రాపిడో దారుణం! కుల దూషణలను ఎదిరించిన దళిత డ్రైవర్ ఐడీ 99 ఏళ్లు బ్యాన్!
లక్నోలో కుల వివక్ష వ్యాఖ్యలను వ్యతిరేకించినందుకు గాను ఒక డ్రైవర్‌పై ప్రముఖ రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫామ్ రాపిడో (Rapido) తీవ్ర చర్య తీసుకుంది. ప్రయాణికుల ఫిర్యాదు ఆధారంగా అతడి డ్రైవర్ ఐడీని ఏకంగా “99 ఏళ్ల 11 నెలల” పాటు (దాదాపు 100 సంవత్సరాలు) సస్పెండ్ చేసింది. మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేసి, రాపిడో క్యాబ్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న 30 ఏళ్ల అంకిత్ కుమార్ అనే దళిత యువకుడికి ఈ చేదు అనుభవం ఎదురైంది.
అంకిత్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఉత్తరతియా రైల్వే స్టేషన్ నుంచి చార్బాగ్ స్టేషన్‌కు వెళ్లేందుకు నలుగురు ప్రయాణికులు అతడి రాపిడో క్యాబ్‌ను బుక్ చేసుకున్నారు. ప్రయాణ సమయంలో ఆ ప్రయాణికులు ఒక ఉన్నతాధికారిని ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడుతూ, ఆయన సామర్థ్యాన్ని కులంతో ముడిపెడుతూ అవమానకర, వివక్షాపూరిత వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు.
వారి సంభాషణలో కుల దూషణలు శృతిమించడంతో అంకిత్ కలగజేసుకుని అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఒక వ్యక్తి ప్రతిభకు, కులానికి సంబంధం లేదని, వాహనంలో అలాంటి వివక్షాపూరిత మాటలు మాట్లాడవద్దని వారిని కోరాడు. అయినా వారు తమ వ్యాఖ్యలను కొనసాగించడంతో, తీవ్ర మనస్తాపానికి గురైన అంకిత్ తేలీబాగ్ సమీపంలో వాహనాన్ని నిలిపివేసి, నలుగురు ప్రయాణికులను కిందకు దిగిపోవాలని స్పష్టం చేశాడు.
ప్రయాణికులు వాహనం దిగిన తర్వాత ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమై విస్తృతంగా వైరల్ అయింది. కుల వివక్షను ప్రశ్నించినందుకు గాను సోషల్ మీడియా వేదికగా తనకు బెదిరింపులు, అసభ్యకర సందేశాలు వస్తున్నాయని అంకిత్ తెలిపాడు.
మరోవైపు, ఆ ప్రయాణికులు రాపిడో యాప్‌లో అంకిత్‌పై తప్పుడు ఫిర్యాదు చేయడంతో, రాపిడో సంస్థ అతడి ఖాతాను దాదాపు వందేళ్ల పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. డ్రైవర్ వైపు వాదన వినకుండా, అసలు ఏం జరిగిందో కనీస విచారణ జరపకుండానే రాపిడో యాజమాన్యం ఏకపక్షంగా తన ఖాతాను నిలిపివేసిందని అంకిత్ ఆవేదన వ్యక్తం చేశాడు.
కుటుంబంలో తానే ఏకైక సంపాదనపరుడినని, దినసరి కూలీ అయిన తండ్రి, తల్లిని పోషించేందుకు రాపిడో నడపడమే ఆధారమని అంకిత్ పేర్కొన్నాడు. అకస్మాత్తుగా ఖాతా రద్దు కావడంతో తన జీవనోపాధి పూర్తిగా స్తంభించిపోయిందని, సంస్థలు కార్మికుల వాదనను కూడా పరిగణనలోకి తీసుకుని న్యాయం చేయాలని అతను డిమాండ్ చేశాడు.


