వందేమాతరం ఎవరి జాగీరూ కాదు.. అమరవీరుల త్యాగఫలం: సోనియా గాంధీకి బంకించంద్ర వారసుడి స్ట్రాంగ్ కౌంటర్!
జాతీయ గీతం ‘వందేమాతరం’ రచయిత బంకించంద్ర చటోపాధ్యాయ ప్రత్యక్ష వారసుడు, పశ్చిమ బెంగాల్లోని నైహతి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సుమిత్రో ఛటర్జీ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీకి ఒక ఘాటైన లేఖ రాశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఏఐసీసీ (AICC) ప్రధాన కార్యాలయంలో జరిగిన ఉత్సవాల్లో వందేమాతరం పూర్తి వెర్షన్ ఆలపిస్తున్న సమయంలో సోనియా గాంధీ అసహనం వ్యక్తం చేశారని, దానిని మధ్యలోనే నిలిపివేయడానికి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. ఈ చర్య కేవలం దురదృష్టకరం మాత్రమే కాదని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న చారిత్రక తప్పిదాల పునరావృతం అని ఆయన మండిపడ్డారు.
ఈ వ్యవహారంపై సుమిత్రో ఛటర్జీ తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేశ ప్రజలకు, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ వాసులకు సోనియా గాంధీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్వతంత్ర భారతదేశ గడ్డపై, దేశమంతా మాతృభూమిని ఆరాధిస్తున్న వేళ వందేమాతరంపై అసహనం ప్రదర్శించడం అంటే ఖుదీరాం బోస్ వంటి ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల ప్రాణత్యాగాలను అవమానించడమేనని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఒక సాధారణ పౌరుడిగా, దేశభక్తుడిగా మరియు బంకించంద్ర కుటుంబ ప్రత్యక్ష వారసుడిగా తాను ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

వందేమాతరం ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ, శ్రీ అరబిందో చెప్పినట్లుగా ఈ మంత్రం యావత్ జాతిని దేశభక్తి అనే ధర్మంలోకి నడిపించిందని ఛటర్జీ వివరించారు. 1896 కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలపించినప్పటి నుంచి, 1905 బనారస్ సమావేశంలో సరళా దేవి చౌధురాని పాడిన సందర్భం, 1909లో తిలక్ దేశద్రోహం విచారణ సమయంలో ప్రజలు నినదించడం, 1938లో నిజాం ఆంక్షలను ధిక్కరించి ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు సాగించిన పోరాటం వరకు వందేమాతరమే భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరిగా నిలిచిందని ఆయన ప్రస్తావించారు.

కాంగ్రెస్ పార్టీ చరిత్రను దుయ్యబడుతూ, 1937లో మొహమ్మద్ అలీ జిన్నా అభ్యంతరాలకు తలొగ్గి కాంగ్రెస్ వందేమాతరం గీతాన్ని కుదించిందని, ఇప్పటికీ అదే “ద్వంద్వ విధానం” మరియు రాజీ ధోరణి ఆ పార్టీ వైఖరిలో కనిపిస్తోందని ఛటర్జీ ఆరోపించారు. బెంగాల్లో కాంగ్రెస్ విద్యార్థి విభాగం (ఛాత్ర పరిషత్) సైతం ‘వందేమాతరం’ నినాదాన్ని వాడుతుండగా, అధిష్టానం మాత్రం ఆ గీతం పట్ల వ్యతిరేకత చూపడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.
వందేమాతరం అనేది ఏ ఒక్క రాజకీయ పార్టీ సొత్తు కాదని, అది దేశ సమిష్టి స్మృతి మరియు అమరవీరుల త్యాగాల పునాదులపై నిలిచిన పవిత్ర జాతీయ ప్రతీక అని ఆయన స్పష్టం చేశారు. సొంత దేశ స్వాతంత్ర్య మూల మంత్రాన్ని గౌరవించలేని ఏ నాయకత్వాన్నైనా చరిత్ర ఎప్పటికీ క్షమించదని, కాలగర్భంలో కలిసిపోక తప్పదని హెచ్చరించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం కాంగ్రెస్ తీరును తీవ్రంగా తప్పుబడుతూ బహిరంగ సభల్లో విమర్శలు గుప్పించడంతో ఈ వివాదం మరింత పెద్ద రాజకీయ చర్చగా మారింది.


