా పోస్టులు, ఏఐ (AI) ద్వారా రూపొందించిన చిత్రాలు, సిక్కు మత సంస్థల పత్రికా ప్రకటనలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఫోటోలు, చివరకు రాష్ట్ర అసెంబ్లీ (విధాన సభ) లోని ఫోటోలను సైతం వాడినందుకు జర్నలిస్టులపై కాపీరైట్ స్ట్రైక్స్ వేశారు. కాపీరైట్ చట్టం ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాలు లేదా అసెంబ్లీ దృశ్యాలు ఏ ఒక్క రాజకీయ పార్టీ సొంత ఆస్తి కానప్పటికీ, కేవలం విమర్శకులను భయపెట్టడానికే ఆప్ ఈ చౌకబారు ఎత్తుగడలకు పాల్పడింది.

ప్రభుత్వ వేధింపులు భరించలేక పలువురు జర్నలిస్టులు పంజాబ్ మరియు హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. ఒక ముఖ్యమంత్రి పబ్లిక్ ఇమేజ్ను, రాజకీయ పార్టీ తన సొంత ఇంటలెక్చువల్ ప్రాపర్టీ (IP)గా మార్చుకుని రిపోర్టింగ్‌ను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని జర్నలిస్టులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నెలల తరబడి ఈ పేజీలు బ్లాక్‌లోనే ఉండిపోయాయి. అయితే, ఇటీవల ఈ విషయంపై జాతీయ స్థాయి సంస్థలు మెటా (ఫేస్బుక్ మాతృసంస్థ)ను ప్రశ్నించడంతో, పొరపాటున ఈ అకౌంట్లను తొలగించామని ఒప్పుకుని, మెటా ఆయా ఖాతాలను తిరిగి పునరుద్ధరించింది. భవిష్యత్తులో ఈ కాపీరైట్ వేధింపుల నుండి తప్పించుకోవడానికి చాలా మంది జర్నలిస్టులు ఆప్ నేతల ముఖాలను బ్లాక్ చేస్తూ వార్తలు ప్రచురించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పంజాబ్ ప్రభుత్వ నియంతృత్వ పోకడలపై ప్రతిపక్షాలు సైతం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. అసెంబ్లీ వీడియోలను వాడుకుంటూ స్వతంత్ర మీడియాపై కాపీరైట్ స్ట్రైక్స్ వేసే అధికారం రాజకీయ పార్టీకి ఎక్కడిదని కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్గత్ సింగ్ ఎన్నికల సంఘానికి, అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. మరోవైపు, ఈ విమర్శలపైన ఆప్ వింత వాదన చేస్తోంది; బాధిత వ్యక్తులకు జర్నలిజం డిగ్రీలు లేవని, అందుకే వారిని జర్నలిస్టులుగా పరిగణించలేమని ఆప్ పంజాబ్ మీడియా ఇంఛార్జి బుకాయించారు. మొత్తానికి ఢిల్లీలో మీడియా స్వేచ్ఛ గురించి లెక్చర్లు దంచే కేజ్రీవాల్ పార్టీ, పంజాబ్‌లో మాత్రం చట్టాలను ఆయుధాలుగా వాడుకుని పత్రికా స్వేచ్ఛను ఎలా అణచివేస్తోందో ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది


