ఢిల్లీ ‘సర్జికల్ సైలెన్స్’ వెనుక అసలు కథ: దమ్మున్న నేతలకు మొండిచేయి.. గ్రేటర్ ఎన్నికల వేళ బీజేపీకి చావుదెబ్బ?
బీజేపీ జాతీయ కార్యవర్గంలో ఇతర రాష్ట్రాలకు పెద్దపీట వేసిన కేంద్ర నాయకత్వం, తెలంగాణను పూర్తిగా పక్కన పెట్టడం రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్రంలో అధికారమే లక్ష్యమని చెప్పుకునే అధిష్టానం, కీలక నియామకాల్లో ఇక్కడి నేతలను ఉపేక్షించడం వెనుక.. రాష్ట్ర నాయకత్వం తీరుపై ఉన్న తీవ్ర అసహనమే కారణమని స్పష్టమవుతోంది. అంతర్గత కుమ్ములాటలు, వ్యక్తిగత ఎజెండాలు, స్వార్థ రాజకీయాలతో పార్టీని బలహీనపరుస్తున్న నేతలకు పదవులు ఇచ్చి ప్రోత్సహించే ప్రసక్తే లేదని ఢిల్లీ పెద్దలు ఈ నిర్ణయం ద్వారా గట్టి హెచ్చరికలు జారీ చేసినట్లు కనిపిస్తోంది.

ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో పొత్తు విషయంలో ఏకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలి అనేది పూర్తిగా కేంద్ర నాయకత్వం పరిధిలోని అంశం. అమిత్ షా, జేపీ నడ్డా లాంటి అగ్రనేతలు తీసుకోవాల్సిన కీలక నిర్ణయాలపై.. స్వయంగా రాష్ట్ర అధ్యక్షుడే బహిరంగంగా “పొత్తు వద్దు” అని ఎలా ప్రకటిస్తారు? అసలు అధిష్టానం నిర్ణయించాల్సిన వ్యవహారంలో ఆయన ఎలా జోక్యం చేసుకుంటారు? ఉద్దేశపూర్వకంగానే పవన్‌తో మైత్రిని చెడగొట్టే కుట్రలు జరుగుతున్నాయా అన్న అనుమానాలు క్షేత్రస్థాయి కార్యకర్తల్లో బలంగా వ్యక్తమవుతున్నాయి. బాధ్యతాయుతమైన అధ్యక్ష స్థానంలో ఉండి ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై ఢిల్లీ పెద్దలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం.
మరోవైపు, తెలంగాణలో పార్టీని వీధి పోరాటాలతో అగ్రస్థానంలో నిలిపిన మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై జరిగిన కుట్రలు కమలదళాన్ని కుదిపేస్తున్నాయి. ఆయన కుమారుడిపై నమోదైన వివాదాస్పద కేసు సమయంలో సొంత పార్టీలోని కొందరు నాయకులు వ్యూహాత్మకంగా “యాంటీ”గా వ్యవహరించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. కష్టకాలంలో అండగా నిలవాల్సింది పోయి, ఆ కేసును అడ్డుపెట్టుకుని ఆయన ఇమేజ్ను దెబ్బతీయడానికి సొంత నేతలే తెరవెనుక పావులు కదిపారనే వ్యవహారం అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. పార్టీ ఎదుగుదలకు కారణమైన నాయకుడికే సొంత పార్టీ నేతలు వెన్నుపోటు పొడిచే సంస్కృతి పెరిగిపోవడంపై కేంద్రం సీరియస్ గా ఉన్నట్లు అర్థమవుతోంది.
బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కనిపించిన అగ్రెసివ్ ఫైట్, వీధుల్లో కనిపించిన ఉద్యమస్ఫూర్తి.. ప్రస్తుత నాయకత్వంలో పూర్తిగా లోపించింది. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో కొత్త నాయకుల పనితీరు అత్యంత పెలవంగా ఉండటం, ప్రభుత్వ వైఫల్యాలపై విరుచుకుపడకపోవడం కార్యకర్తల్లో తీవ్ర నైరాశ్యాన్ని నింపుతోంది. అటు భవిష్యత్ సీఎం అభ్యర్థి ఎంపిక, ఇటు జనసేన పొత్తు సమీకరణాలపై స్పష్టత లేకపోవడంతో పాటు, అంతర్గత కుట్రల మధ్య సమన్వయం సాధించడం అసాధ్యంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఎవరికి పదవులు ఇచ్చినా గ్రూపు రాజకీయాలు మరింత ముదురుతాయనే ఉద్దేశంతోనే ఢిల్లీ నాయకత్వం జాతీయ కార్యవర్గ నియామకాల్లో సైలెంట్ గా ఉన్నట్లు స్పష్టమవుతోంది.
రానున్న జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికల వేళ ఈ నాయకత్వ వైఫల్యం, అంతర్గత సంక్షోభం బీజేపీకి చావుదెబ్బగా మారే ప్రమాదం ఉంది. గత గ్రేటర్ ఎన్నికల్లో అద్భుత విజయాలు సాధించి సత్తా చాటిన పార్టీ, నేడు స్వయంకృతాపరాధాలతో ఆత్మరక్షణలో పడింది. గ్రూపు తగాదాలు, కోవర్టు రాజకీయాలు, కేంద్ర నిర్ణయాలను బహిరంగంగా ధిక్కరించే ధోరణి ఇలాగే కొనసాగితే గ్రేటర్ పీఠాన్ని దక్కించుకోవడం అసాధ్యం. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం ఉక్కుపాదంతో రాష్ట్ర నాయకత్వంలోని లోపాలను సరిదిద్ది, క్షేత్రస్థాయిలో పోరాడే నాయకులకు అండగా నిలబడకపోతే రాబోయే ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.


